అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే లో చీలిక తెచ్చి పార్టీ పై పట్టు బిగించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? అని పళనిస్వామి వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. పళనిస్వామి వర్గం చిన్నమ్మను పార్టీలోకి రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. చిన్నమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లి ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీటీవీ దినకరన్, బంధువులతో చిన్నమ్మ మంతనాలు జరుపుతున్నారు.అన్నాడీఎంకేలో 30 శాతానికి పైగా ఎమ్మెల్యేలు చిన్నమ్మ సిఫారసుతో టిక్కెట్లు సాధించి ఎన్నికల్లో గెలిచారు. పలువురికి ఆమె సిఫారసు తోనే మంత్రి పదవులు వచ్చాయి.
చిన్నమ్మ జైలుకు వెళ్ళాక వారంతా పళనిస్వామికి మద్దతు పలికినప్పటికీ … ఆమెతో టచ్‌లోనే వున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ లో కూర్చొని దినకరన్ సహాయంతో ఆమె వారితో మంతనాలు జరుపుతున్నారని సీఎం పళనిస్వామి అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చీలిక వస్తే ఏంచేయాలో .. ఏ వ్యూహం అమలు చేయాలో అర్ధం గాక పళనిస్వామి మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీ నేతలు అయితే శశికళను పార్టీలో చేర్చుకోమనే సలహా ఇస్తున్నారు. అయితే పళని స్వామికి అలా చేయడం ఇష్టం లేదు. ఇక ఓపీఎస్ మౌనంగా ఉంటున్నారు. ఆయన వ్యూహమేమిటో అర్ధంకాక పళని వర్గం టెన్షన్ పడుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం పళనిని కాదని నిర్ణయాలు తీసుకునే సాహసం చేయరు. పార్టీలో ఉంటే … పార్టీ అధికారంలో కొస్తే ఏదో పదవి దక్కుతుంది అనే భావనలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఇక శశికళ అండతో పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొందిన వారంతా స్లీపర్‌సెల్స్‌గా సైలెంట్ గా వున్నారని, అవసరమైనప్పుడు వారంతా బయటపడతారని చాలాకాలం నుంచే దినకరన్ చెబుతున్నారు. శశికళ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం ఖాయమని … అపుడు అన్నాడీఎంకేను వీడి ఆమె వెంట నడుస్తారని, లేదా పార్టీని చీల్చి చిన్నమ్మ ను నేతగా ఎంచుకుంటారని అంటున్నారు. ఇపుడు దానికి సంబంధించిన వ్యూహా రచనే జరుగుతుందని చెబుతున్నారు. కాగా చిన్నమ్మ జైలునుంచి విడుదలైన సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ తిరుచ్చి జిల్లా ముఖ్యనేత అన్నాదురై బ్యానర్లు కట్టించారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎవరూ కూడా అన్నాదురైతో సంబంధాలు పెట్టుకోవద్దని హుకుం జారీ చేశారు. తిరునల్వేలి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం పై కూడా పార్టీ ఇలాంటి చర్యలే పార్టీ తీసుకున్నది. పార్టీ ని కాదంటే బహిష్కరణ వేటు ఖాయమని పళని స్వామి సంకేతాలు పంపుతున్నారు.
కాగా జయ మరణించిన పిదప సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయగా.. ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ నియామకమయ్యారు. 2017, ఫిబ్రవరి 5న ఏఐఏడీఎంకే శాసన సభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 6 సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9న ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ గవర్నర్‌ను కోరింది. అంతలోనే సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏఐఏడీఎంకే పార్టీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య విభేదాలు రావడంతో పన్నీర్ సెల్వంను డిప్యూటీ సీఎంగా నియమించారు.అనంతరం ఈ ఇద్దరు కలసిపోయి పార్టీ నుంచీ శశికళ, దినకరన్‌లను బహిష్కరించారు. ఇపుడు ఆ ఇద్దరినీ చేర్చుకోవాలంటే బహిష్కరణ ను ఎత్తేయాలి. తర్వాత విధేయులుగా మారిపోయి … చిన్నమ్మ చెప్పినట్టు చేయాలి. అలా చేయడం వారి కిష్టంలేదు. అందుకే ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతున్నారు.
———–K.N.MURTHY