Bharadwaja Rangavajhala……..
Tamil politics has taught us many things? …………………….
ఎమ్జీఆర్ మరణించిన సమయంలో జయలలితను పార్టీ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఎమ్జీఆర్ పార్దివదేహాన్ని తీసుకువెడుతున్న వాహనం నుంచీ దించేయడంతో సహా అనేక విధాలుగా ఆమెను పార్టీకి.. ఎమ్జీఆర్ వారసత్వానికీ దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నమే చేశారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్జీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ను వారసురాలిగా ప్రకటించి ముఖ్యమంత్రిని చేశారు. నిజానికి అప్పటికి ఎమ్జీఆర్ కూడా జయలలితను దూరంగానే ఉంచారు.తెలుగు తమిళ నటి సంధ్య కుమార్తె జయలలిత. చాలా చిన్న వయసులోనే తల్లి బలవంతం మీద సినిమాల్లో ప్రవేశించారు జయలలిత. ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లాంటి నాటి దక్షిణాది అగ్రహీరోల సరసన వరస సినిమాలు చేయడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే జయలలిత పాపులర్ అయ్యారు.
సంధ్య ముందుండి కుమార్తె తెర జీవితాన్ని తీర్చిదిద్దారు.ఎమ్జీఆర్ తో మొదలైన నట ప్రయాణం ఆయన నుంచీ డీఎంకే నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టినప్పుడు అందులో చేరాలనుకున్నారు. అయితే అప్పటికి తను సినిమాలో బిజీగా ఉండటంతో 1982లో ఏఐడీఎంకే లో సభ్యత్వం తీసుకున్నారు.సాధారణ సభ్యురాలిగా అన్నా డీఎంకే లో చేరిన జయలలిత పార్టీ ప్రచార కార్యదర్శిగా ఎదిగారు.
డీఎంకే రోజుల్లో అదే పదవి ఎమ్జీఆర్ చేశారు. అదే సమయంలో జయలలితను రాజ్యసభకు పంపారు ఎమ్జీఆర్. రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న కాలంలోనే ఎమ్జీఆర్ కూ జయకూ కొంత దూరం పెరిగింది.ఎమ్జీఆర్ మరణానంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో జయలలిత రాష్ట్ర శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలో ప్రజలు డీఎంకే కు అధికారం అప్పగించారు.
కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్జీఆర్ మరణానంతరం ఏఐడీఎంకే లో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన అంతర్గత కుమ్ములాట కారణాన ప్రజలు ఆ పార్టీని ఓడించారు. అయితే ప్రతిపక్ష నాయకురాలి హోదాలో జయలలిత పనితీరు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే ఏఐడీఎంకే కి తిరిగి ప్రజలు అధికారం అప్పగించేలా చేయగలిగింది.
జయలలిత ను తమిళ ప్రజలు అమ్మ అనే వ్యవహరించేవారు. ఎమ్జీఆర్ హయాంలో చాలా పాపులర్ అయిన స్కూలు విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం లాంటి వాటి అమలును పార్టీ తరపున పర్యవేక్షించినది జయలలితే.అలాగే అనేక సంక్షేమ పథకాల రూపకల్పన విషయంలో ఎమ్జీఆర్ స్వయంగా జయ సలహాలు అడిగేవారట. అలాగే తన ఎన్నికల వాగ్దానాల్లోనూ ఇతర ఉపన్యాసాల్లోనూ ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకే పెద్ద పీట వేసేవారు.
అలా అమ్మగా తమిళ ప్రజల హృదయాల్లో నిలచిపోయిన జయలలిత మీద ఎప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినా .. చివరకు అరెస్ట్ అయినా … జైలుకెళ్లినా ప్రజలు జయలలితను గెలిపిస్తూనే వచ్చారు.1991 లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జయలలిత నాలుగు సార్లు ఆ పదవిలో కొనసాగారు. జయలలిత తల్లి సంధ్య తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందినవారు కావడంతో జయలలిత మీదా అలాగే ఏఐడీఎంకే మీదా కొన్ని సైద్దాంతిక ఆరోపణలు ఉండేవి.
