A woman who escaped hanging………………………………..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని నిజంగా చాలా అదృష్టవంతురాలు.. 7 సార్లు ఆమెను ఉరి తీయాలని ఆర్డర్ జారీ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలు కాలేదు. నళిని ని ఉరి తీస్తే ఆమె కూతురు అనాధ అవుతుంది. ఆ ఒక్క కారణంతో ఉరి శిక్ష కాస్తా యావజ్జీవ శిక్ష గా మారింది.
అప్పటి రాష్ట్రపతి KR నారాయణన్ జోక్యం చేసుకుని సోనియా గాంధీ తో మాట్లాడారు. ఆమె కూడా అంగీకరించడంతో ఉరి ముప్పు తప్పింది. మూడు దశాబ్దాలకు పైగా జైలుశిక్ష అనుభవించిన 53 ఏళ్ల నళిని జీవితం లో అనేక మలుపులున్నాయి. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబాలవనపురానికి చెందిన మలయాళ కుటుంబం నళినిది. ఆమె తండ్రి శంకర నారాయణన్ పోలీసు ఇన్ స్పెక్టర్ గా, తల్లి పద్మావతి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేవారు .
నళినికి ఓచెల్లెలు, తమ్ముడు ఉన్నారు. చెన్నైలోని యతిరాజ్ కాలేజీలో బీఏ చేసిన నళిని అనంతరం ఓ ప్రైవేటు సంస్థలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం లో చేరింది. కుటుంబానికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. 1991 ఫిబ్రవరిలో శ్రీలంక జాతీయుడైన మురుగన్ తో నళినికి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. అక్కడ నుంచి నళిని జీవితం కొత్త మలుపు తిరిగింది
మురుగన్ ఆమెను మెల్లగా ఎల్టీటీఈ వైపు మళ్లించాడు. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ హత్యలో ఆమె పాల్గొన్నారు. ప్రధాన సూత్రధారి శివరాజన్, శుభ, థాను (మానవబాంబు), హరిబాబు (ఫొటోగ్రాఫర్) తదితరులతో కలిసి నళిని శ్రీపెరంబుదూర్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ బహిరంగ సభకు వెళ్లింది. శుభతో కలిసి ఆమె జనంలోనే కూర్చుంది. థాను తనను తాను పేల్చుకోవడంతో 15 మంది మృతి చెందారు.
అనంతరం అదే ఏడాది జూన్ 14వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం చెన్నైలోని సైదాపేట బస్టాండు వద్ద నళిని దంపతులను అరెస్టు చేసింది. నళిని జైల్లోకి అడుగు పెట్టేనాటికి ఆమె రెండు నెలల గర్భిణి. 1992 జనవరి 21న ఆమె జైలులోనే ఆడబిడ్డను ప్రసవించగా, ఆమెకు మేఘర అని పేరు పెట్టారు. రెండేళ్ల వరకు ఆ బిడ్డను చూసేందుకు ఆమెకు అనుమతి లభించలేదు.
అనంతరం బిడ్డను చూసేందుకు అనుమతి ఇచ్చారు. మేఘర ఆరేళ్ల ప్రాయంలో జైలు నుంచి బయటకు వచ్చింది. నళిని కుటుంబీకులు మేఘర పేరును హరితగా మార్చి లండన్ తీసుకెళ్లారు. అక్కడే ఆమె మెడిసిన్ చేసి, డాక్టర్ గా ప్రాక్టీసు చేస్తోంది.
2008 మార్చి 19వ తేదీన రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక వేలూరు సెంట్రల్ జైలుకెళ్లి నళినితో మాట్లాడారు. రాజీవ్ ను హత్య చేసేందుకు తన భర్త, ఆయన సన్నిహితులు చేసిన కుట్ర గురించి తనకు తెలియదని ఆ సందర్భంగా నళిని వాపోయింది. ఆమె మాటల్లో ఎంత నిజముందో ఆమెకే తెలియాలి.
ప్రియాంక చాలా మంచి వ్యక్తి అని తనకు చాలా గౌరవం ఇచ్చారని విడుదలైన తర్వాత నళినీ మీడియాకు చెప్పారు. ”జైలులో మమ్మల్ని ఎవరూ గౌరవంగా చూడలేదు. ఆఫీసర్లు, స్టాఫ్ ముందు మేం ఎప్పుడూ నిలబడే మాట్లాడేవాళ్లం. కానీ ప్రియాంక నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మా నాన్నను ఎందుకు చంపారంటూ అడుగుతూ ఆమె ఎమోషనల్ అయి ఏడ్చేశారు’ అని నళిని చెప్పుకొచ్చారు.
ఇక నళిని జైలులో ఉండగానే 2009లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్ లో పీజీ చేసింది. నళిని, ఆమె భర్త మురుగన్ వేలూరు సెంట్రల్ జైల్లోనే ఉండడంతో ప్రతి 15 రోజులకొక మారు కలుసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే గత ఐదేళ్లుగా మురుగన్ కాషాయ దుస్తులు ధరిస్తూ సన్యాసి అవతారమెత్తాడు. తనకు కలలో దేవుళ్లు కనిపిస్తున్నారని చెప్పేవాడు.
తర్వాత మురుగన్ ను రెఫ్యూజీ క్యాంపు కి తరలించారు. ఇక ఈకేసులో దోషులను విడుదల చేయడం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దోషులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయ పడ్డారు.