Importance of Yatra………..
నాలం బలం యాత్ర…. ఇదొక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం.కేరళలో ముఖ్యంగా రామాయణ మాసం (మలయాళ కర్కాటక మాసం – జూలై/ఆగస్టు) లో ఈ యాత్ర చేస్తుంటారు. ఈ యాత్రను సూర్యోదయానికి ముందే ప్రారంభించి శ్రీరామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నుల ఆలయాలను భక్తులు దర్శిస్తారు.అది కూడా ఉదయపు పూజలు ముగిసేలోపు పూర్తి చేయడం సంప్రదాయం.
మొదట త్రిప్రయార్ శ్రీరామస్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ ఉదయం ‘నిర్మాల్య దర్శనం’ విశేషం.త్రిప్రయార్ రాముడిని దర్శించిన తర్వాత అక్కడి నదిలోని చేపలకు ఆహారం తినిపించడం ప్రధాన పూజ. ఇలా చేస్తే శ్వాసకోశ వ్యాధులు తొలగుతాయని నమ్మకం. అలాగే ‘వెడి’ (బాణసంచా కాల్చడం) ఇక్కడ ప్రత్యేకం.
తర్వాత త్రిప్రయార్ నుండి సుమారు 22 కి.మీ దూరంలో ఉన్న కూడల్మాణిక్యం ఆలయాన్ని దర్శించాలి. భారతదేశంలో భరతుడికి ఉన్న అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ భరతుడికి తామర పూలతో మాల వేయడం, ‘ముక్కడి’ (ఒక రకమైన నైవేద్యం) ని సమర్పించడం ఆచారం. కడుపు సంబంధిత వ్యాధుల నివారణకు ఇక్కడ పూజలు చేస్తారు.
ఆ రెండు అయ్యాక ఇరింజలకుడ నుండి 30 కి.మీ దూరంలో ఎర్నాకులం జిల్లాలో ఉన్నమూళిక్కుళం లక్ష్మణ స్వామి ఆలయాన్ని సందర్శించాలి. లక్ష్మణ స్వామికి ప్రత్యేకంగా తయారు చేసిన ‘అప్పం’ ను నైవేద్యంగా సమర్పిస్తారు.
చివరగా ఇరింజలకుడకు సమీపంలో ఉన్న పాయమ్మల్ శత్రుఘ్నస్వామి ఆలయాన్నిదర్శించుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేయిస్తారు. ఈ పూజలు మానసిక ప్రశాంతతకు దోహదపపడతాయని భక్తులు నమ్ముతారు.
ఈ నాలుగు ఆలయాలు త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల పరిధిలో ఒకదానికొకటి దగ్గరగానే (సుమారు 50-60 కి.మీ పరిధిలో) ఉంటాయి.కేరళ ఆలయాల్లో పురుషులు ధోవతి ధరించాలి, పైన వస్త్రం ఉండకూడదు. మహిళలు చీర లేదా లాంగ్ స్కర్ట్స్ ధరించాలి.
బయటి రాష్ట్రాల వాళ్ళు విమానం ద్వారా వెళ్లాలనుకుంటే ..సమీప విమానాశ్రయం కొచ్చి .ఇది మూజిక్కుళం దేవాలయానికి కేవలం 15 కి.మీ దూరంలో ఉంటుంది. రైలు ద్వారా అయితే త్రిస్సూర్ లేదా అంగమాలి రైల్వేస్టేషన్లలో దిగవచ్చు. త్రిప్రయార్‌కు త్రిస్సూర్ స్టేషన్ (25 కి.మీ) గురువాయూర్ స్టేషన్ (24 కి.మీ) సమీపంలో ఉంటాయి.
త్రిస్సూర్ నుండి ఇరింజలకుడకు ప్రతి 5 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. దేవాలయాల మధ్య ప్రయాణానికి టాక్సీలు సులభంగా దొరుకుతాయి (ఉదా: కూడల్ మణిక్యం నుండి మూజిక్కుళం వరకు టాక్సీ చార్జీ సుమారు ₹650–₹850 ఉండవచ్చు).
రామాపురం (కొట్టాయం జిల్లా) చేరుకుంటే అక్కడికి 3 కి.మీ దూరంలోనే ఈ నాలుగు దేవాలయాలు ఉంటాయి. సమీపంలోని పాలై (Pala) పట్టణంలో బస చేయవచ్చు. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి పాలై 20 కి .మీ దూరంలో ఉంటుంది.


