Sheik Sadiq Ali ………………………… Where are the origins of jains?
కుంతల దేశ (కర్ణాటక) యాత్రకు స్పూర్తినిచ్చింది నిస్సందేహంగా కొలనుపాక… హైదరాబాద్—వరంగల్ జాతీయ రహదారిలో ఆలేరు నుంచి చేర్యాల వెళ్ళే మార్గంలో కొలనుపాక వుంది. క్రీస్తుశకం 4 వ శతాబ్దం నుంచి అక్కడ జైన మత ఆనవాళ్ళు వున్నాయి.ఇప్పుడక్కడ చాలా అందమైన జైన మందిరం వుంది.అసలు అక్కడి దాకా జైనమతం ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో పరిశోధన చేస్తే దాని మూలాలు కుంతల రాజ్యం లో వున్నాయని తెలిసింది.
దాంతో కర్ణాటక మీదికి మనసు మళ్ళి ప్రయాణం పెట్టుకున్నా. ఆ యాత్రలో భాగంగానే జైనమత ప్రభావం ఎక్కువగా వున్న శ్రావణ బెళగొళ ,కరేకల్,ధర్మస్థల ,హలేబిడు ప్రాంతాలను దర్శించటం జరిగింది.ఈ యాత్ర ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని మీతో పంచుకోవాలనే ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.
క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలో ఉత్తర భారతంలో తీవ్రమైన కరవు కాటకాలు వచ్చాయి. దానితో దక్షిణ భారతానికి వలసలు పెరిగాయి. ఆ కాలంలోనే చంద్రగుప్త మౌర్యుడు తన గురువు భద్రబాహు,మరో 12 వేల మంది జైన సాధువులతో కలిసి కుంతల దేశానికి వచ్చాడు.అలె గ్జాండర్ లాంటి ప్రపంచ విజేతను ఓడించి సువిశాల భారతావనిని ఏలిన ఆ చంద్రగుప్తుడే ఇతను.
తన రాజ్యాన్ని కొడుక్కి అప్పగించి ఆధ్యాత్మిక అన్వేషణ కోసం సర్వసంగ పరిత్యాగం చేసి సాధువుగా మారి దక్షిణాదికి ప్రయాణిస్తూ చివరికి కర్ణాటక లోని శ్రావణ బెలగొళ లో స్థిరపడ్డాడు.అక్కడే బస ఏర్పాటు చేసుకొని తన ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగించాడు.జైన మత గురువైన భద్రబాహు వద్ద శిష్యరికం చేస్తూ 12 ఏళ్ళు గడిపి చివరకు గురువు అనుసరించిన మార్గంలోనే సల్లేఖన( ఇది హైందవ ధర్మం లో ప్రాయోపవేశం లాంటిది.)ద్వారా ఆకలితో అలమటించి సంతర(నిర్యాణం) పొంది తన లక్ష్యాన్ని సాధించాడు.
తదనంతరం 700 మంది జైన సాధువులు కర్ణాటకలోను దక్షిణ భారత దేశం లోను జైనమతాన్ని వ్యాప్తి చేశారు. అలా వారి ద్వారా మన కొలనుపాక వరకు జైనమతం వచ్చింది. జైన గురువులను తీర్దంకరులు అంటారు. వారిలో ఆఖరి వాడు,24 వ తీర్ధంకరుడే మహావీరుడు.
శ్రావణ బెలగొళ లో చంద్రగిరి,వింధ్యగిరి అనే రెండు ఎత్తైన కొండలున్నాయి.ఆ రెండింటి మధ్యలో శ్వేత సరస్సు వుంది .అందులో చంద్రగిరి పైన చంద్రగుప్త బసది ఇప్పటికీ వుంది . వింధ్యగిరి లేదా ఇంద్రగిరి పైన ఒడేగల్ బసది వున్నాయి.ఈ చంద్రగిరిపైనే 57 అడుగుల ఎత్తైన బాహుబలి ఏకశిలా విగ్రహముంది.అలాగే కరేకల్ లో 42 అడుగులు,ధర్మస్తలలో 39 అడుగుల బాహుబలి విగ్రహాలున్నాయి.
కరేకల్ లో ముగ్గురు తీర్ధంకరుల విగ్రహాలతో పెద్ద ఆలయముంది.కర్ణాటకను శతాబ్దాల తరబడి ఏలిన కాదంబులు,గాంగులు ,రాష్ట్రకూటులు ,చాళుక్యులు,హోయసలులు జైనమతాన్నిఆదరించారు.కొందరు అవలంభించారు.
దాని ఫలితంగానే కర్ణాటకలోను ఇతర దక్షిణ భారత రాజ్యాలలోనూ జైన మతం పరిఢవిల్లింది.ఇప్పటికీ ఆ మతానికి సంబంధించిన అనేక ఆలయాలు మిగిలి వున్నాయి.చివరిగా ఒక మాట ……ఈనాటికీ ప్రతియేటా మనదేశంలో సగటున 240 మంది జైనులు సల్లేఖన ద్వారా ప్రాణత్యాగం చేస్తున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.