అల్లూరి ఆత్మత్యాగానికి వందేళ్లు !!

Sharing is Caring...

Kumar Kunaparaju ………..

ఈ సంవత్సరంతో సీతారామరాజు ఆత్మ బలిదానం చేసి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఎప్పటినుంచో మన్యం ప్రాంతం అంతా చూడాలని కోరిక. ఇప్పటికి అది నెరవేరింది. పదొవతేది ఉదయమే 7 గంటలకు మావూరు నుంచి రాజమండ్రి బయలుదేరి 9.30 కి చేరుకున్నా. అక్కడ వేణు గోపాల్ రెడ్డి ని పికప్ చేసుకొని ప్రయాణం ప్రారంభించాము.

మొదట రంపచోడవరం పోలీస్ స్టేషన్ చూసాం. స్టేషన్ కొద్దిగా బాగానే వుంది. పక్కనే కొత్తది కట్టుకున్నారు. ఇక్కడ ఈ పాత బ్రిటీష్ కాలం నాటి స్టేషన్ లో పోలీసుల బైకులు పెట్టుకొన్నారు. అంతా అశుభ్రంగా వుంది. అయ్యో ఇంతేనా మనం ఇచ్చే గౌరవం? ఓగొప్ప బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాటు స్మృతి చిహ్నలను కాపాడుకోలేమా అని ప్రాణం చివుక్కు మంది.

తరువాత రాజవొమ్మంగి, తరువాత అడ్డతీగల, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లు చూసాం. అన్ని శిదిలావస్థలో దీనంగా కనిపించాయి. ఓ దాంట్లో తాగి పడేసిన సారా సీసాలతో నిండిపోయింది. మరొకటి బూత్ బంగ్లా లాగా వుంది. అన్నీ రోడ్డుపక్కనే కొత్త పోలీస్ స్టేషన్ లను ఆనుకునే వున్నాయి.

వీటిని రక్షించుకోవడానికి కోట్లు అవసరం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం చిహ్నలు ఇవి . ప్రజలు కూడా ఏమీ ప్పట్టించుకున్నట్లు లేదు. కనీసం స్టేషన్ సిబ్బంది శుభ్రం చేయించవచ్చు  కదా అని అనిపించింది. ఎంతో నిరాశ కలిగింది.

ఈ రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, చింతపల్లి, కేడీ పేట పోలీస్ స్టేషన్లపై అల్లూరి సీతారామరాజు బృందం అప్పట్లో దాడులు చేసింది. దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్క రోజు వ్యవధిలోనే వెళ్లి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం… అక్కడ బందీలుగా ఉన్న కొందరిని విడిపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలతో ప్రజల్లో అల్లూరికి ఆదరణ పెరిగింది. ఆయన దగ్గర మహిమలున్నాయని అప్పట్లో కొందరు భావించారు.

చివరిగా సంధ్యా సమయంలో కృష్ణదేవి పేట లోని అల్లూరి సమాధి దగ్గరకు వెళ్ళాము. ద్వారం లోపలకి మెట్లు ఎక్కి వెళ్ళాం. ఓ ముసలామీద కూర్చుని వుంది. ‘ఆ ఎడమ ప్రక్క వెళ్ళండి, కింద సమాధులు వున్నాయి’ అని చెప్పింది. మరల ప్రక్కన కిందకు మెట్లు దిగి వెళ్ళాము.

పసుపు పూలచెట్లు విరగపూసాయ్. అక్కడ నూనె దీపం నిశ్చలంగా వెలుగుతోంది. గంటం దొర, సీతారామరాజుల సమాధులు పక్కపక్కనే వున్నాయి. నమస్కారం సామీ మమ్మలను మన్నించు అని నమస్కరించాను. ఇంతకాలాని నీదగ్గరకు రాగాలిగాను..అనుకొంటూ నివాళులు అర్పించాను.పైన దిబ్బమీద పెద్ద వృక్షం విస్తరించి వుంది. పక్కనే మ్యూజియ్ మూసేసి వుంది. అది ఓ పార్క్. జనం వస్తున్నారు. మొదట మెట్లు దగ్గర కనిపించిన పెద్దావిడకు నమస్కరించి తిరుగు ముఖం పట్టాం. మనస్సు అంతా దిగులు ఆవహించింది. రాత్రి ఎనిమిది గంటలకు నర్సీపట్నం చేరుకొన్నాం.

మరల ఉదయమే మిత్రుడు శ్రీనివాస్ వస్తే అతని కారు పై లంబసింగి బయలు దేరాము. పచ్చని, చిక్కని చెట్ల మధ్యనుంచి ఘాట్ రోడ్డు, మంచులో దూరంగా పర్వాత పంక్తులు ప్రకృతి శోభ మనస్సును తనలోనికి లాగేసుకుంటుంది.మైదాన ప్రాంతం నుంచి వచ్చిన టూరిస్టులు, కేజ్ నుంచి బయట పడ్డ కోళ్లు లాగా బిత్తర చూపులు చూస్తున్నారు. మరల తిరుగు ప్రయాణం. మన్యం అంతా విశాలమైన రోడ్డు వేష్షున్నారు. వందల కిలోమీటర్ల రోడ్డు, కాల్వరట్లు, వంతెనలు.. పని ముమ్మరంగా సాగుతోంది.

ఓ రెండు మూడు సంవత్సరాలలో ఈ పనులన్నీ పూర్తి కావచ్చునేమో. అక్కడక్కడా గిరిజన సంతలు కనిపించాయి. అమాయకత్వం, పేదరికం ఛాయలు వారి మొఖాల్లో కనిపిస్తూనే వున్నాయి. నర్సీపట్నం, తుని, రాజమండ్రి మీదుగా సాయంత్రానికి మా ఊరు చేరుకొన్నా.మనస్సు నిండా ఏదో తెలియని బాధ వెంటాడుతోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!