Typical actor ………………….
కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం .. వారితో పోలిస్తే విలన్ గా కోట విభిన్న శైలిలో నటించారు. సీరియస్ విలన్ గా అదే సమయంలో కామెడీ విలన్ గా కూడా మెప్పించారు.
తన నటనతో విలనిజానికి కొత్తదనం జోడించిన కోట కి రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవం సినీ రంగంలో ఎదగడానికి ఉపయోగపడింది.‘ప్రాణం ఖరీదు’తో సినీ రంగంలోకి ప్రవేశించారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు పాత్రలు కూడా చేశారు. ఏపాత్ర అయినా చేయడానికి ఆయన వెనుకాడే వారు కాదు. అలవోకగా పాత్రల్లో ఇమిడిపోగల దిట్ట కాబట్టే 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు.
జంధ్యాల వంటి దర్శకులు కోట తో విభిన్నమైన పాత్రలు చేయించారు. వాటిలో లక్ష్మీపతి పాత్ర ఒకటి. ఈ పాత్రలో కోటను తప్ప మరొకరిని చూడలేం అన్నంత గొప్పగా నటించాడు. అలాగే టీ కృష్ణ డైరెక్ట్ చేసిన ప్రతిఘటన లో కూడా తెలంగాణ యాస లో మాట్లాడే విలన్ కాశయ్య గా అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.. అలాగే గణేష్ సినిమాలో విలన్ పాత్రలో జీవించారు . రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మండలాధీశుడు’ చిత్రంలో ఎన్టీఆర్ లా నటించారు. అప్పట్లో అదొక సెన్సేషన్.
ఆ పాత్ర చేసిన నేపథ్యంలో ఆయనకు ఒక దశలో అవకాశాలు కూడా తగ్గాయి.ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. అగ్ర నటులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలతో కలిసి ఆయన పనిచేశారు.
‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
కోట కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ పురస్కారం పొందారు. 1990 దశకంలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1968 లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు.ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అప్పటి నుంచి డల్ అయ్యారు.
కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోట కూడా డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే నటన పట్ల ఆసక్తితో నాటకాల వైపు మొగ్గు చూపారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పని చేశారు. గత కొంత కాలం గా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కోట జులై 13 న శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.