Thopudu bandi Sadiq Ali ………………………………..The original don———-
చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు?
ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం ….హాజీ మస్తాన్. ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా, నెత్తురు చుక్క కూడా చిందకుండా నేర సామ్రాజ్యాన్ని ఏలిన వాడు …హాజీ మస్తాన్. గత 45 సంవత్సరాలుగా వందలాది భారతీయ సినిమాలకు కథా వస్తువు అతడే.
ఈ వ్యాసం చదివితే మీరు గతంలో చూసిన అనేక సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు రావటం ఖాయం. అసలీ హాజీ మస్తాన్ ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణం చేశాడు. భారత నేర ప్రపంచంపై అతని ప్రభావం ఎంత ఉంది? దళిత,మైనారిటీ రాజకీయాలపై అతని ముద్ర ఎంత? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
తమిళనాడు కడలూరు సమీపంలోని పనైకుళం లోని ఒక పేద ముస్లిం రైతు కుటుంబంలో 1926 ,మార్చి 1 వ తేదీన పుట్టాడు మస్తాన్ హైదర్ మీర్జా. అతని ఎనిమిదేళ్ళ వయసులో, పంటలు పండక బతుకు భారమై ముంబాయి కి వలసవెళ్లింది ఆ కుటుంబం. అక్కడా సరైన పని దొరక్క ఫుట్ పాత్ మీద సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న.
అక్కడే తండ్రికి చేదోడు గా ఉండేవాడు మస్తాన్. దగ్గరలోని మురికివాడల్లో ఆ కుటుంబం కాపురం ఉండేది. సైకిల్ షాపులో పని అయ్యాక ఇంటికి నడిచి వెళ్లే దారిలో, ధగధగా మెరిసే దీపాల కాంతిలో వెలిగిపోతున్న బంగ్లాలు, ఖరీదైన కార్లు, నవ నాగరికపు మనుషులను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండే వాడు. ఎదో ఒకరోజు వాళ్ళలా ధనికుడిగా మారి, విలాసంగా జీవించాలనుకునే వాడు.
అలా పదేళ్ళు గడిచిపోయాయి. తన 18 వ ఏట ,అంటే 1944 లో బొంబాయి పోర్టులో కూలీగా చేరాడు. విదేశాల నుంచి నౌకల్లో వచ్చే సరుకును మోసుకొచ్చి దింపటమే అతని పని.అప్పట్లో విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం,,వెండి,ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా పన్నులు వడ్డించేవారు. హజ్ యాత్రకు వెళ్లి వచ్చేవారు,దుబాయ్,ఎడెన్ వంటి దేశాల నుంచి వచ్చే యాత్రికులు తమవెంట తెచ్చే బంగారం తదితర వస్తువులపై పన్నులు చెల్లించలేక దొంగదారి కోసం చూసేవారు.
సరిగ్గా అక్కడే మస్తాన్ తన మెదడుకు పదును పెట్టాడు. తన చొరవతో పోర్ట్ లోని అధికారులు,సిబ్బంది,తోటి కూలీలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు.తరచుగా విదేశీ యాత్రలు చేసే వారితో పరిచయాలు చేసుకున్నాడు. పోర్ట్ లో దిగిన సరుకును పన్ను చెల్లించకుండా బయటికి తీసుకొచ్చి ప్రయాణీకులకు అందించేవాడు.
దాని ఫలితంగా అతనికి భారీగా నజరానాలు దక్కేవి. చేతినిండా డబ్బులు వచ్చి చేరేవి. దాంతో తానే స్వయంగా స్మగ్లింగ్ చేస్తే మరింత ఎక్కువ సంపాదించ వచ్చనే ఆలోచన వచ్చింది. 1955 ప్రాంతాల్లో డామన్ కు చెందిన మత్స్యకారుడు ,స్మగ్లర్ సుకుర్ నారాయణ్ బఖియా తో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి భారీ ఎత్తున బంగారం, వెండి, ఎలెక్ట్రానిక్ పరికరాల అక్రమ రవాణా మొదలెట్టారు.
అక్కడి నుంచి అతని దశ తిరిగింది.కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత కరీం లాలా, వరదరాజ మొదలియార్ వంటి ఇతర స్మగ్లర్లు మిత్రులయ్యారు. ఇందులో మొదలియార్ తమిళుడు అవ్వడంతో స్నేహం మరింత బలంగా ఉండేది. ఇతని జీవిత కథ ఆధారంగానే మణిరత్నం ‘నాయకన్’ అనే సినిమాను కమలహాసన్ హీరో గా తీశాడు.
