వాడి దోస్తానాకి దోసిలి పట్టాల్సిందే !

Sharing is Caring...

Taadi Prakash………………………….

అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం అని కొందరంటారు. పొగాకు గోడౌన్ల ఎదురుగా ఒక స్తంభానికి కోటేశుని కట్టేశారు. కొట్టారు. కిరసనాయిలు పోశారు.

ఒక్కో అగ్గిపుల్లా గీయడం, తగలబెట్టేస్తాం అని బెదిరించడం, నేరం వొప్పుకోమని వొత్తిడి చేయడం. కోటేశుది ఒకటే మాట. ‘‘నేను ఏ నేరం చేయలేదు’’. గ్రామంలోని చాలా మంది జనం, కోటేశు కుటుంబ సభ్యులూ అక్కడే వున్నారు. భూస్వాములు అగ్గిపుల్లలు గీసి భయపెడుతూనే వున్నారు. 41 అగ్గిపుల్లలు గీసి టెర్రరైజ్ చేసినా కోటేశు ఒప్పుకోలేదు.

42వ అగ్గిపుల్లతో అతన్ని తగలబెట్టారు. స్తంభానికి కట్టేసిన తాళ్లు తెగిపోయాయి. మంటలతో పరిగెత్తిన కోటేశు మెయిన్ రోడ్డు పక్కన పడిపోయాడు. నందిగామ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి మార్చారు. ఫిబ్రవరి 26న కోటేశు చనిపోయాడు.

విశాలాంధ్ర దినపత్రిక ఈ వార్తని Flash చేసింది. భూస్వాముల దురాగతం మీద వరసగా వార్తలు ప్రచురించింది. కృష్ణాజిల్లా భగ్గుమంది. ఆంధ్రప్రదేశ్ అట్టుడికింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ యీ హత్యని ఖండించి విచారణ జరిపిస్తానన్నారు. కేంద్ర మంత్రి జగ్జీవన్ రామ్ 1968 మార్చిలో కంచికచర్ల వచ్చారు.

దాంతో కంచికచర్ల అనే గ్రామం ఒకటుందని యావత్ భారతావనికీ తెలిసింది. 1968 ఫిబ్రవరి 26న మరణించిన అరికట్ల కోటేశు వయసు 20 ఏళ్లు. మాదిగ కులస్థుడు.ఈ సంఘటన జరిగే నాటికి కలేకూరి ప్రసాద్ కు నాలుగు సంవత్సరాలు. తను పుట్టిన వూరినీ, కోటేశునీ ఎప్పుడూ తలచుకునేవాడు ప్రసాద్. ప్రతి ప్రసంగంలో కోటేశు విషాదాంతాన్ని గుర్తు చేసేవాడు. మే 17, కవి, వక్త, రచయిత, మిత్రుడు, ఉద్యమకారుడైన కలేకూరి వర్ధంతి.

కుర్చీలో ఓ పక్కకి వొరిగి కూర్చుని, వొళ్లో ఇంగ్లీషు పుస్తకం, ఎడం చేతిలో సిగిరెట్టు, టేబుల్ మీదున్న తెల్లకాగితాలపై వేగంగా రాస్తుంటాడు. అంత ఫాస్ట్ గా అనువాదం చేయడం ఆశ్చర్యం కలిగించేది. ప్రసాదంటే నాకా దృశ్యం మెదులుతుంది. వాడి తెలుగు వాక్యాలు వాడిగా వుంటాయి. మనసుల్ని అల్లుకునే శైలి. ఎంత మంచి తెలుగది. అనువాదం అనిపించదు. అసలు ప్రసాద్ ఎప్పుడూ ఒరిజినల్. కవిగా, మనిషిగా, ధర్మాగ్రహం మూర్తీభవించిన దళితుడిగా!
*** *** ***
1989. విజయవాడ. ‘ఆంధ్రభూమి’ దినపత్రిక. నేను న్యూస్ ఎడిటర్ ని. కొమ్మినేని వాసుదేవరావుగారు నా దగ్గరకొచ్చి, కలేకూరి ప్రసాదనే కుర్రాడు వున్నాడు. అతనికి సైకలాజికల్ ప్రాబ్లమ్ వుంది. కొన్ని రోజుల క్రితం బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. మనం ఉద్యోగం యిస్తే బావుంటుంది అన్నాడు.

ఆయన ఆంధ్రభూమి అసిస్టెంటు ఎడిటర్. ‘‘అదేంటి సార్ మీరు అతన్ని తీసుకోండి’’ అన్నా. లేదు విజయవాడ ఎడిషన్ బాధ్యత మీది. టెస్టు పెట్టి తీసుకోండి అన్నాడు వాసుదేవరావుగారు. అలా కలేకూరి ప్రసాద్ అనే కుర్రకవి జర్నలిజంలోకి వచ్చాడు.

