Is dissatisfaction with candidates increasing?……….
నోటా ఆప్షన్ ను ఎంచుకునే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది, 2014,2019, ఎన్నికలతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటా బటన్ నొక్కిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండోర్ లోకసభ నియోజక వర్గంలో అత్యధికం గా 2,18,674 ఓట్లు నోటాకు పడటం విశేషం.
నోటా చరిత్రలో ఇదో కొత్త రికార్డు. 2019లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ పోస్ట్ చేసిన రికార్డును అధిగమించింది. ఇండోర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ విజయం సాధించారు. ఆయనకు 11,75,092 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.
ఇండోర్‌లో లాల్వానీ పై పోటీ చేసిన మొత్తం 13 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఒక అభ్యర్థికి ఒక నియోజకవర్గంలో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఆరవ వంతు కంటే తక్కువ వస్తే .. వారు సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోతారు. ఇండోర్ లో లాల్వానీ కి 1226751 ఓట్లు రాగా.. నోటా కు 218674 ఓట్లు పడ్డాయి. అంటే 16.28% శాతం అన్నమాట. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సంజయ్ సోలంకీ 51,659 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి క్షణంలో పోటీ నుండి వైదొలగడంతో నోటాకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. బామ్ తర్వాత బీజేపీలో చేరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మొత్తం 5,33,705 మంది ఓటర్లు నోటా ఆప్షన్‌ను ఎంచుకోవడం విశేషం. ఇందులో అత్యధికంగా 2,18,674 ఓట్లు ఒక్క ఇండోర్‌లోనే నమోదయ్యాయి.
గత పార్లమెంటరీ ఎన్నికల్లో, బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో 51,660 ఓటర్లు నోటాను ఎంచుకుని రికార్డు సృష్టించారు, అంటే 5 శాతం మంది నోటాను ఎంచుకున్నారు. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని నీలగిరిలో దాదాపు 5 శాతం ఓటర్లు నోటా వైపు మొగ్గు చూపారు. ఫలితంగా అక్కడ నోటాకు 46,559 ఓట్లు పడ్డాయి.
కేరళలో 2024 ఎన్నికల్లో NOTAకి 1,58,026 ఓట్లు పోలయ్యాయి. 0.7% ఓట్ షేర్ వచ్చింది. 2019 ఎన్నికల్లో NOTAకి 1,04,089 ఓట్లు పోలయ్యాయి, ఇది 0.51% ఓట్ షేర్‌ని సూచిస్తుంది.అలాగే గుజరాత్ లో కూడా నోటా వైపు మొగ్గు చూపిన ఓటర్ల సంఖ్య పెరిగింది.
2013 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ సి ఈవీఎంలో నోటా ఆప్షన్‌ను చేర్చింది. ఈ ఎంపిక ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇంతవరకు అలా ఎక్కడ జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో ? లేదో ? చెప్పలేం.
ఒక నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చినా ఏమి కాదు .. నోటా తర్వాత ఏ అభ్యర్థి కి ఎక్కువ ఓట్లు వస్తే అతనే గెలుస్తారు. ఇలా కూడా ఎప్పుడూ జరగలేదు. నోటాకు అత్యధిక ఓట్లు వస్తే, ఆ ఎన్నికను చెల్లని ఎన్నికగా పరిగణించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.
ఈ పిటీషన్ను కంట్రీ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ్ ఖేరా ఏప్రిల్ 2024లో వేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులను 5 సంవత్సరాల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయాలని కూడా పిటీషన్ లో కోరారు.
———KNM