ఇదొక ప్రకృతి ‘చిత్రం’ !

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే ఆ పెద్ద రాయిని అక్కడికి ఎవరు చేర్చారో ఎవరికి తెలియదు. కొండ వాలు ప్రాంతంలో ఉన్న ఆ రాయి కొన్ని వేల ఏళ్ళనుంచి అలాగే కదలకుండా ఉంది. దగ్గరకెళ్ళి చూస్తే మీద పడుతుందేమో అన్న భయం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి చిత్రమైన రాళ్లు , కట్టడాలు, గుళ్ళు , గోపురాలు, నిర్మాణాలు కనిపిస్తూనే ఉంటాయి.

ఈ పెద్ద రాయి మహాబలిపురంలో ఉంది.అక్కడికి వెళ్లిన వాళ్లంతా ఆ బండ రాయిని చూసి అబ్బురపోతుంటారు. సరదాగా ఫోటోలు కూడా దిగి వస్తుంటారు. ఈ రాతిని కృష్ణుడి వెన్నముద్ద అని పిలుస్తుంటారు. ఐదుమీటర్ల వ్యాసం, 250 టన్నుల బరువుతో గుండ్రంగా ఉన్న ఆ రాయి ఎటూ దొర్లకుండా అలాగే నిలిచి ఉండటం ప్రకృతి చిత్రమే అనుకోవాలి.

ఈ రాయి గురించి కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. అది కదలకుండా ఎలా నిలిచిందో ఏ భౌతిక శాస్త్ర సిద్ధాంతానికి అందడం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. పెద్ద వానలు .. గాలులు వచ్చినా రాయి ఇసుమంతా కూడా కదలలేదట.మొదట్లో ఈ రాయిని అక్కడకెవరో చేర్చారని అనుకున్నారు కానీ కొండ అంచుకు దాన్ని చేర్చడం సులభం కాదని నిపుణులు చెప్పారు.

సులభం అనుకున్నా… ఎలా తరలించారు ? వేల ఏళ్ల క్రితం అక్కడ  ఎలా ఉంచారనేదీ ఎవరి ఊహకీ అందని విషయం.  ఆ పెద్ద బండ రాయిని కదిపేందుకు రకరకాలుగా ప్రయత్నించారు కానీ అంగుళం కూడా ముందుకు కదల్చలేకపోయారు. 1908లో అప్పటి మద్రాసు గవర్నరు గా ఉన్న ఆర్థర్ లాలీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అది దొర్లితే చుట్టుపక్కల ఇళ్లకు, మనుష్యులకు ప్రమాదం అని తలచి పది ఏనుగులతో దాన్ని కిందకు నెట్టించడానికి ప్రయత్నించారు.

ఎంత ప్రయత్నించినా ఆ రాయి అంగుళం కూడా కదలలేదట. ఇక ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్నవారెవరూ లేరు. అదొక పర్యాటక ఆకర్షణగా మారిపోయింది. కృష్ణుడు చిన్నతనంలో వెన్నముద్దలను  దొంగిలించి, ఇక్కడ పెట్టుకుని తినేవాడనీ … అలా ఒక ముద్దను మర్చిపోగా అదే అలా పెరిగి పెరిగి రాయిగా మారిందని  ఇక్కడ చెప్పుకుంటారు.

ఆకాశంలోంచి జారిపడిందనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఈ రాయిని ‘స్టోన్‌ ఆఫ్‌ స్కై గాడ్‌’ అని కూడా పిలుస్తారు. ఆ బండ రాయి అక్కడ నిలబడటంలోని  మర్మం ఏమిటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.గణేష్ రథానికి సమీపంలో ఉన్న కొండ వాలుపై ఈ బండరాయి ఉంది. ఈ రాయి భౌతిక శాస్త్రం ప్రాధమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. చెన్నై వెళ్ళినపుడు చూసి రండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!