పాత్రలో జీవించి.. మెప్పించిన జమున !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………………….

బంగారు తల్లి ….  జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది.   1971 లో వచ్చిన ఈ సినిమా లో  గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున పూర్తి డీగ్లామర్ పాత్రలో జీవించింది . చాలామంది ఈ పాత్రను చేయవద్దని చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి ముందుకొచ్చింది. పోరాడుతున్న ఒంటరి తల్లిగా జమున చేసిన భూమిక పాత్ర ద్వారా ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

 “అన్నపూర్ణ పాత్రలో విభిన్నమైన భావోద్వేగాలను కలిగి ఉండే అనేక ఛాయలు ఉన్నాయి. ” రాత్రి  డైలాగ్‌లను క్షుణ్ణంగా చదివి, మరుసటి రోజు షూటింగ్‌కి వెళ్లే ముందు అద్దం ముందు ప్రాక్టీస్ చేశాను” అని జమున తన ఆత్మకథ జమునాతీరంలో రాశారు .

జమున తర్వాత ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది కృష్ణంరాజునే. విలన్ పాత్రలకు, దారి తప్పిన కొడుకు పాత్రలకు పరిమితమయిన కృష్ణంరాజు కి మంచి పాత్ర లభించింది.  తిరుగుబాటు రంగా పాత్ర అతనిని దూకుడు పాత్రలలో నటుడిగా స్థిరపరిచింది, ఆ తర్వాత  కృష్ణంరాజుకి ‘రెబల్ స్టార్’ అనే పేరు వచ్చింది. 

ఇది కృష్ణం రాజు నటించిన 19వ చిత్రం .. మదర్ ఇండియా విడుదలైనప్పుడు నర్గీస్ వయసు 28, ఇందులో ఆమె తన వయసులో ఉన్న సునీల్ దత్,  రాజేంద్ర కుమార్‌లకు తల్లిగా నటించింది. 34 ఏళ్ల శోభన్ బాబు, 31 ఏళ్ల కృష్ణంరాజు కి తల్లిగా నటించినప్పుడు జమునకు 35 ఏళ్లు.

వారిద్దరి తర్వాత నిర్మలమ్మ . మనుషులు మారాలి సినిమాలో పాత్రలాగే ఉంటుంది ఈ సినిమాలో పాత్ర కూడా . చాలా బాగా నటించింది . ఈ ముగ్గురి తర్వాత నాగభూషణం పాత్ర , అతని నటన . అరవై డెబ్బై సంవత్సరాల కింద గ్రామాల్లో ఉండే టిపికల్ వడ్డీ వ్యాపారం చేసే షైలాక్ పాత్ర. బాగా నటించారు. శోభన్ బాబు , జగ్గయ్య , సురభి బాలసరస్వతి , అల్లు రామలింగయ్య , రమాప్రభ , వెన్నిరాడై నిర్మల ప్రభృతులు నటించారు.  పూర్తి గ్రామీణ వాతావరణంలో వందలాది మంది గ్రామస్తులు కూడా నటించారు.

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగున్నా బయట హిట్ కాలేదు . ఇన్నాళ్ళు లేని సిగ్గు , ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి , పల్లె సీమ మన పంట సీమ , బంగరు తల్లి పండిందోయ్ పంటల పండగ , శ్రమించే రైతుల జీవాలే పాటలు ఉన్నాయి.

చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకున్నా , ఈ సినిమాకు మాతృక అయిన 1957 లో వచ్చిన “మదర్ ఇండియా” అంత పేరు , డబ్బు తెచ్చుకోలేదు.  హిందీలో నర్గీస్ , రాజ్ కుమార్ , సునీల్ దత్ , రాజేంద్రకుమార్ ప్రధాన పాత్రలలో నటించారు . ఆ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రికార్డు సృష్టించాయి.

ఈ సినిమా ఎంత పేరు తెచ్చుకుందంటే ఆనాటి ప్రధాని నెహ్రూ , రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా ఈ సినిమాను వేయించుకుని చూసారు . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఫిలిం ఫేర్ అవార్డులను పొందింది.  నర్గీస్ , దర్శకుడు ఖాన్ లకు ఉత్తమ నటి , ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా వచ్చాయి . అయితే , ఈ మదర్ ఇండియా సినిమా కూడా 1940 లో వచ్చిన ఔరత్ అనే హిందీ సినిమా ఆధారంగానే తీయబడింది. 

తమ కుటుంబానికి ఘోరమైన అన్యాయం చేసిన వడ్డీ వ్యాపారస్తుని కుమార్తెను కిడ్నాప్ చేసే కొడుకుని తుపాకీతో చంపేసే తల్లి పాత్రలో జమున , నర్గీస్ గొప్పగా నటించారు . షైలాక్ పాత్రలు మన గ్రామాల్లో కనిపిస్తూనే ఉంటాయి . అలాంటి షైలాక్ లను నక్సలైట్లు చంపటం మనకూ తెలుసు.  గుంటూరు జిల్లాలో , ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి చంపటాలు చాలామందికి తెలుసు.  

వెరశి నేను చెప్పేది ఏమిటంటే : ఈతరం వారికి ఈ రెండు సినిమాల గురించి తెలుసో లేదో నాకు తెలియదు. రెండు సినిమాలు యూట్యూబులో ఉన్నాయి.   ఇప్పటి సీనియర్  రాజకీయ నాయకుడు  చేగొండి హరి రామ జోగయ్య  నిర్మించిన సినిమా ఇది. పినిశెట్టి శ్రీరామమూర్తి సంభాషణలు రాశారు.

వెటరన్ సినిమాటోగ్రాఫర్ కమల్ ఘోష్ పశ్చిమగోదావరి జిల్లాలోని అవుట్‌డోర్ లొకేషన్స్‌లో అలాగే AVM స్టూడియోస్‌లోని సెట్‌లలో చిత్రీకరించిన సన్నివేశాలను లైట్, షేడ్‌ని అద్భుతంగా ఉపయోగించారు. కేఏ మార్తాండ్ చిత్రాన్ని ఎడిట్ చేశారు.

కాస్త కషాయం లాగ ఉన్నా ఓపిగ్గా రెండూ చూడండి. ఈ రెండు సినిమాలు ఒకనాటి భారతీయ గ్రామీణ నేపధ్యాన్ని , భారతీయ తల్లి ఔన్నత్యం , ఓపిక , సంసారాన్ని తీర్చిదిద్దుకునే నేర్పులను అద్భుతంగా ఆవిష్కరించాయి .నేటి తరం యువతీయువకులు ఈ రెండు సినిమాలు కషాయంలాగా ఉన్నా చూడమని మనవి . యువతీయువకులే కాదు ; వీటిని చూడని వారు ఎవరయినా ఉంటే  చూడొచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!