ఆయన శైలి అనితర సాధ్యం !

Sharing is Caring...

Great poet Andhra Shelley ……………………….

“మనసున మల్లెల మాలలూగెనే” అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…”ఏడ తానున్నాడో బావ” అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా”కుశలమా నీకూ కుశలమేనా “అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి  దంపతులకు ప్రేమతో చెప్పినా…”తొందరపడి ఒక కోయిల” చేత కాస్తంత ముందే కూయించినా… అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.. అందుకే ఆయన శైలి అనితర సాధ్యం అంటారు. 

“సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే” అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..”పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా” అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…”పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం” సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా.. అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..

“మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడని…గన్నేరులా  పూస్తే కలవాడొస్తాడని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ..  అతడే దిగి వొస్తాడం”టూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…”గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా” అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా… ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే సాధ్యం. 

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ధన్యజీవి.. ఎన్నిసార్లు విన్నా.. ఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు  దేవులపల్లి కృష్ణశాస్త్రి .

అటువంటి గొప్పవాడైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారని  అంటారు. కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు. 

కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి. 

“ఈ గంగ కెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి  తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం సమీపంలోని  చంద్రపాలెం అనే గ్రామంలో 1897 నవంబరు 1న పుట్టారు. ఆయన  తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతుండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు.

పిఠాపురం హైస్కూలులో ఆయన  విద్యాభ్యాసం సాగింది. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కాకినాడ పట్టణం చేరారు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో కొన్నాళ్ళు టీచర్ గా చేసారు. ఆయన ఎక్కడా స్థిరంగా ఒక చోట ఉండలేదు. 

1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి తొలిసారిగా పాటలు వ్రాశారు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించారు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. 1976 ..లో కేంద్రప్రభుత్వం ఆయన సాహితీ సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు తో సత్కరించింది.

courtesy .. unknown writer

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!