Scary crater--------------------------
ప్రపంచంలోనే అతి పెద్దదైన బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు.
భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ బిలం చుట్టూ ఉన్న భూభాగం కరిగిపోతోంది. దీంతో ఈ మంచు బిలం చుట్టు పక్కలకు విస్తరిస్తోంది. బటగైకాకు ”మౌత్ టు హెల్” అనేది మరో పేరుతో పాటు మెగా స్లంప్ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది.
బిలంపై అసమానంగా ఉన్న ఉపరితలాలు కనిపిస్తున్నాయి. నేల కోతకు గురై ఇవి ఏర్పడ్డాయి. మంచు బిలం పెరిగిపోతున్నకారణంగా చుట్టూ ఉన్న పట్టణాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైపులైన్స్ దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాల దృష్యా భవిష్యత్తులో ఇది ప్రమాదకరం కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
1960లో ఈ బిలాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా అటవీప్రాంతాలను నిర్మూలించడంతో (deforestation) మంచు కరిగిపోయింది. దీని వల్ల నేల కోతకు గురవుతోంది. ఈ బిలం ఉపరితలం నుంచి 282 అడుగుల లోతులో ఉంటుంది. ఇది పాతాళానికి వెళ్లేందుకు ఒక మార్గమని స్థానికుల నమ్మకం. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రజలు దీన్ని ”అండర్ వరల్డ్ గేట్‌వే”అని కూడా పిలుస్తారు.
బిలం పెరగడం ప్రమాదానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలపై పడింది … అధిక ఉష్ణోగ్రతలు బిలం పెరిగేందుకు మరింత ఊతమిస్తున్నాయి. ”మేము దీన్ని కేవ్ ఇన్ అని కూడా పిలుస్తాము. ముందుగా ఇది లోయగా కనిపించింది. ఆ తర్వాత వేసవిలో భూమి కరిగిపోయి బిలం పెద్దగా మారడాన్ని గమనించాము. ” అని స్థానికులు అంటున్నారు.