అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన రోవర్ అంగారక గ్రహంపై సేఫ్ గా ల్యాండ్ అయి తన లక్ష్య సాధనలో దూసుకుపోతోంది. ఆరు చక్రాలున్న రోవర్.. రెండేళ్లు అంగారకుడి పైనే ఉండి పరిశోధనలు చేస్తుంది. అంగారక గ్రహం పై జీవ రాశి ఉందా లేదా అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. అంగారక గ్రహం ఉపరితలాన్ని.. అక్కడ ఉన్న రాళ్లను, మట్టిని సేకరిస్తుంది.
అంగారకుడిపై రోవర్ దిగిన ప్రదేశం ఈ పరిశోధనకు ఎంతో కీలకం కానుంది. జెజెరో క్రేటర్ అనే ప్రాంతంలో రోవర్ ల్యాండ్ అయింది. క్రేటర్ అనేది కోట్ల ఏళ్ళ నాటి సరస్సు అని నాసా చెబుతోంది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారక గ్రహం నీటితో నిండి ఉండేదని గత పరిశోధనల్లో తేలింది. నదులు, సరస్సులు నిండుగా ఉండేవట. ఆ నీటిలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉండొచ్చు కాబట్టి వాటి ఆనవాళ్ల కోసం క్రేటర్ సరస్సు ప్రాంతంలో మార్స్ రోవర్‌ని ల్యాండ్ చేసింది నాసా.
సూక్ష్మజీవుల శిలాజాలను గుర్తించడమే లక్ష్యంగా…రోవర్ అన్వేషణ సాగుతుంది. క్రేటర్ ప్రాంతంలో ప్రస్తుతం నీళ్లు లేవు. సరస్సు అడుగున శిలాజాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే అక్కడ జీవుల ఉనికి గురించి తెలుస్తుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ పనులన్నీ రోవర్ లోని రోబో చేస్తుంది. పలు రకాల శాంపిల్స్ సేకరించి వాటిని భద్రపరుస్తుంది. రాబోయే రెండేళ్ల కాలంలో అంగారకుడిపై ఉన్న కొండలను,ఇసుక మేటలను, శిలలను, శిలాజాలను రోవర్ పరిశీలిస్తుంది. క్రేటర్ సరస్సు మొత్తాన్ని పరిశీలించి మట్టి,రాళ్లను సేకరిస్తుంది. రోవర్ పరిశోధనలో సూక్ష్మజీవులు, ఏలియన్స్ ఆనవాళ్లు కూడా బయటపడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు .
ఇదిలా ఉంటే అంగారక గ్రహంపైకి చైనా పంపిన తియాన్వే 1 … యూఏఈ పంపిన అల్ అమల్ అంతరిక్ష నౌకలు కూడా పరిశోధన చేస్తున్నాయి. నాసా కంటే ముందుగా చైనా, యూఏఈ తమ స్పేస్ క్రాఫ్ట్ లను పంపించాయి. ఈ మూడు కూడా వివిధ విషయాలను కనుగొంటాయి.
అంగారకుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇంతకుముందు రోవర్స్ పంపిన చిత్రాల ఆధారంగా గుర్తించారు. ఆ నీరంతా ఏమైపోయింది. అందుకు కారణాలు ఏమిటీ ? అనేది రాబోయే రోజుల్లో నాసా రోవర్ తెచ్చే ఆధారాల ద్వారా తేలుస్తుంది.
అలాగే అక్కడ జీవజాలం ఉనికి కి ఏమైనా ఆధారాలు తెలుసుకోగలిగితే మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైనట్టే. నదులు , సరస్సులు ఉన్నాయి కాబట్టి జీవజాలం ఉండొచ్చు అన్న నాసా అంచనాలు ఫలిస్తాయో లేదో చూడాలి.