Supersonic cruise missile Brahmos …………………..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణు లలో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు.
ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే అవకాశం ఇవ్వదు. బ్రహ్మోస్ రెండు దశల క్షిపణి. ఒక ఘన ఇంధన ప్రొపెల్లెంట్ బూస్టర్ ఇంజిన్ క్షిపణిని సూపర్‌సోనిక్ వేగంతో నడిపిస్తుంది. ఒక సెకనులో దాదాపు 1-కి.మీ దూరాన్నికవర్ చేసినప్పుడు.. ద్రవ ఇంధన రామ్‌జెట్ ఇంజన్ దానిని మాక్ 3 అంటే శబ్దపు వేగం కంటే మూడు రెట్లు వరకు వేగం పెంచుతుంది. అపుడే రెండవ దశ ప్రారంభమవుతుంది.
ఇది అత్యంత వేగవంతమైన బహుముఖ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. బ్రహ్మోస్లో పలు రకాలు ఉన్నాయి. అయితే ఈ క్షిపణి కి బ్రహ్మోస్ అనేపేరు ఎలా వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు.
బ్రహ్మోస్ ను మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. దీనికి భారతదేశం, రష్యాలకు చెందిన రెండు ప్రధాన నదుల పేర్లు పెట్టారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి ‘బ్రహ్మోస్’ అని పేరు పెట్టారు.
ఇటీవల పాక్ పై దాడుల్లో ఈ క్షిపణి ని వినియోగించారు. దీని పని తీరు బాగుందని ..లక్ష్యాలను సాధించిందని వార్తలు వచ్చాయి. బ్రహ్మోస్ శక్తికి శత్రు దేశాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దాని సామర్థ్యంతో పాటు, దాని పేరు కారణంగా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ దేశాల్లో కూడా లేదని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ అంటున్నారు.భారత ఆయుధ సంపత్తిని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం ద్వారా భారత్ శక్తి, సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చాయని జాన్ స్పెన్సర్ స్పష్టం చేశారు.