కేంద్ర విమానయాన శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్యకి బాంబే హైకోర్టు కీలకమైన పని అప్పగించింది. పదవి చేపట్టి బాధ్యతలు స్వీకరించకముందే “విమానాశ్రయాలకు పేరు పెట్టడం .. పేరు మార్చడం” పై దేశవ్యాప్తంగా ఒక విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న నవీ ముంబాయి విమానాశ్రయానికి బాల్ థాకరే పేరు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. బీజేపీ నేతలు స్థానికులతో కలసి డీ.బీ.పాటిల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే” పేర్లు పెట్టే — మార్చే విధానం” ఏదశలో ఉందో చెప్పాలంటూ ఫిల్జి ఫెడరిక్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టు విచారిస్తూ ప్రభుత్వ విధానం ఏమిటి ? దేశ వ్యాప్తంగా అమలు కోసం ఒకే పాలసీని రూపొందిస్తున్నదా ?లేదా ? కొత్త మంత్రి ఈ విధాన రూపకల్పనకు పూనుకోవాలని ఆదేశించింది. నిజానికి ఎయిర్ పోర్టులకు పేర్లు పెట్టడం .. మార్చడం అంటే తేనె తుట్టెను కదల్చడమే. రెండు మూడు పార్టీలు గొడవలు పడుతుంటాయి. వీళ్ళ మధ్య రాజీ కుదర్చడం అంత సులభం కాదు.
గతంలో ఇలాంటి వివాదాలు చాలానే ఏర్పడ్డాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానానికి రాజీవ్ పేరు పెట్టి డొమెస్టిక్ టెర్మినల్ కి ఎన్టీఆర్ పేరు పెట్టినపుడు వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా సర్కార్ ఎన్టీఆర్ పేరు తొలగించాలని తీర్మానం కూడా చేసింది. కాంగ్రెస్ నేతలు విమానాశ్రయంలో ధర్నాలు కూడా చేశారు. ఇలాంటివి చాలా చోట్ల జరిగాయి.
ఇంకా నిర్మాణం పూర్తి కాని నవీ ముంబాయి ఎయిర్ పోర్ట్ కి పేరు పెట్టే విషయం కూడా కొంత కాలంగా నలుగుతోంది. అటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన .. ఇటు బీజీపీలలో ఎవరూ తగ్గడం లేదు. రెండు పార్టీలు పెద్ద ఎత్తున మానవహారాలు ఏర్పాటు చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక డీ బీ పాటిల్ ఎవరంటే పీసేంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ కి చెందిన నేత. 5 సార్లు ఎమ్మెల్యే గా చేశారు. ఒకసారి ఎంపీ గా , ఎమ్మెల్సీగా చేసారు. సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయాలకు వ్యతిరేకం గా ఆయన పలు పోరాటాలు చేశారు. రైతుల భూములను ప్రభుత్వం సేకరించినపుడు వారు నష్టపోకుండా మెరుగైన పరిహారం ఇప్పించడానికి కృషి చేశారు. కాగా బాల్ థాకరే గురించి చెప్పనక్కరలేదు దేశం వ్యాప్తంగా అందరికి తెలిసిన వారే.
2016 లో కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలకు వ్యక్తుల పేర్లు పెట్టకూడదని కేవలం నగరాల పేర్లు మాత్రమే పెట్టాలని భావించింది. దీనిపై ఒక పాలసీని రూపొందించాలని అనుకున్నది. అయితే పాలసీ అమలులోకి రాలేదు. 2018 లో డ్రాఫ్ట్ పాలసీ సిద్ధమైందని ఆ శాఖా మంత్రి ప్రకటించారు. అదేమిటో బయటకు రాలేదు. ఆ డ్రాఫ్ట్ పాలసీ లో కూడా ఇక పై కొత్త ఎయిర్ పోర్టులకు కేవలం సిటీల పేరు మాత్రమే పెట్టాలని … ఇప్పటికే ఉన్న పేర్లను తొలగించకూడని సూచన చేసినట్టు సమాచారం. దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. అందుకే ఆంధ్రాలో ఉన్న విమానాశ్రయాలకు కూడా ఏ నేతల పేర్లు పెట్టలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి ? దానిపై ధాక్రే సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ అంశంలో సొంతంగా జ్యోతిరాదిత్య చేసేదేమి లేదు. ప్రభుత్వ పాలసీ కాబట్టి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.మోడీ నిర్ణయం ఏమిటో ఏమి చేస్తారో ? వేచి చూడాల్సిందే.
————–KNM