కేరళ సిఎం పినరయి విజయన్ పదవి నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ ఇరుక్కున్నారు. విజయన్ రాజీనామా చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలైనాయి. సరిగ్గా కొద్దీ రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలు రావడం ఆపార్టీ కి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల రేసులో ఆ పార్టీ ముందంజలో ఉన్నదని పోల్ సర్వే లు చెబుతున్నాయి. ఇపుడు కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు రావడం తో ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ పాత్ర ఉందని దర్యాప్తులో చెప్పారట. సీఎం విజయన్ పాటు ముగ్గురు మంత్రులు, స్పీకర్ కూడా పాత్ర ధారులని స్వప్నసురేష్ కస్టమ్ అధికారులు విచారిస్తున్నపుడు చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్నీ కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం విజయన్ కు అరబ్బీ భాష తెలియదు కాబట్టి కాన్సులేట్ జనరల్ కి సీఎం విజయన్ మధ్య దుబాసీగా స్వప్న సురేష్ వ్యవహరించారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ కు మంత్రులకు కోట్లాది రూపాయల ముడుపులు ముట్టాయని స్వప్న దర్యాప్తు సందర్భంగా చెప్పారట. ఈ విషయాలన్నిలీక్ కావడంతో ఇపుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.
స్వప్న సురేష్ పై గతం లో కేసులున్నాయి. ఈమె కొన్నాళ్ళు ఎయిర్ ఇండియాలో కూడా ఉద్యోగం చేశారు. అక్కడ మానేసి కేరళ యూఏఈ కాన్సులేట్‌లో చేరారు.అక్కడే ఆమెకు పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు అయ్యాయి. అరబిక్‌తో పాటు పలు భాషలపై ఆమెకు పట్టున్నది. అయితే స్వప్న అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో అక్కడ ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాత కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓ లోని కొందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా కథనాలు ప్రచారం లో ఉన్నాయి. గత జులై లో ఈ కేసు వెలుగు చూసింది. అప్పటినుంచి కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కేరళ బీజేపీ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే అధికారుల విచారణలో విషయాలు లీక్ కావడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని సీపీఎం నేతలు అనుమానిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ ఇమేజ్ మసక బారకుండా విజయన్ పదవి నుంచి తప్పుకోవచ్చు. ఆరోపణలు వచ్చిన మంత్రులను స్పీకర్ ను పార్టీ పక్కకు తప్పుకోమని చెప్పే అవకాశాలున్నాయి. ఆలా చేయకపోతే పార్టీ ఇంకా ఇబ్బందుల్లో పడవచ్చు.