అతను చెన్నై లో మరణించినప్పుడు అతని మృతదేహాన్ని ప్రత్యెక విమానంలో తెప్పించి మస్తాన్ తమ మధ్య స్నేహం యెంత ఉందొ ప్రపంచానికి తెలియ చెప్పాడు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన మస్తాన్ అందులోంచి కొంత సొమ్మును మురికివాడల్లోని ముస్లింలు,దళితుల కోసం ఖర్చు పెట్టేవాడు.
తన డబ్బుతో, పలుకుబడితో వారి సమస్యలు పరిష్కరించేవాడు.తద్వారా వారి దృష్టిలో దేవుడయ్యాడు. మస్తాన్ను పట్టుకోవాలంటే వీళ్ళను దాటి రావలసి వచ్చేది. వాళ్ళే అతనికి రక్షణ కవచంలా ఉండేవారు. బొంబాయి లోని స్మగ్లర్ల మధ్య తరచూ గొడవలు,గ్యాంగ్ వార్ లు జరిగేవి.
దాంతో వాళ్ళందరినీ ఒకచోట కూర్చోపెట్టి ఎవరి ఏరియాలు వారికి పంచి ఇచ్చేవాడు. ఒకరి ఏరియాలో మరొకరు జోక్యం పెట్టుకోకూడదని రూల్ పెట్టేవాడు. అతని సేవాగుణం, సహాయ పడే తత్వంతో మురికి వాడల్లోని ముస్లిం లు దళితులు అతని మాటను వేదంగా భావించేవారు. దాంతో వాళ్ళ ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు అతని పంచన చేరేవారు.
అతను ఎవరికీ మద్దతిస్తే ఆ అభ్యర్ధులే గెలిచేవారు.అలా రాజకీయంగా కూడా అతని పలుకుబడి పెరిగింది.రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చేవాడు. దాంతో అతని కోసం వాళ్ళు ఏదైనా చేసేవారు.అలా తన పలుకుబడిని పెంచుకున్న మస్తాన్ భారీ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం,ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం చేసి మరింత సంపాదించాడు.
ఏనాడూ ఆయుధం పట్టలేదనీ,ఎవరినీ చంపలేదనీ చెబుతారు..మనుషుల ప్రాణాలు తీసే మాదక ద్రవ్యాలు,ఆయుధాల వ్యాపారం ఎప్పుడూ చేయలేదనీ,ఎవరినీ చేయనిచ్చేవాడు కాదనీ చెబుతారు.
అధికార రాజకీయ వర్గాల్లో అతని పలుకుబడి యెంత ఉండేదో రెండు ఉదాహరణలు .. ఒకసారి ఒక కస్టమ్స్ అధికారి నిజాయితీపరుడు అడుగడుగునా అడ్డుపడేవాడు.
మొదట అతన్ని కొనడానికి ప్రయత్నించాడు. అతను లొంగలేదు. దాంతో తన పలుకుబడితో అతన్ని దూర ప్రాంతానికి బదిలీ చేయించాడు. ఆ అధికారి బదిలీ అయి వెళ్ళేటప్పుడు, అతను వెళ్లే విమానం ఎక్కి అతనికి బై బై అంటూ వీడ్కోలు పలికాడు. మరో సారి అతన్ని అరెస్ట్ చేయించటానికి అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఒకరు ఢిల్లీ వీధుల్లో ధర్నా చేయాల్సి వచ్చింది.
దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసినా పోలీసు అధికారులు అతన్ని ఇంటి అల్లుడిగా చూసుకున్నారట . ఒక దశలో తనకు అనుకూలంగా చట్టాలు కూడా చేయించు కునేంత శక్తి మంతుడిగా ఎదిగాడని చెప్పుకుంటారు.
ఎప్పుడైనా , ఏదైనా సందర్భంలో అరెస్ట్ అయితే గంటల వ్యవధిలో బయటికి వచ్చేవాడు.అప్పట్లో బొంబాయి లోని ఒక పోలీసు అతనికి వీరాభిమానిగా ఉండేవాడు. అతను మస్తాన్ కు అన్ని రకాలుగా ఉపయోగ పడేవాడు. అతనికి అల్లరి చిల్లరగా తిరిగే ఒక కొడుకు ఉండేవాడు. అతని అభ్యర్ధన మేరకు అతని కొడుకును చేరదీసి తన శిష్యుడిగా చేసుకొని స్మగ్లింగ్ లోని అన్ని విద్యలనూ నేర్పించాడు.
(పార్ట్ 2 లో మిగతా స్టోరీ చదవండి )