ధిక్కరణ కు పాల్పడ్డారని చెప్పేందుకు మనమెవరం ?

Sharing is Caring...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారా ? లేదా ? అన్న సంగతి  కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ వ్యతిరేక మీడియా విపరీత పోకడతో జగన్ కోర్టు ధిక్కరానికి పాల్పడ్డారు అని డిసైడ్ అయిపోయి పదే పదే వార్తలు వండి వారుస్తున్నాయి.  నిన్నో మొన్నో అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు  సీఎం జగన్ వ్యవహార శైలి కోర్టు ధిక్కార ధోరణిలో ఉందని వ్యాఖ్యానించినట్టుగా ఓ ప్రముఖ పత్రిక మొదటి పేజీలో వార్తా కథనం ప్రచురించింది. ఒక న్యాయవాది సీఎం జగన్, అజయ్ కల్లం లపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించేందుకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్ గారికి  లేఖ రాశారట.
ఆ లేఖకు అటార్నీ జనరల్ వారు స్పందిస్తూ  జగన్ లేఖ అంశం సుప్రీం పరిధిలో ఉంది కాబట్టి తాను జోక్యం చేసుకోబోనని జవాబు ఇచ్చారు. అంతవరకు బాగుంది.  లేఖ విషయం జగన్ మీడియా కు చెప్పడం తప్పని భావించిన జనరల్ వారు తాను రాసిన లేఖను మీడియా కు ఇవ్వడం తప్పుకాదా ? అందులో జగన్ ది ధిక్కారమే … అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు అంటూ ఆరోపించడం అటార్నీ జనరల్ వారికి సబబేనా ? అలా డిసైడ్ చేయడానికి , వ్యాఖ్యానించడానికి ఈయనెవరు ? ఒక వైపు ఆ అంశం కోర్టు పరిధిలో ఉందంటూనే జనరల్ వారు  కామెంట్స్ చేయడం సమంజసమేనా ?

సరే ..  అదలావుంచితే  ఇప్పటికి జగన్ లేఖ రాసి 25 రోజులు అవుతుంది. ప్రధాన న్యాయమూర్తి  దానిపై స్పందించినట్టు ఏ సమాచారం లేదు. ఆయన మౌనంగా ఉంటే ….   మధ్యలో వీళ్ళెవరు  జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించడానికి. ఓకే.  జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు అనుకుందాం. ఏం చేస్తారు ? మహా వేస్తె ఒక ఆరునెలలు శిక్ష వేస్తారు. అంతే.  గతంలో న్యాయమూర్తులపై చాలామంది ఆరోపణలు చేసిన ఉదాహరణలున్నాయి. ఆసందర్భాలలో కోర్టులు పెద్దగా స్పందించలేదు. వారి విషయం వదిలేస్తే … ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ను మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. అందుకుగాను మీకు శిక్ష వేస్తున్నాం అంటూ కోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగలదా ?  (గతంలో న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసినందుకు  దాన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ  కేరళ సీఎం  నంబూద్రిపాద్  కు హైకోర్ట్  1000 రూపాయల జరిమానా విధించింది. సుప్రీం కోర్ట్ దాన్ని 50 రూపాయలకు తగ్గించింది .ఆ కేసు వేరు .. ఈ కేసు వేరు )

ఒక వేళ జగన్ ది కోర్టు ధిక్కారమే అని భావించి అలాంటి నిర్ణయమే తీసుకుంటే ఏమౌతుంది ? జగన్ దాన్ని అంగీకరిస్తూనే … తన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని మళ్ళీ అడగరా ? పట్టు పట్టరా ? అపుడు కూడా మీడియా ముందు కెళ్ళరా ? లేక మీడియానే వెళ్లి ప్రశ్నించ కుండా ఉంటుందా ?  జగన్ ఆరోపణలపై స్పందించకుండా కేవలం ‘కోర్టు ధిక్కార అంశం ‘పైనే కోర్టు ఎలా స్పందిస్తుందనే వాదన ముందుకు రాదా ? 150 మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్న సీఎం జగన్ కి శిక్ష పడితే  అదొక పెద్ద సంచలనం కాకుండా ఉంటుందా ?

ఇటీవల  హైకోర్టు తీర్పులపై మంత్రులు ,ఎమ్మెల్యేలు, అభిమానులు కూడా స్పందించిన  సంగతి తెలిసిందే . మళ్ళీ అదే తీరులో వారు స్పందించరా ? ఇవన్నీ ఊహాజనిత అంశాలే . అయినప్పటికీ జరగడానికి అవకాశమున్నవే. అదే జరిగితే సమస్య మరింత పెద్దది  కాకుండా ఉంటుందా ?

అసలు  ఏది ధిక్కారమో ? కాదో  సలహాలు తీసుకోకుండానే  ప్రభుత్వం తరపున సీఎం జగన్ లేఖ రాసి ఉంటారు అని ఎలా భావిస్తారు.  సమస్య సున్నితమైనది కాబట్టి  ఏ సందర్భంలో ఎలా స్పందించాలో ? ఎలా డీల్ చేయాలో కోర్టుకు బాగా తెలుసు . దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. మరి కొన్నిన్యాయ సూత్రాలు ఉంటాయి. ఈ లోగానే  మనమెవరం  జగన్ ది ధిక్కారమని డిసైడ్ చేయడానికి ???

————–   KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!