ట్రంప్ కార్డు …అంటే గెలుపు ముక్క లేదా తురుపు ముక్క అని అర్ధం. అది పేరులో ఉంది కానీ ఆయనకు గెలుపు దక్కలేదు. ఓటమి స్పష్టంగా అర్ధమయ్యాక కూడా డోనాల్డ్ ట్రంప్ హుంకరిస్తున్నాడు. తనది ఓటమే కాదు .. ప్రత్యర్ధులు కుట్ర చేశారు .. మోసం చేశారు అని ఆరోపణలు. హుందాగా వ్యవహరించే శైలి లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. మొదటి నుంచి వివాదాలు .. వాటిని అనుసరించి ఘాటు వ్యాఖ్యలు, లైంగిక ఆరోపణలు, వెకిలి మాటలు, వెక్కిరింపులు, గిల్లికజాలు, బెదిరింపు ధోరణి , అనుభవలేమి ఇవన్నీ కలసి ట్రంప్ కొంప ముంచాయి. ప్రజల్లో ఆయన పట్ల వెగటు పుట్టించాయి. ప్రజల్లో ఏర్పడిన విరక్తీ నెగటివ్ ఓటుగా మారింది. శ్వేతా సౌధానికి ఆయనను దూరం చేసింది.
మహమ్మారి కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో ఆగ్రహం రగిలించింది. కరోనా నివారణకు కొన్ని చర్యలు చేపట్టినా … కరోనాను అరికట్టడంలో ఆయన విఫలమయ్యారనే పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యపు అధినేత గా జాగ్రత్తలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ట్రంప్ వాటిని గాలికొదిలేశారు. సలహాలిచ్చిన అంటువ్యాధుల నిపుణుడిని అవమానించే రీతిలో మాట్లాడటం కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. తామే సుప్రీం అన్న రీతి లో వ్యవహరించిన నేతలు కాలగర్భం లో ఎలా కలిసిపోయారో ? ఎలా పతనమయ్యారో ఆయన గమనించలేదు. సక్సెస్ ఫుల్ వ్యాపార వేత్తగా ట్రంప్ కి పేరుంది కానీ రాజకీయ అనుభవం లేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్.
కనీసం మంచి సలహాదారులను పెట్టుకోలేదు. ఉన్నవారు ఇచ్చిన సలహాలను పెడ చెవిన పెట్టారు. ఈయన వ్యవహార శైలి నచ్చక చాలామంది కొలువు మానుకొని వెళ్లిపోయారు. పాంపియో ఒక్కరే ఎక్కువకాలం ఉన్నది. కాసేపు ఆయనతో చర్చలు జరిపారంటే ఎవరైనా తల పట్టుకుని బైటకు రావాల్సిందే అంటారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య తర్వాత ట్రంప్ పై నల్లజాతీయులు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఇపుడు అవకాశం వచ్చింది. బ్యాలెట్ తో కొట్టి ఆకోపం తీర్చుకున్నారు. అప్పట్లో ఒక ప్రెసిడెంట్ గా హుందాగా మాట్లాడాల్సిన ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాంతో 30 నగరాల్లో నల్లజాతీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ పెట్టారు. భద్రతా సిబ్బంది కూడా ఈయన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డారు.
ఆందోళన కారులు శ్వేతా సౌధాన్ని చుట్టుముడితే ట్రంప్ వెళ్లి బంకర్ లో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడ్డ విషయం అందరికి తెల్సిందే. ఈ పరిణామాలన్నీ ట్రంప్ ఓటమికి బాటలు వేసాయి. ట్రంప్ సర్కార్ మెక్సికో నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చే వలస కూలీలను జైళ్లలో బంధించిన ఘటనలు మరీ దారుణం. ఆ కూలీల పిల్లలను తీసుకెళ్లి గిడ్డంగుల్లో దాచిపెట్టారు. అది మరీ ఘోరం. చిన్న పాపలు సైతం ట్రంప్ క్రూర వైఖరికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ అమెరికా సమాజం గమనిస్తూనే ఉంది. ఎన్నికల్లో గట్టిగా స్పందించింది. చివరికి ట్రంప్ సతీమణి కూడా పిల్లలను విషయంలో భర్తకు వ్యతిరేకంగా గళం విప్పింది.
ఇంకా వీసా నిబంధనలు కఠినతరం చేయడం , ఇతర దేశాలతో సరైన సంబంధాలు నిర్వహించుకోలేకపోవడం, బెదిరింపు ధోరణి ఆయన క్యారెక్టర్ ను దెబ్బతీశాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తమకు ఇవ్వకపోతే వాణిజ్యపరంగా ప్రతీకారం తప్పదని ప్రధాని మోడీ కి ఫోన్ చేసి హెచ్చరించిన సంగతి పెద్ద దుమారమే రేపింది. ట్రంప్ కొన్ని సంస్కరణలు చేశారు కానీ వాటికంటే ఎన్నో వివాదాలు ఆయన ఖాతాలోకి చేరాయి. చివరాఖరికి అవే ఆయనను దెబ్బతీశాయి. ఇంకోలా చెప్పుకోవాలంటే స్వయంకృతాపరాదం.
———- KNMURTHY
ఇది కూడా చదవండి>>>>>>>> భారత్ తో సఖ్యత అమెరికాకు అవసరమే.. ఎందుకంటే ?
ట్రంప్ ఓడిన బైడెన్ గెలిచిన
మన భారతీయ సంతతి వారు అమెరికన్ సెనేనెట్ లో
పాదు కుo టున్నారు , ఇపుడు ఉపాధ్యక్షు రాలు
భారతీయ సంత తే, కొన్నాళ్ళకి అధ్యక్షడు కూడా
భారతీయ సంతతి అవుతుంది
యు.వి.రత్నం
9.11.2020
This is my prediction.