A popular Telugu play………………………………
సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కూడా నటించి మెప్పించారు.వాటిలో కన్యాశుల్కం లోని ‘గిరీశం’ పాత్ర ఒకటి. ఎన్టీఆర్ ఆ పాత్రను చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆ సినిమా తీసే నాటికి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు.
నిర్మాత డీఎల్ నారాయణ వెళ్లి ఎన్టీఆర్ ను సంప్రదించారు. అప్పటికే దేవదాసు తో మంచి హిట్ కొట్టిన డీఎల్ కూడా మంచి ఊపులో ఉన్నారు. కన్యాశుల్కం నాటకాన్ని సినిమా తీస్తున్నామని అనగానే ఎన్టీఆర్ ఒకే అన్నారు. గిరీశం పాత్ర ఎలా ఉంటుందో తెలిసే ఆయన అంగీకరించారు.అప్పటికి ఎన్టీఆర్ చిత్రపరిశ్రమ కొచ్చి ఐదేళ్లు అయింది.
ఎన్టీఆర్ గిరీశం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. గిరీశం పాత్రకుండే బలహీనతలు, వ్యంగ్యధోరణిని పూర్తిగా ఆకళింపజేసుకున్న ఎన్టీఆర్ హుషారుగా నటించి ప్రేక్షకుల మన్నన పొందారు.మొదట్లో ఈ పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు ని అనుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అది నిజం కాదని నిర్మాతలు తర్వాత కాలంలో ప్రకటించారు.
మూల కథ దెబ్బతినకుండా కన్యాశుల్కం నాటకానికి కొన్నిమార్పులు చేసి తెరకెక్కించారు. వినోదా పతాకంపై డి.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించగా అప్పటి ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.1955 ఆగస్ట్ 26న ఈ సినిమా విడుదల అయింది. అంటే ఇప్పటికి 69 ఏళ్ళ క్రితం అన్నమాట.
మొదటి రిలీజ్ లో ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేక పోయింది. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ .. థర్డ్ రిలీజ్ లో ప్రేక్షకుల ఆదరణ పొందింది. కొన్ని థియేటర్లలో వందరోజులు కూడా ఆడింది. చిత్ర పరిశ్రమలో అదొక రికార్డు.
గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటి సమాజ స్థితికి అద్దం పట్టిన నాటకం. దాన్ని యధాతధంగా తీయడం చాలా కష్టమైన విషయం. దర్శకుడు పి.పుల్లయ్య బాగానే కసరత్తు చేశారు. ఆయనకు ప్రముఖ రచయిత సదాశివ బ్రహ్మం సహకరించారు. సినిమాకు డైలాగులు కూడా ఆయనే రాశారు. తెలుగు ప్రజలకు అందరికి తెలిసిన నాటకం కాబట్టి జాగ్రత్తలు తీసుకుని దాన్నొక మాస్టర్ పీస్ గా రూపొందించారు.అయినప్పటికీ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి.
నాటకాన్ని చెడగొట్టారని.. వితంతువులను మోసం చేసే గిరీశం పాత్రను మంచివాడిగా మార్చివేశారని, ఎన్టీఆర్ కోసం ఈ మార్పులు చేశారని అప్పట్లో నాటక ప్రియులు అభిప్రాయపడ్డారు.ఈ విమర్శల పట్ల నిర్మాత, దర్శకులు స్పందించలేదు
ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మధుర వాణిగా సావిత్రి నటన అమోఘం. మరొకరు ఆలాచేయలేరు. ‘లొట్టిపిట్ట’ సన్నివేశంలో మధురవాణి రామప్పంతుల్ని ఆటపట్టిస్తూ రెండుమూడు నిమిషాలు అలా నవ్వుతూనే వుంటుంది. ఈ సీన్ లో సావిత్రి నటన అద్భుతం.
అమాయకపు బుచ్చమ్మ గా జానకి, రామప్ప పంతులుగా సీఎస్సార్, అగ్నిహోత్రావధానులుగా వి.రామన్న పంతులు, లుబ్ధావధాన్లుగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, పూటకూళ్లమ్మగా ఛాయాదేవి తమ పాత్రల్లో జీవించారు.దర్శకుడు ప్రధాన పాత్రలను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇతర పాత్రల్లో గుమ్మడి, వంగర, పద్మనాభం, సూర్యకాంతం,హేమలత తదితరులు నటించారు. ఘంటసాల సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘ఆనందం అర్ణవమయితే’ కవితనే పాటగా మార్చారు. మిగిలిన పాటలు బాగుంటాయి. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది … చూడని వారు చూడవచ్చు.
————KNM