Sun in mid-life crisis………………………………………………………..
సమస్త జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (E s A ) చెబుతోంది. ఈ E s A సంస్థ అధ్యయనం ప్రకారం సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనట. ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందట. భానుడి జీవితకాలం ఇప్పటికే సగం ముగిసి పోయిందని, మరో సగమే మిగిలి ఉందని E s A చెబుతోంది. సూర్యుడు మిడ్-లైఫ్ సంక్షోభంలో పడ్డాడని అంటోంది.
అంతరిక్ష పరిశోధనల కోసం E s A ప్రయోగించిన గియా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్ క్రాఫ్ట్) సూర్యుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం అన్న విషయం తెలిసిందే. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది.
సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలంపై ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తులో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట. దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట. అపుడు సూర్యగోళం ఎర్రటి నక్షత్రం గా మిగిలిపోతుంది.
సూర్యుడి మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉ ష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు.
2013లో ప్రయోగించిన గియా అంతరిక్ష అబ్జర్వేటరీ క్రాఫ్ట్ 2025 వరకు పనిచేస్తుందని భావిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గియాను ఖగోళ పరిశోధనల కోసం రూపొందించింది – నక్షత్రాల స్థానాలు, దూరాలు, వాటి కదలికలను అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తుంది.