మన పురాణాలు ఎన్ని?

Sharing is Caring...

Our Puranas .. their importance

మొహమ్మద్ ఘజనీ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, అతని వెంట వచ్చిన “అల్బెరూనీ” క్రీ.శ1027లో రాసిన తన ట్రావెలాగ్ లో భారతదేశంలో ఆ సమయంలో విస్తృతంగా లభ్యమౌతున్న 18 పురాణాలను రెండు  జాబితాలు గా చెప్పాడు.

సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 5

మ ద్వయం భ ద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయం
అ నా ప లిం గ కూ స్కా ని పురాణాని పృథక్ పృథక్.
పురాణాలను గుర్తుంచుకోవడానికి, అవేమిటో గుర్తించడానికి పద్మ పురాణంలో చెప్పబడిన సులభ సూత్రం.

మ –  మత్య, మార్కండేయ
భ – భవిష్య, భాగవత
బ్ర – బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ
వ – వాయు, విష్ణు, వరాహ, వామన
అ – అగ్ని, నా – నారద, ప – పద్మ, లిం – లింగ, గ – గరుడ, కూ – కూర్మ, స్కా – స్కాంద

ఈ 18 పురాణాలు ప్రామాణికమైనవి. ఇవి కాకుండా 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలగాపులగం అయినట్లు 1000 సంవత్సరాల క్రితమే ఆధారాలున్నాయి. తరువాతి కాలంలో భాగవతం ఏది? విష్ణువుదా , దేవిదా అనే దాని మీద అనేక వాదోపవాదాలు జరిగాయి. చివరకు విష్ణువుదే అని తేల్చారు.

ఈ పురాణాలలోని వివరణ, వాటి ప్రాముఖ్యతల గురించి చెప్పాలంటే…..
*  సృష్టి గురించి అవగాహన చేసుకొనేటప్పుడు, సృష్టిని బ్రహ్మ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి, సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి చెప్పేది, మొట్టమొదటి పురాణం “బ్రహ్మ పురాణం”.
*  సృష్టి కార్యం నిర్వర్తించే బ్రహ్మ ఎలా ఉద్భవించాడు? అనేది తరువాత వచ్చే ప్రశ్న. పద్మం నుండి బ్రహ్మ పుట్టాడు కనుక దాన్ని వివరించే “పద్మ పురాణం” రెండవది.

*  సృష్టికి కారణభూతుడైన బ్రహ్మ పుట్టింది పద్మం అయితే, ఆ పద్మానికి మూలం ఏది? అది విష్ణువు నాభి నుంచి పుట్టింది. అందులో నుంచే బ్రహ్మ ఉద్భవించి, తపస్సు చేసి సృష్టి చేశాడు. ఆ విష్ణుతత్వాన్ని ప్రతిపాదించే “విష్ణుపురాణం” మూడవది.
*  ఆ విష్ణువు వాసస్థానం ఏది?  ఆయన శేషశయ్యపై పవళించి ఉంటాడు. ఆ శేషువుకి ఆధారం వాయువు. ఆ శేషశయ్యని నిరూపించే “వాయు పురాణం” నాలుగవది.

*  ఆ విష్ణువు లీలలను వర్ణించే “శ్రీ మద్భాగవతం” ఐదవది.
*  విష్ణు సన్నిధిని చేరే పరంపరలో సన్యాసి ధర్మాలను వివరించేది, నారదునిచే చెప్పబడిన “నారద పురాణం” ఆరవది.
*  ఈ సృష్టి చక్రాన్ని నడిపించేది దేవి / శక్తి. ఆ దేవి గురించి వివరించే “మార్కండేయ పురాణం” ఏడవది.
*  బ్రహ్మాండంలో శక్తి ఉంది. ఆ శక్తి అగ్ని రూపంలో ఉంది. దీనిని వివరించే “అగ్ని పురాణం ” ఎనిమిదవది.

*  అగ్నితత్వం సూర్యుడు / నక్షత్రం మీద ఆధారపడి ఉంది.  దీనిని వివరించే “భవిష్య పురాణం” తొమ్మిదవది.
*  నిజంగా మారటం వికారం.  నిజంగా మారకున్నా, మారినట్లు కనిపించడం వివర్తం.
ఈ జగత్తు బ్రహ్మం వల్ల కలిగినదే. కానీ, ఈ జగత్తు సత్యం కాదు,శాశ్వతం అంతకన్నాకాదు. విశ్వానికి మూలకారణం బ్రహ్మమనీ,     విశ్వమంతా బ్రహ్మవివర్తమనీ తెలిపే “బ్రహ్మ వైవర్త పురాణం” పదవది.

*  శివ, విష్ణు రూపాలు బ్రహ్మం యొక్క సగుణ రూపాలు. ఆ శివుని గురించి చెప్పే “లింగ పురాణం” పదకొండవది.
*  ప్రసిద్ధి చెందిన రూపాలలో శివుని యొక్క వివిధ క్షేత్రాలను, వ్రతాలను తెలిపే “స్కాంద పురాణం” పన్నెండవది.
* విష్ణువు తొలి అవతారమైన మత్యావతారాన్ని వివరించే “మత్య పురాణం” పదమూడవది. సృష్టిలో మొదటి ప్రాణి అయిన చేప గురించి ప్రతిపాదిస్తుంది.
*  విష్ణువు మలి అవతారమైన కూర్మావతారం గురించి వివరించే “కూర్మ పురాణం” పదునాలుగవది. జీవపరిణామ సిద్ధాంతంలోని రెండో జీవులైన ఉభయచర (యాంఫిబియస్) జీవుల గురించి ప్రతిపాదిస్తుంది.

*  విష్ణువు మూడో అవతారమైన వరాహావతారం గురించి వివరించే “వరాహ పురాణం” పదునైదవది. క్షీరదాలకు మూల ప్రాణి అయిన wild boar గురించి ప్రతిపాదిస్తుంది.
*  విష్ణువు వామనావతారం గురించే చెప్పే “వామన పురాణం” పదహారవది.
*  జ్ఞానం వలన, ఉపాసన వలన జీవులకు కలిగే గతులూ, మరణానంతర జీవుని స్థితిని గురించి వివరించే “గరుడ పురాణం” పదిహేడవది.
* సకల సృష్టి,  సమస్త జీవుల స్థితిగతులను వివరించే “బ్రహ్మాండ పురాణం” పద్దెనిమిదవది, చివరిది.

——-  పులి ఓబుల్ రెడ్డి 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!