జో బైడెన్ మాటలు నిజమైతే మంచిదే !

Sharing is Caring...

అమెరికా దివిటీలా మారి ప్రపంచానికి దారి చూపిస్తుందని ప్రెసిడెంట్ కాబోయే బైడెన్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. అమెరికన్లు అంతా ఒకటే అనే భావన కూడా ఆయన మాటలలో వ్యక్తమైంది. అది ఎంతో గొప్ప భావన.,మరెంతో విశాలమైన స్వభావం.,ఉదారమైన యోచన..ఉదాత్తమైన లక్షణం. ఆధునిక సాంఘిక జీవితంలో ఎంతో ఉదారమైన విలువ.కులం,మతం,ప్రాంతం,భాష, దేశం,పేద-ధనిక,నలుపు-తెలుపు, వీటన్నింటికీ అతీతమైన నాగరిక విలువ.ఆధునిక మానవ జీవితానికి అవసరమైన,అనివార్యమైన ప్రాతిపదిక.కులం,మతం,జాతి,వర్గం,ప్రాంతం,దేశం గా గీతలు గీసుకొని, గోడలు కట్టుకుని సంకుచితంగా నిత్యం అశాంతి,అభద్రత లో జీవిస్తున్న మానవ జాతి ఐక్యం కాగలిగిన స్థితి నేడు లేదు.

కానీ కనీసం దేశాల్లోనైనా మనుషుల మధ్య నైనా ఐక్యత సాధించవలసిన అవసరం ఏర్పడింది. ఈ స్థితి ని గ్రహించే కాబోలు  జో  బైడెన్ అమెరికన్లు అంతా ఒకటే అని పేర్కొన్నారు. తాను అమెరికన్ లందరికీ అధ్యక్షుడినని ప్రకటించారు. రిపబ్లికన్లు,దేమోక్రాట్లనే వ్యత్యాసం తనకు లేదని చెప్పారు.తనకు ఓటు వేయని వారికి కూడ అధ్యక్షుడినే పేర్కొన్నారు.ప్రస్తుత పాలకుడు ట్రంప్ అనుసరించిన ధోరణి వల్ల ఇలాంటి ప్రకటన చేయవలసిన దుస్థితి నెలకొన్నది. అమెరికా సమాజం రెండు గా చీలిపోయిన స్థితి ని ప్రపంచమంతా చూసింది.

ఒక్క అమెరికాయే కాదు చాలా దేశాల్లో మెజార్టీ , సంప్రదాయ, చాందస, మత, తెల్లతోలు అహంకార వాదాలు బలపడి ఆయా సమాజాలు నిలువునా చీలిపోయి జాతుల మధ్య అంతర్యుద్ధపు వాతావరణం కనిపిస్తున్నది. ఓ నల్ల జాతి పౌరుడిని పట్ట పగలు నడిరోడ్డుపై తెల్లజాతి అహంకారం చంపేసిన దుర్ఘటన మానవ జాతి దైన్యానికి ఓ స్పష్టమైన ఉదాహరణ.
ఫ్రెంచ్ సమాజంలో చెలరేగుతున్న మత ఘర్షణలు. ఇండియా లో చెలరేగుతున్న మెజారిటీ వాదం.ఆందోళన,భయాలను కలిగిస్తున్న దుస్థితి ని సరిదిద్దే యత్నం చేయాలన్న తలంపు ఎంతో గొప్పది.

దేశాలకు .. పాలకులందరికీ జో  బైడెన్  ఆలోచనలు మార్గదర్శనం చేయాలని తద్వారా నిజమైన ,ఆధునికమైన మానవ నాగరికత పురుడు పోసుకోవాలని, యుద్ధాలు అవసరం లేని మానవ సమాజ నిర్మాణం దిశగా జో  బైడెన్  మాటలు ఆచరణలో నిజమయితే  మంచిదే. నిజం కావాలని  కోరుకుందాం. అలాగే దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని,సీమాంతర ఉగ్రవాదాన్ని సహించరాదని బైడెన్ విశ్వాసం. చైనా సహా ఏ దేశం తమ పొరుగువారిని బెదిరించేలా వ్యవహరించకూడదనేది బైడెన్ ఎన్నికల ప్రచారం లో చెప్పినమాట. బైడెన్ మాటలను బట్టి రాబోయే రోజుల్లో ఆయన పాలన విలక్షణంగా ఉండొచ్చు. 

————-  Goverdhan Gande

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!