బాబు బాటలోనే కేసీఆర్ .. సీబీఐ కి నో ఎంట్రీ !!

Sharing is Caring...

No permissions……………………………..

రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్‌ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది.

ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు కొనసాగుతోంది. దానికి తోడు కేసీఆర్‌ జైలుకు పోవుడు ఖాయమంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు అవకాశం దొరికిన ప్రతిసారీ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సాధారణ సమ్మతిని తెలంగాణా సర్కార్ ఉపసంహరించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ తరహాలో తెలంగాణలోనూ సీబీఐకి ఇక ప్రవేశం ఉండదు.సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకునే ముందు న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించింది.

తర్వాత గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు  ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో  స్పష్టం చేసింది.ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో సీబీఐకి  ఎంట్రీ కి నో చెప్పిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. తమ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి  సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో ఉపసంహరించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

2018లో  తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి, మోదీ సర్కారు నుంచి బయటకు వచ్చినపుడు ఇదే పని చేశారు. చంద్రబాబు  తన సర్కారు పై కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమోనన్న అనుమానంతో సీబీఐ కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు.  కేసీఆర్ కూడా ఇపుడు అదే బాటలో నడిచారు.

ఇదే బాటలో బెంగాల్‌, ఛత్తీ్‌స్ ఘడ్ , రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లు తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని కొన్నాళ్ల కిందటే ఉపసంహరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ఏర్పడ్డాక  జనరల్‌ కన్సెంట్‌ను పునరుద్ధరించింది.

గతంలో కర్ణాటకలో కూడా సీబీఐకి నో ఎంట్రీ చెప్పినా… ఆ తర్వాత జనరల్‌ కన్సెంట్‌ను పునరుద్ధరించారు. కొన్నాళ్ల క్రితం బెంగాల్‌లో ఓ కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీ్‌సు లు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అప్పట్లో ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ బీ ఆర్ ఎస్ పార్టీ పెట్టి కేంద్రం తో ఘర్షణకు దిగుతున్న క్రమం లో ఈ  నిర్ణయం వివాదాస్పదమయ్యే సూచనలు లేకపోలేదు. ఇక సీబీఐ కోర్టు కెళ్ళి అధికారులు పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది.

లాలూప్రసాద్ యాదవ్ , వీరభద్రసింగ్ , మధుకోడా వంటి నేతల విషయంలో సీబీఐ అదే పని చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అవినీతి, పెద్ద మొత్తంలో నగదు బదిలీకి సంబంధించి ఈడీ చేపడుతున్నకేసుల దర్యాప్తును ఎవరూ ఆపలేరు. ఆ సంస్థ తనపని తాను చేసుకు వెళుతుంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!