జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకమో !

Sharing is Caring...

astrology vs political leaders …………………………….. 

చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ పథకాన్ని మొదలు పెట్టాలన్నా ముందుగా జ్యోతిష్యులను సంప్రదించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు.

మలబార్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పరప్పనంగడి ఉన్నికృష్ణ పణిక్కర్ జయకు సలహాలు ఇచ్చేవారు.మరో ఇద్దరు ముగ్గురు కూడా జయకు సలహాలిచ్చేవారట. 2001 ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ గెలుస్తుందని జయ కూడా అంచనా వేయలేదు. ఆ సమయంలో సిద్ధాంతి  పరప్పనంగడి ఉన్నికృష్ణ పణిక్కర్  జయ సీఎం అవడం ఖాయమని తేల్చి చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. నాటి ఎన్నికల్లో అన్నా డీఎంకే మిత్రపక్షాలు కలిసి 196 సీట్లు గెలుచుకున్నాయి. ఆ సందర్భంగానే ఆ సిద్ధాంతికి  పది లక్షల నగదును  దక్షిణగా సమర్పించారని అంటారు.

2001 ఎన్నికల సమయంలో జయలలిత తన పేరులో అదనంగా ఇంగ్లీష్‌ అక్షరం ‘A ‘ ని చేర్చారు. ఇంగ్లీషులో 11 అక్షరాలున్న (Jayalalitha) తన పేరును 12 అక్షరాలు వచ్చేలా Jayalalithaa గా మార్చేశారు. ఒక న్యూమరాలజిస్ట్ సలహా మేరకే జయ తన పేరును ఆలా మార్చుకున్నారని అంటారు.ముహూర్తం సరిగా లేదని ఆఖరి నిమిషంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నికూడా జయ వాయిదా వేసుకున్నారని చెబుతారు. దీన్నిబట్టి జయలలితకు జ్యోతిష్యంపై విపరీతమైన నమ్మకం ఉందని అంటారు.

ఇక పోయిస్ గార్డెన్ లో తన ఇంట్లో ( వేదనిలయం ) కూడా అన్ని వాస్తు ప్రకారం అమరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయాల్లో అన్నదానాలు చేయించడం కూడా జయకు ఎంతో ఇష్టం. అలాచేయడం వలన శుభం జరుగుతుందని ఆమెకు ఓ నమ్మకం.అందుకే తమిళనాడు లోని  ఆలయాల్లో అన్నదాన పథకం అమలు చేసింది.అలాగే ఏనుగులు అంటే జయకు అమితమైన ప్రేమ.

తాను సందర్శించిన ప్రతి దేవాలయానికి  ఓ గున్నఏనుగును ఆమె బహుకరించేవారు. 2001 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేరళలోని గురువాయూర్ దేవాలయానికి జయలలిత ఏనుగును దానం చేశారు. ఇక జయ జాతకం ప్రకారం ఆమెకు 5, 7 అంకెలు అనుకూలమైనవి. అష్టమి,నవమి రోజుల్లో జయలలిత  ఏ పని చేసే వారు కాదు. చివరకు జయలలిత 5వ తేదీన తుది శ్వాస విడిచారు.జయ నమ్మకాలకు అనుగుణంగానే అంత్యక్రియలను కూడా నిర్వహించారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!