పాండురాజుకి శాపం – సైన్స్ కోణం (పార్ట్ 2)

Sharing is Caring...

సెక్స్ పరమైన శాపం ఒక పక్క, అందచందాలొలికే ముద్దుల చిన్న భార్య మరో పక్క. మనసు నిగ్రహించుకోలేకపోయాడు పాండురాజు. వసంతశోభ కూడా తోడుకావడంతో కోరిక తీర్చుకోవాలని ఆరాటపడ్డాడు. మాద్రి వలదని ఎంతగా వారించినా వినలేదు. సెక్స్ లో పాల్గొన్నాడు. వెంటనే ముని శాపం ఫలించింది. పాండురాజు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాలన్నీ లోకానికి ఎలా తెలిశాయన్నది అసలు ప్రశ్న. ముని శాపం, పాండురాజు కామప్రేరితుడు కావడం, సంభోగరతుడవ్వగానే మరణించడం – వంటి విషయాలను ఆ తర్వాతి కాలంలో కుంతీదేవి స్వయంగా భీష్ములవారికి విన్నవించింది. అలా..అలా… ఆనోటా ఈనోటా లోకానికి తెలిసింది.

పాండురాజు సంగతి తెలిసినవాళ్లు నవ్వుకునే ఉంటారు. కట్టుకథలంటూ కొట్టిపారేసుంటారు. నిత్యం అనారోగ్యంతో పాండు బాధపడుతున్నా రాజ్యపాలనలో ఉన్నంతకాలం లోపం చేయలేదు. శత్రురాజులను గడగడలాడించాడు. ప్రజల కష్టసుఃఖాలు తెలుసుకుంటూ పాలించాడు. పైకి చూసినప్పుడు భోగవిలాస జీవితమే అతనిది. కానీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తే అందులో ఎన్నో సుడిగుండాలు. మరెన్నో క్షణికావేశాలు. అసలు, మైథునం తర్వాత చెట్టంత మనిషి ఎందుకు చచ్చిపోతాడన్నది సామాన్యుల గుసగుసలు. ఇదేదో విచిత్రంగా ఉన్నదంటూ అనుమానాలు. కామశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాళ్లు సైతం`ఇదెక్కడి చోద్యం’అంటూ విస్తుపోవడాలూ జరిగిపోయాయి. లోకుల మాటలతో తమకు సంబందం లేదన్నట్టుగా కుంతీ,మాద్రీల సంతానం పాండవులుగా దినదినప్రవర్థమానులయ్యారు.

కోటలో రహస్యాలు పేటలో తెలిసినా పెదవి విప్పలేని పరిస్థితి. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ? అన్న అనుమానాన్ని మెదడు లోపలి  పొరల్లోకి తొక్కేశారు.సెక్స్ లో పాల్గొనగానే పాండురాజు మరణించిన సంఘటన- భారత రచన సాగించిన వ్యాసుని కల్పితమా ?, లేక ఈ సమస్త ప్రాణకోటిలో ఎక్కడైనా ఇలాంటి విడ్డూరం ఉన్నదా ?శాపం సంగతి పక్కనపెట్టి హేతుబద్దంగా ఆలోచిస్తే సెక్స్ కాగానే మగప్రాణి మరణించడం సాధ్యమయ్యేదేనా ? ఎక్కడైనా ఈ విడ్డూరం ఉన్నదా లేకపోతే మహాభారత రచన సాగించిన వ్యాసులవారి చిత్రమైన కల్పనా శక్తినుంచి ఆవిర్భవించిన ఉదంతమేనా ? అన్న సందేహాలు రాకమానవు.

వ్యాసులవారికి తెలుసునో లేదోకానీ, ఈ సృష్టిలో ఇలాంటి చిత్రాలు కూడా ఉన్నాయని ఈ 21వ శతాబ్దిలో జీవ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. ఈ సందర్భంగా రెండు పదాల గురించి చెప్పుకోవాలి. 1.సుసైడల్ రిప్రొడెక్షన్, 2. Sexual cannibalism . కొన్ని రకాల జీవుల్లో ఈ రెండు లక్షణాలు కనబడుతున్నాయి. సుసైడల్ రిప్రొడెక్షన్ అంటే సెక్స్ కాగానే మగజీవి ఆత్మహత్య చేసుకోవడం. ఇంతకంటే భయంరమైనది సెక్సువల్ కనిబాలిజమ్. ఈ లక్షణం ఏమంటే, సెక్స్ జరుగుతున్నప్పుడే ఆడ జీవి మొగ జీవిని నెమ్మది నెమ్మదిగా తినేస్తుంటుంది.

