Loan evasion case …………………..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుపోయారు.వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఆయన తిరిగి చెల్లించలేదు.. పైగా నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ అంశాలమీద దర్యాప్తు జరుగుతోంది.
అనిల్ పై రూ. 17,000 కోట్ల రుణాలకు సంబంధించి మోసాల కేసులో ఆరోపణలు చాలానే ఉన్నాయి. మూడు రోజుల పాటు 35 ప్రదేశాల్లో , 50 సంస్థల్లో, 25 మంది ఇళ్లలో ED సోదా లు నిర్వహించింది. పెద్ద సంఖ్యలో నేరారోపణకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలు లభించాయని సమాచారం.
2017 నుండి 2019 వరకు యెస్ బ్యాంక్ ప్రమోటర్ల తో కుమ్మకై ఆ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల విలువైన రుణాలు తీసుకున్నారని ఆరోపణ. ఇదే సమయంలో కొంత డబ్బును నేరుగా యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు కూడా పంపారు.రుణం ఆమోదించడానికి ముందే స్కామ్‌కు సన్నాహాలు చేసారని ఆరోపణ.
యెస్ బ్యాంక్ రుణాలు ఇచ్చిన కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను లోన్ తీసుకున్న తర్వాత తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.రుణ మొత్తాన్నిఇతర గ్రూప్ కంపెనీలు,షెల్ సంస్థలకు బదిలీ చేసినట్లు ED కనుగొన్నది.రుణం పొందిన కంపెనీల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. కంపెనీల చిరునామాలు, డైరెక్టర్లు వివరాలు ఒకదానికొకటి సరిపోలాయి.
దరఖాస్తు చేసిన రోజే కొన్నిరుణాలను ఆమోదించారు. అలాగే నిధులు విడుదల అయ్యాయి. కొన్నిచోట్ల ఆమోదం పొందకముందే రుణ మొత్తాన్ని బదిలీ చేశారు. కంపెనీల ఆర్థిక డేటాను కూడా తారుమారు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారించి రెండు ప్రాధమిక సమాచార నివేదికలు (FIRలు) దాఖలు చేసింది.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్, SEBI, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ దర్యాప్తులో సహాయపడ్డాయి. ED ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బ్యాంకులు, వాటాదారులు, సాధారణ పెట్టుబడిదారులను మోసం చేయడం ద్వారా డబ్బు మళ్లించారు. ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర అని తేల్చారు.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసులలో క్యాపిటల్ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కూడా EDకి తన నివేదికను అందించింది.
RHFL 2017-18లో రూ. 3,742 కోట్ల కార్పొరేట్ రుణాన్ని ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత ఈ మొత్తం రూ. 8,670 కోట్లకుపెరిగింది. ఇంత పెద్ద రుణాలను కూడా హడావుడిగా ఆమోదించారు. ఈ రుణ మంజూరు లో అవకతవకలను గుర్తించారు.
ఇక అనిల్ అంబానీపై ఉన్న రెండవ పెద్ద కేసు రూ. 14,000 కోట్లకు పైగా రుణ మోసంతో ముడిపడి ఉంది, దీనికి ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈసారి కెనరా బ్యాంకులో రూ.1,050 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అనిల్ అంబానీ, ఆయన కంపెనీలు విదేశాలలో తెరిచిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
రుణాలు తీసుకోవడానికి నకిలీ బ్యాంకు హామీలను కూడా ఉపయోగించారని ఆరోపణలున్నాయి. ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనిల్ అంబానీకి చెందిన మూడు కంపెనీలకు రూ.68 కోట్లకు పైగా నకిలీ బ్యాంకు హామీలను ఇచ్చిన విషయాన్ని ED బయటపెట్టింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా పార్లమెంటులో ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీలను ఫ్రాడ్ కేటగిరీ లో SBI చేర్చింది. ఈ మోసం గురించి SBI RBIకి తెలియజేసింది..కేసు నమోదు కూడా చేస్తున్నారు.
మొత్తం మీద బ్యాంకు రుణ మోసాల కేసులో అనిల్ అంబానీని ఆగస్టు 5న విచారణకు రమ్మని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటికే బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల షేర్ ధరలు వరుసగా పతనం అవుతున్నాయి.

