What is in Garuda Purana? ……………………………
కొంతమంది గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని.. కీడు జరుగుతుందని అంటుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమే. గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉన్నంత మాత్రానా ఏమి కాదని పండితులు చెబుతున్నారు. అదలా ఉంచితే గరుడ పురాణంలో అసలు ఏముంది ? మనిషి చేసే పాపాలు … శిక్షలు తదితర అంశాలను ఈ పుస్తకం వివరిస్తుంది.
మనిషి మనిషి గా బతకాలంటే గరుడ పురాణం తప్పక చదవాలని అంటారు. బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతో పాటు గురువులు,పండితులు,దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు నరకంలో శిక్షలను అనుభవించక తప్పదని గరుడ పురాణం చెబుతుంది.
అలాగే అప్పు ఎగ్గొట్టేవారు..ఇతరుల సొమ్మును , ఆస్తులను కాజేసేవారు, ఆదరించిన వారిని మోసగించే విశ్వాస ఘాతకులు, మనుష్యులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, పుణ్యాత్ములను నిందించేవారు, అమాయకులను వేధించేవారు .. ఎగతాళి చేసేవారంతా పాపులే అని గరుడ పురాణం వివరిస్తుంది.
పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. ఇవన్నీ చదువుతుంటే భయం కలుగుతుంది.నిజానికి మనిషిని సద్వర్తన లోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. దీన్నే పాప భీతి కూడా అంటారు. కొందరు పాపాలు చేసి … వాటి నుంచి తప్పించుకోవడానికి గుళ్ళు ..గోపురాల చుట్టూ తిరుగుతుంటారు.
అలాగే పురాణాలను, వేదాలను కించపరిచేవారు … న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే ఓర్వలేనివారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడు మాటలు పలికే వారు దుర్గతుల పాలు కాక తప్పదని గరుడ పురాణం చెబుతోంది.
పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు , నీచమైన పనులు చేసేవారు , తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు,ఇంకా రకరకాల పాపాలు చేసే వారు యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట.
యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. ఈ నదిలో నీళ్లకు బదులు రక్తము, చీము, ఎముకలు, బురద లాగా కనిపించే మాంసము ఉంటాయట. పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యమట. అక్కడే నానా పాట్లు పడి తర్వాత ఆ నది ఒడ్డున ఉన్న బూరుగు చెట్టుకు వద్దకు చేరుకుంటారట.
అక్కడ యమ భటులు చేత దెబ్బలు తింటారని గరుడ పురాణం చెబుతుంది. అందుకే మనిషి కొన్నిపుణ్య కార్యాలైన చేయాలట.అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తర గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్ళించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయంటారు.
అయితే… బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోయే ప్రమాదం లేకపోలేదని అంటారు. కాబట్టి ఎవరైనా మరణించిన సమయంలో మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు.