పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? జరపమంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది ? ఉద్యోగులు ముందుకొస్తారా ? అన్ని జవాబు లేని ప్రశ్నలే. సుప్రీం తీర్పు వచ్చేవరకు సస్పెన్సే. ఇవాళ మధ్యాహ్నం కానీ ప్రభుత్వం,ఉద్యోగులు వేసిన పిటీషనలపై విచారణ జరగదు. విచారణ జరిగి కోర్టు తీర్పు బయటకొచ్చేవరకూ ఉత్కంఠ అనివార్యమే.కాగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి… రిటర్నింగ్ అధికారులను నియమించాల్సింది జిల్లా కలెక్టర్లు మౌనంగానే ఉన్నారు. కమీషనర్ ఆదేశాలను పట్టించుకోవడంలేదు. అధికార యంత్రంగం అంతా కోర్టు తీర్పు కోసమే ఎదురు చూస్తున్నది. ఇది ముందెన్నడూ లేని పరిస్థితి. ఇక సుప్రీం లో ఇటు ప్రభుత్వం , ఉద్యోగులు తమ వాదనను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు ఈ ఎన్నికలు భంగం కలిగిస్తాయని … కరోనా తగ్గుముఖం పట్టలేదని … వ్యాక్సినేషన్ తమకు ఇవ్వకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం కష్టమనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని … వ్యాక్సినేషన్ సాగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ కష్ట సాధ్యమనే వాదనను వినిపించబోతోంది.
కాగా ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఇప్పటికే కేరళతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ఈ తరహా కేసుల్లో ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన తీర్పులున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం… ఉద్యోగులు తీర్పు తమకు అనుకూలంగా రావచ్చని భావిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు మరో అడుగు ముందుకేసి సుప్రీం తీర్పు ఎన్నికల నిర్వహణకు అనుకూలమైనా తాము సహకరించేది లేదని ప్రకటనలు చేస్తున్నారు. తాము సహకరించకుండా నామినేషన్ ప్రక్రియ ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. అవసరమయితే సమ్మెకు దిగుతామని అంటున్నారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదు. ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలు బలిపెట్టడం ఏమిటి? ఎన్నికలకు మేం సిద్ధం.. కానీ దానికంటే ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఎన్నికలు పెట్టాలని కమీషనర్ నిర్ణయం తీసుకుని ఉద్యోగుల ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకెళ్లడం అన్యాయం అంటున్నారు. కాగా పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కమీషనర్ ప్రయత్నిస్తున్నారు. కానీ గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. ఉద్యోగ సంఘాలు కూడా గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
————–KNM