చరిత్ర అడక్కు .. చెప్పింది రాసుకో!

Sharing is Caring...

Goverdhan Gande …………………………………………… 

ఏమిటయా ఆ ప్రశ్నలు?
ఇంతకు ముందెక్కడ పని చేశావ్?
ఏ జిల్లా? తమ్ముడూ…మీ ఇంచార్జ్ ఆయనే కదా?
మీ ఎడిటర్ అతనే కదా?నాకు తెలుసాయన.

ఆయన నాకు ఫ్రెండేలే.నేను అడిగానని చెప్పు బాబు.
బాగా రాయి.నాకు ఫోన్ చెయ్.మనం కలుద్దాం.
మీ బాస్ తో నేను మాట్లాడతానులే.
పొలిటికల్ పార్టీల కార్యాలయాల్లో జర్నలిస్టులు తరచూ ఎదుర్కొనే ప్రశ్నలు?

ఈ ప్రశ్నలు.. పలకరింపులు… పరామర్శలు…. బెదిరింపుల మధ్య నలిగిపోతుండగా ఆఫీసు నుంచి ఫోన్.
ఏమిటి విశేషాలు? వార్తలు? స్పెషల్ స్టోరీ ఏమిస్తున్నావ్ ఈ రోజు? ఇంకా రాలేదేమిటి?
హైదరాబాద్ లాంటి నగరాల్లో,ఇతర రాజకీయ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టు దయనీయ పరిస్థితి ఇది. ఇంత ఒత్తిడిలో పనిచేసే విలేకరి అందుకునే జీతం ఆకర్షణీయమైనదేమీ కాదు.

ఆరంకెల్లో ఏమీ ఉండదు.చాలీ చాలని అత్తెసరు జీతం.అది కూడా సమయానికి చేతికి అందదు.ఇంత ఒత్తిడిలోను తాను విన్నది,చూసింది,అర్ధం చేసుకున్న సంగతిని యధాతధంగా ఏ మేరకు రిపోర్ట్ చేయగలడు? ఏమేరకు న్యాయం చేయగలడు? చాలా పత్రికలకు తమ తమ రాజకీయ వైఖరులు ఉంటాయి.

విన్నది, చూసింది, అర్ధం చేసుకున్నది ఈ పరిమితులకు లోబడి ఎవరినీ నొప్పించకుండా అందమైన కథనంగా మలచగలగాలి.ఇదండీ జర్నలిస్టు ఉద్యోగ జీవితం.ఇక్కడ ఆయన కలానికి ఏ మేరకు స్వేచ్ఛ ఉంది? సొంత ఆలోచనకు అవకాశం ఉందా? తెలుసుకున్న విషయాన్ని సామాజిక కోణంలో రాయగల స్వేచ్ఛ ఉన్నదా? ఈ స్థితిగతులను తమకు అనుకూలంగా మలచుకొని బతక నేర్చిన జర్నలిస్టుల సంగతి వేరు.

ఇదంతా సగటు జర్నలిస్ట్ నిత్య ఉద్యోగ జీవిత సంఘర్షణ.ఇంగ్లీష్ జర్నలిస్టుల స్థితి కొంత మెరుగు కానీ తెలుగు,హిందీ,ఉర్దూ జర్నలిస్టులందరిదీ ఇదే దుస్థితి.ఈ కథ అంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.ఈ రోజు ఓ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రశ్నలు వేయబోయిన జర్నలిస్టుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “చెప్పింది రాసుకో” అంటూ వెళ్లిపోయాడు ఓ నాయకుడు.
———————
పైన రాసిందంతా ఇప్పటి పరిస్థితి. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. జర్నలిస్టులు అంటేనే నాయకులు కొంత భయపడేవారు. ఎంత కోపమున్నా బయటపడేవారు కాదు. ఎక్కడ ఏమి మాట్లాడితే తమల్ని ఇరికిస్తారా అనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేవారు.

అప్పట్లో జర్నలిస్టులు అంత నిఖార్సుగా ఉండేవారు. పత్రికల యజమానులు ఇంకా నిఖార్సుగా ఉండేవారు. ఇపుడు కూడా నిఖార్సైన జర్నలిస్టులు లేకపోలేదు. కానీ రాజకీయ పార్టీలతో పత్రికల యజమానులు కలసిపోయి  వాటికి మద్దతుదారులుగా మారిపోయారో … అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి.

ఎంత నిఖార్సైన జర్నలిస్టు అయినప్పటికీ మేనేజ్మెంట్ చెప్పిన రీతిలో పనిచేయాల్సిందే. యాజమాన్యం గీసిన పరిధిలో వార్తలు వండాల్సిందే. ఈ చట్రం లో ఇమడగలిగిన వారు ఇప్పటికి పనిచేస్తున్నారు. చాలామంది బయటికెళ్లి వేరే దారులు చూసుకుంటున్నారు. 90 వ దశకం నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడో కొద్దీమంది జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుని ఉండొచ్చు. కానీ చాలా మందివి అర్ధాకలి బతుకులే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!