ఏది ఏమైనా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా మొదలైన ద్రవిడ మున్నేట్ర కళగం మీద నెమ్మదిగా బ్రాహ్మణాధిపత్యం వచ్చేసింది. ఇది డీఎంకే ప్రధాన ఆరోపణ మాత్రమే కాదు వాస్తవం కూడా. పూజలు గుళ్లల్లో గోలలు.. తిరునాళ్లు ఇవన్నీ ఎమ్జీఆర్ అధికారంలోకొచ్చాక మితిమీరాయి. అయితే జయలలిత ఎన్నడూ ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు.
కరుణానిధి అరెస్ట్ సమయంలో వచ్చిన విమర్శలతో మొదలుపెట్టి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులొచ్చినా చాలా గంభీరంగా వాటిని ఎదుర్కోవడం జయలలిత గొప్పతనం.అందుకేనేమో జయలలితను తమిళ ప్రజలు ఐరన్ లేడీగా పిల్చుకునేవారు.జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే పార్టీలో ఉన్న విబేదాలు బయటపడ్డాయి. జయలలిత సన్నిహితురాలు శశికళ మీద కేసులు నమోదు కావడం జైలుకి చేరడం లాంటి అద్భుతమైన నవరసభరితమైన ఘట్టాలు అనేకం ఆ పార్టీని చుట్టుముట్టాయి.
అయితే ప్రత్యర్ధి శిబిర నాయకుడు కరుణానిధి కూడా ఇదే సమయంలో కన్నుమూయడం ఒక విషాదం. ఈ పరిస్థితుల్లోనే తమిళ రాజకీయాలు కళావిహీనమయ్యాయనే వ్యాఖ్యలు వినిపించాయి. ఒకటి మాత్రం నిజం డీఎంకే పార్టీ తొలి రోజల్లో నాస్తికత, హేతువాదంతో పాటు ద్రవిడ ఆలోచనలకు కేంద్రంగా చెన్నై వర్ధిల్లేది.
అయితే ఏఐడీఎంకే అధికారంలోకి వచ్చాక సన్నివేశం మారింది. కేవలం ప్రజా రంజక పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా పాలన సాగించడంతో పాటు మూఢనమ్మకాలకు పెద్ద పీట వేయడం కూడా జరిగింది. అలా ద్రవిడ ఉద్యమాన్ని నీరు కార్చడాన్ని మాత్రం ఈ ప్రయాణంలో మనం చూడవచ్చు… కాంగ్రెస్ తో అంటకాగడం … స్కాములూ ఇలా రాజకీయాల్లో సర్వ దిక్కుమాలిన కార్యక్రమాలనూ తీసుకువచ్చిన ఘనత కూడా మనం చూడచ్చు.
నెమ్మదిగా డీఎమ్కే కూడా సర్వభ్రష్టత్వం సంపాదించింది.
తమిళ రాజకీయాల్లో కరుణానిధి మరణంతో ఒక శకం ముగిసింది. ఆ సందర్భంలోనే రాజకీయాలు కళావిహీనమయ్యాయనే మాటా వినిపించింది. ఏది ఏమైనా పెరియార్, అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీఆర్ వాళ్లే సూపర్. అంత వరకే …తమిళ కళా రాజకీయాలు ప్రపంచానికి పంచిన జ్ఞానం …
ఎన్నికలప్పుడు మాత్రమే కేంద్రంతో గొడవలు పడాలిగానీ మిగిలిన రోజుల్లో సఖ్యత పాటించడమే బెటరు.
సంక్షేమ పథకాలే ప్రజలకు గుర్తుంటాయి. వారిని ఇబ్బంది పెట్టకుండా మనం రాజకీయాలు నడపాలిగానీ కాదంటే అసలు కే మోసం వస్తుంది. వ్యక్తి ఆరాధనను పూజను పీక్స్ లోకి తీసుకెళ్లగలిగితే అంతగా మన నాయకత్వం వర్థిల్లుతుంది.ఇలా అనేక విషయాలు మనకు తెలియచేసినందుకు తమిళ రాజకీయాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా…