An actor who mesmerizes with extraordinary performance……………….
రెండు తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగు నైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకున్న సత్తా ఆయనది.
కామెడీ, విలనీ.. పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే మొదలయ్యింది. డైలాగు చెప్పడంలోనూ .. వాటికి తగిన హావభావాలను ప్రదర్శించడం లోనూ నాగభూషణం స్టయిలే వేరు అని చెప్పుకోవాలి. కామెడీ విలన్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు.
1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలో జన్మించారు నాగభూషణం. వారిది పెద్దగా ఆస్తిపాస్తులున్న కుటుంబమేమీ కాదు. అందుకే చిన్నా చితక పనులు చేసి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు.డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఉన్నత చదువులు చదవడం ఆయన వల్ల కాలేదు.
ఉద్యోగం కోసం ప్రయత్నించారు.సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీసులో ఉద్యోగం దొరికింది. మద్రాస్‌లో జాబ్. జీతం నెలకు పాతిక రూపాయలు మాత్రమే. మద్రాస్‌కు చేరేవరకు ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలియదు.
నాగభూషణంలోని నటుడుని బయటకు తీసుకొచ్చినవారు నటి జి.వరలక్ష్మి, నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ప్రజానాట్యమండలి ద్వారా వీరిద్దరు నాగభూషణానికి పరిచయం అయ్యారు. వారితో కలిసి ప్రముఖ రచయిత ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాలలో నటించారు. ఆ రోజుల్లో మద్రాస్‌లో నాటకాలకు మంచి ఆదరణ ఉండేది. ఎం.ఆర్.రాధ, మనోహర్ వంటి వారు సినిమాలకు ధీటుగా స్టేజిమీద భారీ సెట్టింగులూ, డాన్సులు, స్పెషల్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.
ఎమ్మార్ రాధ నాటకం రక్తకన్నీర్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ నాటకం సామాజిక రుగ్మతల మీద పెద్ద సెటైర్ ..చో రామస్వామి రాసిన ఆ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు చేత తెలుగులో రాయించారు. కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రవి ఆర్ట్ థియేటర్స్‌ను స్థాపించి 1956లో మొదటిసారి రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్శించారు. అక్కడనుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. రక్తకన్నీరు నాటకాన్ని 5,432 సార్లు ప్రదర్శించారు. అప్పట్లో అదొక రికార్డు.
1951లో ప్రజా నాట్యమండలికి చెందిన దర్శకుడు తాతినేని ప్రకాశరావు తీసిన ‘పల్లెటూరు’ సినిమాలో నాగభూషణానికి వేషం ఇచ్చారు. తర్వాత పెంకిపెళ్లాం, అమరసందేశం సినిమాల్లో వేశారు. సినిమాలు చేస్తూ నాటకాలు వేసేవారు నాగభూషణం. 1957లో వచ్చిన ‘ఏది నిజం’ సినిమాలో హీరో పాత్ర పోషించారు. సినిమా బాగానే ఆడింది. రాష్ట్రపతి ప్రశంస కూడా పొందింది.
అయినా నాగభూషణానికి హీరో వేషాలు రాలేదు. మాయాబజార్ వంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. 1960లో వచ్చిన ‘శభాష్ రాజా’ సినిమాతో నాగభూషణం దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది ‘మంచిమనుసులు’లో మంచి పాత్ర దొరికింది. ఆ తర్వాత వచ్చిన ‘మూగమనసులు’ సినిమాతో నాగభూషణం ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
ఎన్టీఆర్‌కు నాగభూషణం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన తీసిన ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్లామా, కోడలు దిద్దిన కాపురం .. ఇలా ప్రతీ సినిమాలోనూ మంచి వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో సూర్యకాంతానికి జోడిగా వేశారు. ముసలి వేషంలోనూ తన మార్క్ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు.
బాపు తీసిన బాలరాజుకథలో వేసిన పనిగండం మల్లయ్య పాత్ర బాగా పాపులర్ అయింది. ‘నేనంటే నేనే’ సినిమాలో తల్లి వేషం వేశారాయన.అందులో “డొక్కలో పొడుస్తా” అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమా నాగభూషణానికి స్టార్ హోదా తెచ్చిపెట్టింది. నాగభూషణం డైలాగులకు జనం చప్పట్లు కొట్టారు.
