దిద్దుబాటలో మార్కెట్ 

Sharing is Caring...

స్టాక్‌మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ ఉండే సూచనలున్నాయి. సెన్సెక్స్ 45 వేల పాయింట్లకు పడే అవకాశాలు లేకపోలేదు.
ఇక మార్కెట్‌ వేగంగా పుంజుకునే అవకాశాలు తక్కువ.రికవరీ నెమ్మదిగా జరగొచ్చు.
మార్కెట్ సెంటిమెంట్ మెరుగ్గా లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు.అమెరికా, భారత బాండ్‌ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరుగుతున్న తీరు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.అలాగే సిరియాపై అమెరికా వైమానిక దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటం మరో కారణం అంటున్నారు.
ముడిచమురు, ఇతర కమోడిటీల ధరలు వేగంగా  పెరగడం … ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం… జీడీపీ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్త వహించడం వంటి కారణాలు మార్కెట్ ను పతన దిశగా నెట్టివేశాయి.  మార్కెట్ పతనానికి ఇవన్నీ కొన్ని కారణాలు కాగా మార్కెట్ అప్రతిహతంగా పెరగడం కూడా మరో కారణం.

ఏదో ఒక దశలో మార్కెట్ దిద్దుబాటుకి గురి కావాల్సిన అవసరం ఉంది. దిద్దుబాటు కూడా ఒకందుకు మంచిదే. మార్కెట్  ఎప్పుడూ పెరుగుతూ పోతే లాభాల స్వీకరణకు అవకాశం రాదు. ఇప్పటికే కొన్ని షేర్ల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  కొద్దీ రోజులుగా  కొత్త రికార్డులు నెలకొల్పుతున్న మార్కెట్ ఏదో ఒక రోజు దిద్దుబాటు కి గురవడం ఖాయమని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు.  నిన్న మొన్నటివరకు అధిక వడ్డీ రేట్లు ,అంచనాలు అందుకొని కార్పో రేట్ల ఫలితాలు వంటి ప్రతి కూల అంశాలను విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఆర్ధిక సంస్థలు విస్మరించారు కాబట్టే మార్కెట్ పెరిగింది. ఇపుడు అవకాశం వచ్చింది కాబట్టి అమ్మకాల తో మార్కెట్ ని పడేస్తున్నారు. 

ఇలా మార్కెట్ పతనం కావడం …మరల పుంజుకోవడం మామూలే కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే అమ్మకాలు , కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ ట్రెండ్ ఏమిటో పూర్తిగా గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. కొనుగోళ్ల విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తొందరపడి షేర్లను కొనుగోలు చేస్తే అవి మరింత తగ్గితే తక్షణ నష్టాలను ఎదుర్కోవాలి. ఇక ఇప్పటికే కొనుగోలు చేసిన షేర్ల ధరల్లో 5నుంచి 10 శాతం పెరుగుదల ఉంటే ఇన్వెస్టర్లు కూడా లాభాలు స్వీకరించడం మంచిదే. మార్కెట్ బాగా తగ్గినపుడు  మళ్ళీ అవే షేర్లను కొనుగోలు చేయవచ్చు.ఇలాంటి సమయాల్లో  ఇన్వెస్టర్లు  వ్యూహాత్మకం గా వ్యవహరించాలి. మార్కెట్ మరింత పతనం కావచ్చని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నప్పటికీ ట్రెండ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా తేల్చిచెప్పలేని పరిస్థితి నెలకొంది. వరుసగా మార్కెట్ పతనమైతే మటుకు  అమ్మకాలు వెల్లువెత్తవచ్చు .ఇలాంటి సందర్భాల్లో మార్కెట్ ను గమనిస్తూ ఉండటమే  చిన్న ఇన్వెస్టర్ల కు అన్ని విధాలా మంచిది.
…..  కె. ఎన్. మూర్తి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!