Bharadwaja Rangavajhala…………………
Does politics separate friends?……………………………
అన్నాదురై చేతుల మీదుగా సినిమా రంగ ప్రవేశం చేసి కథకుడుగా మాటల రచయితగా తనదైన ముద్ర వేసిన నాయకుడు కరుణానిధి. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. పద్నాలుగో ఏట జస్టిస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితుడై ఆ పార్టీ దిశగా తన నడక ప్రారంభించారు. అలా పెరియార్ రామస్వామికి సన్నిహితుడయ్యారు.తమిళ మానవర్ మంద్రం పేరుతో ఒక విద్యార్ది సంఘాన్ని ప్రారంభించారు.
రాజకీయాలతో పాటు సినిమా రంగం మీదా తన దృష్టిని ప్రసరించిన కరుణానిధి రాసిన మంత్ర కుమారి కథతో రూపొందిన ఎమ్జీఆర్ సినిమా భారీ విజయం సాధించింది. శివాజీ తొలి చిత్రం పరాశక్తి కి కరుణానిధి సంభాషణల రచయితగా పన్జేశారు.మంత్రకుమారి కన్నా ముందే కరుణానిధి సినిమాల్లో ఉన్నారు. ఆయన తొలి చిత్రం రాజకుమారి. 1947లో విడుదలైన ఆ సినిమాలో కథానాయకుడు కూడా ఎమ్జీఆరే. కరుణ కథ రాసిన ఆ సినిమా భారీ విజయం సాధించి నిర్మాతలకు కాసుల పంట పండించింది.
అలా మొదలైన సినీ రచనా కార్యక్రమం సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 2011లో విడుదలైన ప్రశాంత్ సినిమా పొన్నార్ శంకర్ కూడా కరుణానిధి నవల ఆధారంగా తీసిన సినిమానే.1957 సంవత్సరంలో … కులితలై నియోజకవర్గం నుంచి కరుణానిధి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తాను పోటీ చేసిన మొత్తం 13 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరుణానిధి విజయం సాధించారు. అన్నాదురై ఆకస్మిక మరణ సమయంలో పార్టీ కార్యకలాపాలను భుజాన వేసుకుని తనే ముఖ్యమంత్రి బాధ్యతలను తలకెత్తుకున్నారు.
పార్టీలో తనతో సమానమైన హోదాను అనుభవించిన ఎమ్జీఆర్ ను కేవలం పార్టీ ప్రచార కార్యక్రమాలకే పరిమితం చేసే ప్రయత్నం చేశారు. కాబినెట్ లో కూడా స్థానం ఇవ్వలేదు. ఆ నిర్ణయమే వారిద్దరి మధ్య దూరాన్ని పెంచింది.కేరళ పాలక్కాడ్ జిల్లాలోని వడవన్నూర్ ఎమ్జీఆర్ స్వగ్రామం. ఆయన తాతల కాలంలోనే ఆ కుటుంబం శ్రీలంక వెళ్లి స్థిరపడింది.
తండ్రి ఆకస్మిక మరణంతో వీధిన పడ్డ కుటుంబాన్ని పోషించుకోడానికి ఎమ్జీఆర్ రంగస్థలం మీద నాటకాలు ఆడడం ప్రారంభించారు.మధురై ఒరిజినల్ బాయ్స్ నాటక సమాజంలో ప్రారంభమైన నట ప్రయాణం 1947లో సినిమాల్లోకి తెచ్చింది. యాభై దశకం నాటికే ఎమ్జీఆర్ మాస్ హృదయాల్లో తిరుగులేని హీరోగా నిలదొక్కుకున్నారు.
ఎమ్జీఆర్ మాస్ హృదయాల్లో తిరుగులేని నాయకుడుగా స్థానం ఏర్పరచుకోడానికి ప్రదాన కారణం ఆయన నటించిన చిత్రాల్లో ఆయన ధరించిన పాత్రలను మలచిన రచయితల దృక్పధం. అన్నాదురై, కరుణానిధి లాంటి అభ్యుదయాంశాలు బలంగా ఉన్న రచయితలు ప్రజా సమస్యలను ఆధిపత్య వర్గాలపై తిరుగుబాటు చేయాల్సిన అవసరాన్ని చెప్పే కథలనూ ఎక్కువగా రూపొందించేవారు. ఆ కథలలో నాయకుడుగా తెర మీద ఎమ్జీఆర్ కనిపించగానే విప్లవనాయకుడుగానే అనిపించేవారు.
పెరియార్ రోజుల నుంచీ ద్రవిడ రాజకీయాల పట్ల ఆకర్షితుడై ఉన్న ఎమ్జీఆర్ 1953లో అన్నాదురై నేతృత్వంలో ఏర్పడిన డిఎమ్కె పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.ఆ పార్టీ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఊరూరా ఆయన చేసిన ప్రచారమూ … ఆయనకున్న పాపులార్టీ ఇవన్నీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాదని డిఎమ్కే పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించాయి.
అన్నా మరణానంతరం పార్టీలో అధికారం ఎవరికి ఉండాలి అనే అంశంపై జరిగిన చర్యల్లో కరుణానిధి ఎమ్జీఆర్ ల మధ్య పెరిగిన దూరం కారణంగా ఎమ్జీఆర్ ను పార్టీ నుంచీ బహిష్కరించారు కరుణానిధి.డీఎంకే నుంచీ బహిష్కరణకు గురి కావడం విడుదలగానే భావించారు ఎమ్జీఆర్.
వెంటనే అన్నాడిఎమ్కే పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో డిఎమ్కేను అధికారం నుంచీ దించి తాను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అలా భారతదేశంలోనే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడుగా చరిత్రకెక్కారు.
సినిమాల్లో ఉండగానే యూనియన్ వ్యవహారాల్లో ఎమ్జీఆర్ తో విభేదించిన ఎమ్.ఆర్ రాధ షూటింగులో పాల్గొంటూ తుపాకీతో ఎమ్జీఆర్ పై కాల్పులు జరిపారు. ఆ తూటా ఆయన గొంతులో దిగి మాట పడిపోయింది…తీవ్ర అనారోగ్యం మధ్యే ఆయన సినిమాలూ చేశారు .. కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలనా అందించగలిగారు.
1977లో తొలి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎమ్జీఆర్ వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగారు. తమిళనాడులో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎమ్జీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రవేశపెట్టిన పథకాలూ ఆయన్ని ప్రజలకు దగ్గర చేసినాయి.అయితే నాస్తిక , హేతువాదాలు ప్రధాన సైద్దాంతిక భూమికలుగా ఉన్న ద్రవిడ ఉద్యమంలోకి దైవభక్తిని తీసుకువచ్చిన వ్యక్తిగా కూడా ఎమ్జీఆర్ గుర్తుండిపోతారు.
మూడోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది …1987 డిసెంబర్ 24వ తేదీన ఎమ్జీఆర్ కన్నుమూశారు. ఆయన మరణానంతరం జరిగిన నాటకీయపరిణామాల నేపధ్యంలో ఎమ్జీఆర్ రాజకీయ వారసురాలుగా ప్రకటించుకున్న జయలలితను పక్కన పెట్టి జానకీ రామచంద్రన్ కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు. అంతే నాటకీయంగా తిరిగి ఏడీఎంకే పార్టీ పగ్గాలు తిరిగి జయలలిత చేతికి వెళ్లాయి.