సందట్లో సడేమియా..క్షిపణి పరీక్షల్లో కిమ్ !

Sharing is Caring...

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో కిమ్ క్షిపణి ప్రయోగం చేసి వార్తల్లో కెక్కారు. ఒక పక్క పుతిన్ అణుయుద్ధం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో  కిమ్ ప్రయోగాలు సందట్లో సడేమియాగా మారాయి.

గత కొంతకాలంగా  ప్రజల ఆకలి తీర్చలేక చేతులెత్తేసిన  కిమ్ ఆయుధ పరీక్షల్లో మాత్రం దూకుడు గా ఉన్నారు. కాగా కిమ్ ప్రయోగించింది ఒక బాలిస్టిక్ మిసైల్ అని దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు అంటున్నారు.  జపాన్ సముద్ర జలాల్లోకి ఈ బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించడం మూలానా తమ దేశ భద్రతకు ముప్పు అని ఆయా దేశాలు వాపోతున్నాయి.

అయితే ఇవేవి పట్టించుకునే స్థితిలో కిమ్ లేరు. ఆయన ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే . గత కొన్నాళ్లుగా దూకుడు మరింతగా పెంచిన కిమ్ కొత్త తరహా ఆయుధాల పరీక్షల్లో నిమగ్నమైనారు.  ఏనాటికైనా అమెరికాను టార్గెట్ చేయటమే కిమ్ లక్ష్యం. అందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నారు.

అమెరికా ఉత్తర కొరియాపై  అక్కసుతో ఉన్నందునే కిమ్ అణు క్షిపణుల పరీక్షలను ముమ్మరం చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర కొరియాకు ఈశాన్య తీరాన 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న అల్సోమ్ ద్వీపం నుంచి కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేస్తుంటారు.కేవలం ఒక్క నెల కాలంలోనే కిమ్ ఏడు సార్లు క్షిపణి ప్రయోగాలను నిర్వహించారు. చైనా వింటర్ ఒలంపిక్స్ కారణంగా తాత్కాలికంగా వాటిని నిలిపివేశారు.ఇటీవల అవి ముగియడంతో కిమ్ మళ్లీ తన దూకుడు పెంచారు. 

తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే ఆంక్షలను సడలించాలని కిమ్ డిమాండ్లకు అమెరికా లొంగలేదు. దీంతో కిమ్ జో బిడెన్ పై గుర్రుగా ఉన్నారు. మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన నిరాయుధీకరణ చర్చలకు రమ్మని పిలిచినప్పటికీ కిమ్ వెళ్ళలేదు. బిడెన్ కూడా ఉత్తర కొరియా అధినేతతో సమావేశానికి పెద్ద ఆసక్తి చూపలేదు.

అంతకుముందు కిమ్ మూడుసార్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ ఉత్తర కొరియా అణు ఆయుధాగారాన్ని మూసివేయడానికి ట్రంప్ అప్పట్లో ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు అమెరికానే కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్‌ కూడా పెట్టింది

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!