suicidal reproduction జంతువుల్లోనే కాకుండా మొక్కల్లో కూడా కనబడుతుంటుంది. తమను పోలిన జీవులను పుట్టించడమే ప్రత్యుత్పత్తి పరమార్ధం. ఈ అద్భుతకార్యంలో పాల్గొనడంతో మగజాతి లక్ష్యం నెరవేరినట్టే. ఇక తన మనుగడ అవసరం లేదని భావించడం వల్ల మగజాతి సెక్స్ కాగానే మరణాన్ని ఆహ్వానిస్తుంటుంది. కొన్ని రకాల బల్లులు,ఎలుకలు, కప్పలు, సాల్మన్ జాతి జీవులు, కీటకాల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తోంది. Antechinus అనే ఒక రకం ఎలుక జీవిత చక్రాన్ని నిశితంగా గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి. ఈ ఎలుకలు ఏడాదికంటే ఎక్కువకాలం బతకవు. తమ యవ్వన దశలో సెక్స్ హార్మోన్ల ప్రభావంతో చెలరేగిపోతాయి.

మరీ ముఖ్యంగా మగ ఎలుకల్లో testosterone అనే హార్మోన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ తరహా ఎలుకలు 14 గంటలపాటు సెక్స్ లో పాల్గొనగలవు. వీరావేశంతో ఊగిపోతాయి. ఆ వెంటనే చప్పబడిబోతాయి. ఆ తర్వాత జుట్టుఊడిపోయి నడవలేని స్థితికి వెళ్ళిపోతాయి. చివరకు ఆడ ఎలుకలు ఇలాంటి అందవిహీన మగజాతిని దరికిచేరనీయవు. నీరసం, నిస్సత్తువతో అవి మరణిస్తాయి. ఈజాతిలో సెక్స్ లో పాల్గొనే అవకాశం జీవితకాలంలో ఒకే ఒక్కసారి వస్తుంటుంది. అందుకే మగ ఎలుకలు తెగఆరాటపడతాయి. చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటాయి. సంభోగానందంలో అవి తమ మరణం గురించి ఆలోచించవు.

ఇక, కొన్ని కీటకాలలో ఉదాహరణకు ఆడజాతి చైనీస్ మాంటిస్ అనే కీటకం తన సెక్స్ కాలంలోనే మగ కీటకాన్ని నమిలి తినేస్తుంటుంది. జీవుల్లోని ఈ వింత లక్షణాలున్నట్టు మనకు ఈ మధ్యకాలంలోనే (21వ శతాబ్దిలోనే) తెలిసింది. కానీ వేల సంవత్సరాల కిందట వ్యాసులు రాసిన మహాభారతంలో మైథునం కాగానే మగజాతి మరణించిన సంఘటన ఉండటం ఆశ్చర్యమే. వ్యాసుని కల్పనాశక్తి అనాలో లేక భవిష్యదర్శనం అనాలో తెలియదుకానీ, ఆయన పేర్కొన్న కొన్ని అంశాలు యదార్థాలయ్యాయి. మరో ఉదాహరణ- పిండాన్ని నూటొక్క కుండలకు విభజించడం. గర్భంలో పిండం పెరగడం సహజం. కానీ అదే పిండాన్ని బయట వాతావరణంలో పెంచడం సాధ్యమే అని వ్యాసులవారు ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది- టెస్ట్ ట్యూబ్ బేబీల రూపంలో.

ఇక పాండురాజు విషయానికి వస్తే, సెక్స్ శాపాన్ని సైన్స్ కోణంలో చూస్తే ఇలా జరిగి ఉండవచ్చేమో అనిపిస్తోంది…. జన్యువుల ఉత్పరివర్తన (జెనిటికల్ మ్యూటేషన్) గురించి ఆలోచిస్తుంటే పాండురాజులోని ఈ వింత లక్షణం (సెక్స్ కాగానే మరణించే లక్షణం ) జెనిటికల్ మ్యూటేషన్ వల్లనే కలిగిఉండవచ్చు. శాపానికి శక్తి ఉన్నదని నమ్మితే ఆ శక్తి వల్లనే జీవకణాల్లో , లైంగిక కణాల్లో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా జన్యుఉత్పర్రేకం జరిగి ఉండవచ్చు. అదే suicidal reproductionకి దారితీసిఉండవచ్చు. పాండురాజులోని సెక్స్ కణాలు వీక్ గా ఉండి ఉంటే ఈ శాప శక్తి జన్యుఉత్పరివర్తనకు దారితీసిఉండవచ్చు.

మొత్తానికి పాండురాజుకి ఎదురైన సెక్స్ శాపం సంఘటన ఇప్పటికీ ఆలోచించే స్థాయిలో ఉండటం ఆశ్చర్యమే. మరి అలాంటప్పుడు వ్యాసులవారిని కేవలం రచయితగానే కాకుండా మహా శాస్త్రవేత్తగా కూడా భావించాలేమో. మరి మీరు కూడా ఆలోచించండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

————–    తుర్లపాటి నాగభూషణ రావు (988 529 2208)

Read also >>>>>>   పాండురాజు – సెక్స్ శాపం – సైన్స్ కోణం (Part 1)

  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!