నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ? Tamil politics-7

Sharing is Caring...

Jaya fulfilled the vow………………….

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలిత ల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు.

బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కే వారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణ స్నేహితులే… అయినప్పటికీ డీఎంకే పార్టీని వీడాక ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేది. జయలలిత ఎంజీఆర్ వారసురాలు అయ్యాక ఆ వైరం మరింత ముదిరింది.

ఇక తమిళనాడు అసెంబ్లీ లో జయలలిత పై జరిగిన దాడి చరిత్రలో ‘దుశ్శాసన పర్వం’ గా నిలిచిపోయింది. 1989 మార్చి 25 న అసెంబ్లీ లో సీఎం కరుణానిధి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. అప్పట్లో ఆర్ధిక శాఖ కూడా ఆయన వద్దనే ఉంది. ప్రతిపక్ష నేత జయ ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ …. తన ఫోన్ ట్యాప్ చేశారని .. ఒక క్రిమినల్ బడ్జెట్ ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు.

జయ ప్రశ్నతో కోపగించుకున్న కరుణానిధి వెళ్లి శోభన్ బాబు ను అడుగు అంటూ వెటకారం గా సమాధానం ఇచ్చారు. దీంతో సభలో గొడవ మొదలైంది. జయ పార్టీ సభ్యులు కరుణానిధిని చుట్టుముట్టారు. డీఎంకే సభ్యులు దాడులకు దిగారు. కరుణ సన్నిహితుడు , మంత్రి దురై మురుగన్ మరో అడుగు ముందుకేసి జయ చీర పట్టుకుని లాగారు. సభలో పరిస్థితి అదుపు తప్పింది.

చెప్పులు విసురుకున్నారు. మైక్రో ఫోన్లు విరిచి వాటి కడ్డీలతో దాడులకు దిగారు. అన్నాడీఎంకే సభ్యులు , జయ గాయపడ్డారు.నిండు సభలో జయ కన్నీరు పెట్టారు. చెదిరిన జుట్టు, చిరిగిన చీర తో అసెంబ్లీ బయటకొచ్చిన జయలలిత ఫోటోలు … వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక్కసారిగా దేశప్రజల దృష్టి తమిళ రాజకీయాలపై పడింది.

దీంతో కరుణానిధి దుర్యోధనుడిగా .. దురైమురుగన్ దుశ్శాసనుడిగా వార్తల్లో కెక్కారు. ఒక గంట వ్యవధిలోనే డీఎంకే పార్టీ కి పెద్ద డ్యామేజీ జరిగిపోయింది. మీడియా ముందుకొచ్చిన జయ కరుణానిధిని ఓడించేవరకు అసెంబ్లీ లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత కేంద్రం డీఎంకే ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేసింది.

దీంతో 1991 లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జయ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల ప్రచారం కోసమే తమిళనాడు వచ్చిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీ పెరంబదూర్ లో హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్య కారణంగా వెల్లువెత్తిన సానుభూతి కూడా జయ కు ప్లస్ అయింది. అన్నాడీఎంకే కాంగ్రెస్ కూటమి 224 సీట్లు సాధించింది.

డీఎంకే 7 సీట్లకు పరిమితమై దారుణ పరాజయం పాలైంది. ఆ తర్వాత జయ .. కరుణ లు కనీసం మర్యాదాపూర్వకంగా కూడా ఎక్కడా పలకరించుకోలేదు. కరుణానిధిని 2001 జూన్ 30 న పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి జైల్లో పెట్టారు.

12 కోట్ల ఫ్లై ఓవర్ నిర్మాణంలో కుంభకోణం జరిగిందని .. కరుణ దే కీలకపాత్ర అని అభియోగం. పోలీసులు తనను చంపేస్తారని కరుణ వీల్ చైర్ పై కూర్చొని రోదించినా ఎవరూ పట్టించుకోలేదు. కరుణానిధి జీవితంలో అదొక చీకటి రోజు. కరుణ దారుణ పరాభవం చవి చూసేలా జయలలిత అప్పట్లో ప్రతీకారం తీర్చుకుందని అంటారు.

——–KNM

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!