1985 లో కారంచేడు రగిల్చిన వేడి చల్లారి, కొంత డిస్టర్బ్ అయి, చివరికి ఆంధ్రభూమిలో చేరాడు. తనకి మంచి ఇంగ్లీషు వచ్చు. పక్కనున్న సబ్ ఎడిటర్లకి ఇంగ్లీషు పదాలకి తెలుగు మాటలు టకా టకా చెప్పేవాడు. చుండూరు హత్యాకాండ జరిగింది. ఆంధ్రభూమిలో పతాక శీర్షిక పెట్టి, హైలైట్ చేసి అగ్రెసివ్ గా రాశాను.

రోజూ ఉదయాన్నే బయల్దేరి ఓ కుర్రాడి స్కూటర్ మీద చుండూరు వెళ్లడం, సాయంత్రానికి తిరిగివచ్చి వార్తలు రాయడం… అలా నాలుగు రోజులు చేశాను. నేను రాసిన వార్తలు చూసి, ‘‘అయ్యా, మీరు తప్ప యిలా ఎవరూ రాయలేదు. ఏ దళితుడి కంటే కూడా బాగా రాశారు’’ అని కలేకూరి ప్రసాద్ నాకో సిగిరెట్ ఆఫర్ చేశాడు.

ఆంధ్రభూమి రెడ్ల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పత్రిక. చుండూరులో దళితుల్ని చంపించింది రెడ్లు. గుంటూరు జిల్లా రెడ్లు కొందరు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ‘‘భూమి’’ విజయవాడ జనరల్ మేనేజరు వెంకటేశ్వర్లు నన్ను పిలిచారు. ‘‘ఏంటి రెడ్లను హంతకులు అని రాస్తున్నారట. హెడ్డాఫీసుకి కంప్లెయింటు వచ్చింది. ఎలా?’’ అని అడిగారు.

‘‘దాందేముంది సార్. చుండూరులో చచ్చి పోయింది రెడ్లు. దళితులే హంతకులు అని రాద్దాం’’ అన్నాను. ‘‘అదే మీతో వచ్చింది. ఏం చేస్తావో మరి. నీ ఉద్యోగం కాపాడుకో’’ అన్నారాపెద్దాయన. ఆయనతో నాకున్న చనువు వల్ల అలా మాట్లాడగలిగా.

కొన్నేళ్ల తర్వాత నేను హైద్రాబాద్ వచ్చా. ప్రసాదూ వచ్చాడు. మేం మూడు చోట్ల కలిసేవాళ్లం.
1. పార్శీగుట్టలోని లెల్లే సురేష్ ఇల్లు. 2. ఇందిరాపార్కు ఎస్.బీ.ఐ.కాలనీలోని ఆర్టిస్టు మోహన్ ఆఫీసు. 3. ఆ పక్క వీధిలోనే వున్న ప్రసాద్ ఆఫీసు కం రెసిడెన్సు.

కలేకూరి ఈజీగా రెక్ లెస్ గా, కేర్ లెస్ గా ఉన్నట్టు కనిపించేవాడు. రాస్తూనే, అనువాదాలు చేస్తూనే ‘నిఘా’ అనే దళిత పత్రిక నడుపుతుండేవాడు. మహాశ్వేతాదేవి, అరుంధతీరాయ్ రచనలకు ప్రసాద్ అనువాదాలు చదివితీరాలి. ఎంత సీరియస్ దళిత విప్లవకారుడో అంత హ్యూమరస్ గానూ వుండేవాడు.

అన్ని కవితలు రాసినా, వందల వ్యాసాలు పోగు పడినా ఒక్క పుస్తకం పబ్లిష్ చేసుకోలేదు. ఏనాడూ ఒక్క రూపాయి దాచుకోలేదు.ప్రాణ మిత్రుడి గురించి చెబుతూ ‘‘వొంటరితనంలో ఒంటరిగా, గుంపుల్లో గుంపుగా, వక్తల్లో వక్తగా, కవుల్లో కవిగా, సమాజంలోని గూడెంగా బతికాడు కలేకూరి’’ అంటాడు లెల్లే సురేష్.

‘విజయ విహారం’ మాస పత్రికలో నేను పని చేస్తున్నపుడు, జోగిని జాతర కవర్ చేద్దామని, మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ కి తీసుకెళ్లాడు ప్రసాద్. భలే వుంది. మంచి రిపోర్టు రాసిచ్చాడు. ఓ రోజు కలేకూరి తల్లి చనిపోయిందని ఎవరో చెప్పారు. అరగంటలో ప్రసాద్ నా దగ్గర కొచ్చాడు.

