మృత్యు స్వరూపం అలా ఉంటుందా ?

Sharing is Caring...

 

What the Garuda Purana says ………………………………….

మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు  ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు. 

మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే  దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. తను రావలసిన వేళకే మృత్యువు, ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఈ మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ  ఒక్కసారిగా మరచిపోతుంది. మేఘం వాయువు వశంలో ఉన్నట్టుగా  ప్రాణి కాలవశంలో వుంటాడు.

సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పుచేతల్లోనే వుంటాయి. ప్రాణులలో అవి కాల నియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య, చంద్ర, శివ, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వి, మిత్ర, ఔషధ, అష్టవసు, నది, సాగర, భావ, అభావాది మహా విషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారము కాలంలో ఉద్భవిస్తూ,పెరుగుతూ, కనుమరుగవుతుంటాయి.

మృత్యువు వివిధ వ్యక్తులను ఎలా కబళిస్తుందో చూద్దాం.  మృత్యువు వచ్చే ముందు దైవయోగం వల్ల రోగమొస్తుంది. ఇంద్రియాలు వికలమై పోయి బలము, ఓజస్సు,వేగం శిథిలమైపోతాయి. కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది.
యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు.

శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గేలంతో లాగడం మొదలెడతారు. అప్పుడు ప్రాణం, అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈపెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది.

తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలను   వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా, కనుమరుగయ్యేదాకా  చూస్తుంది .నిజానికి ఇక్కడ ఆ పని చేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది. 

మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకోపితమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్త్వాన్ని పెచ్చరిల్ల జేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్త జనులకూ, భోగాలపై ఆసక్తి లేనివారికీ ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది.

అబద్ధమాడని వారికీ, విశ్వాసాన్ని వమ్ము చేయనివారికీ, ఆస్తికులకూ, పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖపూర్వకంగా వుంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై, స్వధర్మాన్ని జీవిత పర్యంతమూ నిర్వహించి,సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువు  ఏమాత్రమూ బాధింపకుండా మృదువుగా సుఖంగా గొనిపోతుంది.

మోహంలో .. అజ్ఞానంలో పడి ప్రజల గురించి పట్టించుకోకుండా  తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ, అజ్ఞానాలనే జనాలకు ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యుసమయంలో భయంకరమైన చిక్కటి చీకటి గుయ్యారంలో  చిక్కుకుని   కనులు పొడుచుకున్నా ఏమీ కనబడని  అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చువారూ, అసత్య వాదులూ, విశ్వాస ఘాతకులూ, వేద నిందకులూ మూర్ఛ రూపంలో మృత్యువును  పొందుతారు.

వారికి యమదూతలు లాఠీలు, సమ్మెట, ఇనుప గదలను ధరించి వాటిని ఝళిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే  విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణకిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులనో పుత్రులనో అఱచి అఱచి పిలుస్తారు.

కాని గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా నోట్లోంచి శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటాలున కనులు తెఱచుకుంటాయి; అవి గుండ్రంగా భయంకరంగా వికృతంగా కదులుతాయి; ఎగవూపిరి వస్తుంది; ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదనపడుతూ మృతులవుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా, ఆత్మీయులే ఇష్టపడరు. 

భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మలలోని కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి. దేవ, అసుర, యక్షాది యోనులలో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్ష్యాది యోనులలో పుట్టుక  దుఃఖమయ జీవనానికి ప్రారంభం.  ముందు జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలయి వుంటాయి.

అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరనుభవించే కష్టసుఖాలు. దీనినే కర్మవిపాకమనవచ్చును. ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షననుభవించి కూడా మరుజన్మలో పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మంలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు. ఒక్కోపాపానికి ఒక్కో విధమైన జన్మ ఉంటుంది 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!