What Putin has achieved ?…………………………………………..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి వందరోజులు అవుతోంది. అయినప్పటికీ పుతిన్ కోరిక నెరవేరలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని తప్పించి ఆయనకు బదులుగా తన చెప్పుచేతుల్లో ఉండే కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న పుతిన్ వ్యూహం ఫలించలేదు.
ఈ వంద రోజుల్లో అమెరికా, పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆధునిక ఆయుధాలతో రష్యాను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంది. ఫలితంగా రష్యా సైనికంగా నష్టపోయింది. ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బలు తిన్నది. ఆస్తి నష్టం దారుణంగా ఉంది.
అమెరికా ఒత్తిడితో యూరప్ దేశాల కఠిన ఆంక్షలతో రష్యా కూడా నలిగిపోతోంది. బయటికి చెప్పలేకపోతోంది కానీ దేశీయంగా కూడా రష్యా విమర్శలను ఎదుర్కొంటోంది. నాటో విస్తరణను అడ్డుకోవడం, ఉక్రెయిన్ అందులో చేరకుండా ఆపడం పుతిన్ యుద్ధ లక్ష్యాల్లో ఒకటి.
అది కూడా నెరవేరలేదు. స్వీడన్, ఫిన్లండ్ వంటి తటస్థ యూరప్ దేశాలు కూడా రక్షణ కోసం నాటో లో చేరాలని నిర్ణయించుకున్నాయి. దీనికి కూడా కారణం యుద్ధమే. ఇవన్నీ పుతిన్ కి మింగుడు పడటం లేదు. మరోవైపు సొంత మనుష్యులే సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సలహాలు ఇచ్చారని .. కీలక సమాచారం లీక్ కావడం వైఫల్యాలతో పుతిన్ ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడా కూడా రష్యా యుద్ధ నియమాలను పాటించలేదు . ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.
ఈ యుద్ధం కారణంగా 70 లక్షలకు పైగా ఉక్రేనియన్లు శరణార్థులుగా దేశం వీడారు. ఉక్రెయిన్ మరుభూమిగా మారిపోయింది.ఈ యుద్ధం ప్రభావంతో పలు ఇతర దేశాలు .. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటి ధరలు పెరిగాయి. నిత్యావసరాల కొరతతో సామాన్యులు సతమవుతున్నారు.
యుద్ధం మొదలైన తొలిరోజుల్లో అధ్యక్ష భవనంలోకి చొరబడి ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా సైనికులు ప్రయత్నించారు కానీ ఆ సమాచారం తెలుసుకుని జెలెన్‌స్కీ రహస్య ప్రదేశంలో దాక్కున్నారు. దేశం వీడాలని జెలెన్‌స్కీకి పలువురు సూచించినా ఆయన అక్కడే ఉన్నారు.
కీలకమైన రేవు పట్టణం మారియుపోల్‌ను రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. ఖెర్సన్‌పైనా పట్టు బిగించాయ. జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని రష్యా స్వాధీన పరుచుకుంది. బాంబు దాడుల్లో ఓ రియాక్టర్ దెబ్బ తినడంతో యూరప్ మొత్తం గజగజ వణికిపోయింది.
మారియుపోల్‌లో స్టీల్ ఫ్యాక్టరీని స్థావరంగా చేసుకుని ప్రతిఘటనకు ఉక్రెయిన్ దళాలు శ్రీకారం చుట్టాయి కానీ దాన్ని కూడా రష్యా ఆక్రమించింది. రష్యా యుద్ధంలో వెనక పడింది.మధ్యలో చర్చలు జరిగినా అవి ఫలించలేదు. కీవ్ నుంచి సైనికులు డోన్బాస్ వైపు వెళ్లారు. వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డోన్బాస్‌ను పూర్తిగా ఆక్రమించి యుద్ధానికి గౌరవప్రదంగా ముగింపు పలికేలా పుతిన్ వ్యూహం మార్చేశారు.
డోన్బాస్‌లో కూడా రష్యా సేనలకు ఎదురుదెబ్బలు తగిలాయి.. మూడు నెలల పోరాటం తర్వాత స్టీల్ ప్లాంటులోని సైనికులంతా లొంగిపోవడంతో మారియుపోల్ పూర్తిగా రష్యా హస్తగతమైంది. ఇక వెలుగు చూసిన ..చూడని మానభంగాలు ఎన్నో జరిగాయి. పుతిన్ ను కొంతమేరకు సంతోష పెట్టిన వార్తలివి.