ఇద్దరం కార్లో కంచికచర్ల వెళ్లాం. కలేకూరిని కన్న తల్లికో నమస్కారం పెట్టుకున్నాను. మర్నాడు అంత్యక్రియలు అయిపోగానే తిరిగి వచ్చేశాను. హైద్రాబాద్ లో కలేకూరి ఆఫీసులో కమిటెడ్ దళిత కార్యకర్త పెదరావూరు వెంకటేశ్వరరావు వుండేవాడు. లెల్లే సురేష్ సరే, నల్గొండ నుంచి వేముల ఎల్లయ్య, వూదరి వెంకన్న వచ్చేవారు. అలాగే గోరటి వెంకన్న, కొరివి విజయ కుమార్, బెజవాడ విల్సన్ వచ్చి కలేకూరిని కలిసి వెళుతుండేవారు.

పొన్నూరు నుంచి మల్లెల వెంకట్రావు, ఒంగోలు నుంచి రామలింగం వచ్చేవారు. ‘‘చుండూరులో చిందిన రక్తం’’ అంటూ అరుణోదయ రామారావు పాట పాడేవాడు. మోహన్, నేనూ…కలేకూరి అందరం కలిసి గడిపిన రోజులు మరిచిపోలేనివి.

మద్దూరి నగేష్ బాబు నుంచి పైడి తెరేష్ బాబు దాకా కవిత్వం, ఉద్యమం, పాటలు… మందు పార్టీలు పసందుగా సాగేవి. మోహన్ని ‘‘నువ్వు మా తరం హీరోవి’’ అనే వాడు కలేకూరి. ఇక కవి సత్యమూర్తి, కలేకూరి అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.

కలేకూరి స్నేహంలో ఒక అరాచకమైన పరిమళమేదో అందరినీ ఆకర్షించేది. మిత్రుల్లో, ఉద్యమాల్లో ఎంతో అభిమానాన్నీ, ప్రేమనీ పొందిన వాడు. భూమికి పచ్చాని రంగేసినట్టు… పాట రాసిన వాడు.
రెండో పెగ్గు తర్వాత ‘‘ఎర్రచీర కట్టుకున్న గన్నేర్ పువ్వా… నిన్ను రాజు రామన్నాడే గన్నేర్ పూవా’’ అని వూగుతూ పాడేవాడు.

కోరస్ పాడమని అడిగేవాడు ‘‘పచ్చచీర కట్టుకున్న గన్నేర్ పూవా’’ అంటూ. ఆ కైపులో ఒక వూపులో పాడేవాడు. చూడాలి అసలు, అదో ఆడియో విజువల్ మేజిక్.
sheer beauty.
అంత చక్కని కవి, నిండైన మనిషీ దేనికో నిరాశ చెందాడు. దిగులుగా మిగిలిపోయాడు. చాలా త్వరగానే వెళ్లిపోయాడు, మనందర్నీ వొదిలి. వాడి దోస్తానికి దోసిలి పట్టాల్సిందే. ఎవరైనా దండం పెట్టాల్సిందే
అంటాడు కవి కృపాకర్ మాదిగ. వింటున్నావా తంగిరాల సోనీ?
నీ తడి కళ్లను నేను పోల్చుకోగలను.
—-
అసలు దోషుల కథ: చరిత్ర ప్రసిద్ధికెక్కిన కంచికచర్ల కోటేశు అసలు ఊరు పక్కనే ఉన్న పరిటాల. నన్నపునేని ఆదెమ్మ ఇంట్లో పాలేరు. గేదెలకు పాలు తీసి దగ్గర్లోని ఒక హోటల్ కు పోసేవాడు. ఒక రోజు ఇంట్లో చెంబు పోయిందని నన్నపునేని వెంకటేశ్వరరావు కోటేశును అనుమానించాడు. ఆ చెంబు అమ్మేసి హోటల్లో భోజనం చేశాడన్నది కోటేశుపై ఫిర్యాదు. దాంతో గొడవ పెరిగి పెద్దదయింది. చివరికి జొన్నలగడ్డ మధు అనే వ్యక్తి అగ్గిపుల్ల గీసి కోటేశును సజీవ దహనం చేశాడు. కాలిన గాయాలతో కంచికచర్లలో కోటేశు పడిపోయిన చోటనే ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం పెట్టారు.
(విశాలాంధ్రలో కోటేశు వార్త.)

Sharing is Caring...
Support Tharjani

One Response

error: Content is protected !!