అలాగే దేశోద్ధారకులు, ‘బుద్ధిమంతుడు’ సినిమాలు మంచి పేరు తెచ్చాయి ..మళ్లీ హీరో వేషం వేయాలన్న తలంపుతో సొంతంగా ‘నాటకాల రాయుడు’ అనే సినిమా తీసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆయన హీరోగా ‘ఒకే కుటుంబం’ సినిమా తీశారు. అది హిట్టయ్యింది.
ఆ తర్వాత చో రామస్వామి తమిళనాటకం మహ్మద్ బిన్ తుగ్లక్‌ను తెలుగులో సినిమాగా తీశారు. దాసరి నారాయణరావు ఈ సినిమా కు డైలాగులు రాశారు. ఇది విజయవంతమయ్యింది. 1971లో వాసిరెడ్డి సీతాదేవి రాసిన ‘సమత’ అనే నవల ఆధారంగా ‘ప్రజా నాయకుడు’ సినిమా తీశారు. అయితే సెన్సార్ వివాదంలో ఇరుక్కుంది. బాగా కత్తిరింపులకు గురయ్యింది. ఆ కారణంగా సినిమా సరిగ్గా ఆడలేదు.
ఇందులో డైలాగులు అప్పట్లో బాగా పేలాయి. “కాఫీ లేకపోయినా పర్వాలేదు .. కారు లేకపోయినా పర్వాలేదు… చివరికి పెళ్ళాం పక్కింటి వాడితో లేచిపోయినా ఫర్వాలేదు. కానీ పదవి లేకపోతే ఎలా ? ” వంటి డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.
ఇక అడవి రాముడు సినిమాలో నాగభూషణం డైలాగులు అదర గొట్టేశాయి . ‘చరిత్ర అడక్కు. చెప్పింది విను’ అనే పంచ్ డైలాగు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో నాగభూషణం కొడుకైన సత్యనారాయణ ఏదడిగినా ఏదో ఒక పాత ఉదంతం చెబుతుంటాడు. ఒక సందర్భంలో “రేయ్… హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి .. చెప్పుదెబ్బలు తిన్న దొనకొండ గాబ్రియల్ లాగా కావడం నాకిష్టం లేదు” అంటాడు. అలాగే షేక్ చిన్నమస్తాన్ లాగా అంటూ చెప్పే జంధ్యాల డైలాగ్స్ కి థియేటర్లో ప్రేక్షకులు పడీపడీ నవ్వేరు.
సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు లో నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు ..ఆ క్యారెక్టర్ కి పెట్టిన ఊతపదం ‘అబ్బయ్య’ కూడా బాగా పేలింది. నాగభూషణం పై చిత్రీకరించిన ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’ పాట కూడా సరిగ్గా కథకు సరిపోయింది.
తర్వాత కాలంలో నాగభూషణం భాగస్థులు వంటి ఒకటి రెండు సినిమాలు తీశారు. అవేవి పెద్దగా ఆడలేదు . అందరూ దొంగలే సినిమాలో ఎస్వీ రంగారావు తో కలసి కామెడీ పండించారు. నాగభూషణం నటించిన సినిమాల గురించి చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి.
అలా కామెడీ .. కామెడీ విలన్ .. రాజకీయ నేతల పాత్రల్లో నాగభూషణం రాణించారు. శ్రీకృష్ణ విజయం లో నాగభూషణం చేసిన పౌండ్రక వాసుదేవుడు పాత్ర కూడ బాగుంటుంది. “అది అనృతం ..ఇది సూనృతం” అంటూ డైలాగ్స్ చెప్పే కురుక్షేత్రం లోని శకుని పాత్ర కూడా ఆయన చేశారు. మొదటి నుంచి నాగభూషణం కు రచయితలు మంచి డైలాగులు రాసేవారు.
1977లో వచ్చిన అడవిరాముడు తర్వాత నాగభూషణం చెప్పుకోదగిన పాత్రలు చేయలేదు. 1994లో వచ్చిన నంబర్‌వన్ సినిమా నాగభూషణం చివరి సినిమా. ఆ మరుసటి ఏడాది మే నెలలో అనారోగ్యం కారణంగా నాగభూషణం కన్నుమూశారు. సినీ లోకంలో నాగభూషణానిది ఓ ప్రత్యేక స్థానం.