People 4500 years ago………….
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెర పడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటోను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8 వేల ఏళ్ళ నాటిది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది.
మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. ఇది క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు.
సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పురాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధు నాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధన సాగించారు.
ఈ క్రమంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరికత వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదే. . ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు.