ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో … గెలిచేదెవరో ?

Sharing is Caring...

What the surveys say……………………….

వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ సారధ్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న మొదలై మిగిలిన దశల పోలింగ్ మార్చి 3 తో ముగుస్తుంది. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఓటరు నాడిని గ్రహించేందుకు  ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత వరకు ఉపయోగపడతాయి.

సర్వేల సారాంశం ఏమిటో ?

సీవోటర్‌ ..  ఏబీపీ న్యూస్ సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం  UP లో బిజెపి 40.4 శాతం ఓట్‌ షేర్‌తో మొత్తం 403 సీట్ల కు గాను 212-224 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 41.4 శాతం ఓట్లతో 325 సీట్లు గెలుచుకుని అధికారం కైవశం చేసుకుంది.ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ సీఎం అవుతారు.

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌ఎల్‌డి)తో పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) 151-163 సీట్లతో రెండో స్థానంలో నిలువ నుందని ఈ సర్వేలో తేలింది. మాయావతి సారధ్యంలోని  బీఎస్పీ 12 నుంచి 24 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా. మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ప్రచారంలో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నది. అయితే  కాంగ్రెస్‌కు రెండు నుంచి 10 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఆపార్టీ  2017లో ఏడు సీట్లు గెలుచుకుంది.

ఇక పంజాబ్ లో ఆప్ 50-56 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా. కాంగ్రెస్ 39 నుంచి 45 సీట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి.  117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 59 సీట్లు గెలుచు కోవాల్సిన అవసరం ఉంది.

కాగా ఉత్తరాఖండ్ లో నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ  కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చు. 70 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 33-39 సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. కాంగ్రెస్ 29-35 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.

గోవాలో బీజేపీ స్వల్ప తేడాతో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. 30 శాతం ఓట్‌షేర్‌తో 17-21 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా.  ఇక మణిపూర్‌లో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 29-33 సీట్లు, కాంగ్రెస్ 23-27, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 2-6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. 

ఇవన్నీ ప్రాధమిక సర్వేలు కాబట్టి ఎంతవరకు నిజం అవుతాయో చెప్పలేం. అంచనాలు తప్పవచ్చు. షెడ్యూల్ విడుదల నుంచి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళేలోగా ఓటర్ ఎన్నో ప్రలోభాలకు గురవుతాడు.పధకాల ఆకర్షణలో చిక్కుంటాడు చివరికి మూడ్ మార్చుకుని ఓటు వేసే అవకాశాలుంటాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!