పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానమైన నందిగ్రామ్ లో పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు తృణమూల్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే లో మమతాబెనర్జీ ఓడిపోతారని వెల్లడైనట్టు ఒక రిపోర్ట్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని ప్రశాంత్ కిశోర్ తర్వాత ఖండించారు. ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐ ప్యాక్ పేరిట ఆ సర్వే రిపోర్ట్ వైరల్ అయింది. బీజేపీ ఓటమి ఖాయమని తేలడంతో ఇలా ఫేక్ రిపోర్ట్ లతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఐ ప్యాక్ విమర్శించింది. రోజు రోజుకి బీజేపీ దిగజారిపోతున్నదని ఆ సంస్థ ఎద్దేవా చేసింది.
కాగా ఇవాళ నందిగ్రామ్ లో పోలింగ్ జరిగిన తీరు చూసి దీదీ ఇంత చెత్త ఎన్నికలను తన జీవితంలో ఎపుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మమతా మాటలలో చాలా అసహనం ధ్వనించింది. ఆమె మాటలను బట్టి చూస్తుంటే వాతావరణం అనుకూలంగా లేదనే అనుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఒకరికి పదిమంది నేతలు మమతా పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎపుడూ ధీమాగా ఉండే మమతా ఈ విమర్శల కారణంగా కూడా కొంత అసహనానికి గురై ఉండవచ్చు. పైకి మాదే విజయం అని చెబుతున్నప్పటికీ ఆమాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించడంలేదు. ఇవాళ నందిగ్రామ్ లో పోలింగ్ బూత్ ను పర్యవేక్షించి అక్కడి అధికారులపై దీదీ కేకలు వేసినట్టు వార్తలు వచ్చాయి.
అక్కడినుంచే నేరుగా గవర్నర్ కి జగదీప్ ధన్కర్ కి ఫోన్ చేసి మాట్లాడారు. సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్ లోనికి రానివ్వడం లేదని , ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీదీ అక్కడికి రావడం మూలాన రెండుగంటలు పోలింగ్ ఆగిపోయిందని బీజేపీ విమర్శించింది. మొత్తం మీద చూస్తే దీదీ సహనం కోల్పోతున్నారు. దీనికి కారణం రేసులో వెనుకబడటమే అంటున్నారు. అలాగే మోడీ పై పోరాటానికి కలసి రావాలని దక్షిణాది నేతలకు లేఖ రాయడం పై కూడా మోడీ సైటైర్లు వేశారు. దీదీ సాయం కోసం అవుట్ సైడర్స్ మద్దతు కోరుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. పార్టీ వర్గాల్లో కూడా దీదీ తొందరపడి నందిగ్రామ్ లో పోటీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక నందిగ్రామ్ పై 2011 నుంచి తృణమూల్ కి మంచి పట్టు ఉంది. 2016 లో గెలిచాక మమతా సువెందు అధికారిని ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. మొన్న మొన్నటివరకు క్యాబినెట్లో సువెందు నంబర్ 2 గా ఉన్నారు.అతగాడు బీజేపీలో చేరడంతో నందిగ్రామ్ టిక్కెట్ ను అతనికే ఇచ్చారు. ఇపుడు అక్కడే దీదీ బరిలోకి దిగడంతో బీజేపీ ఆమెను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అందరిని ఆకర్షిస్తోంది. దీదీ గెలవడం కష్టమనే ప్రచారం మొదటినుంచి కూడా సాగుతోంది. నందిగ్రామ్ బరిలోనే మమతా 2011 లో భూపోరాటాలు చేశారు. కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడారు. అక్కడ మమతాకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఇపుడు కొంచెం వయసు పైబడి దూకుడు కొంత తగ్గి ఉండొచ్చుకానీ సివంగిలా పోరాడే దీదీ ఎవరికి భయపడే టైపు కాదు. ఎవరూ ఊహించని రీతిలో నందిగ్రామ్ కొచ్చిన మమతా విజయం సాధించేందుకు హిందూ కార్డును వాడారు. వీల్ చైర్ లో ప్రచారం చేశారు.ఆలయాలకు వెళ్లారు. ప్రచారం ఎలా ఉన్నప్పటికీ నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఫలితాలు వస్తే కానీ తేలదు. రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
—————-KNMURTHY