Unusual thing ……………………………………
పై ఫొటోలో కనబడేది ఒక వ్యక్తి తల. అతని పేరు డియాగో ఎల్విన్. ఒకటి కాదు రెండు కాదు… 182 ఏళ్లకు పైగా ఆ వ్యక్తి తలను లిస్బన్ యూనివర్సిటీ ల్యాబ్ లో భద్రపరిచారు.ఇంతకూ అతడు ఏమైనా లెజెండా.? లేక ఏ దేశానికైనా అధ్యక్షుడా.? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
అతడు ఏమి గొప్ప వ్యక్తి కానే కాదు.. ఓ కిరాతకుడు.. కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. సీరియల్ కిల్లర్. అమాయకులని చూడకుండా.. చిత్ర హింసలు పెట్టి 70 మందికి పైగా వ్యక్తులను హత్య చేసిన సైకో కిల్లర్.
ఈ డియాగో ఎల్విన్ 1819లో స్పెయిన్లో పుట్టాడు. ఉద్యోగం కోసం 25 ఏళ్ళ వయసులో పోర్చుగల్ లోని లిస్బన్ కు వచ్చాడు. ఎంత ప్రయత్నించినా అతడికి ఎలాంటి ఉద్యోగం దొరకలేదు. ఈ క్రమంలో చిన్న చిన్న నేరాలు చేయడం మొదలు పెట్టాడు. మెల్లగా స్థానిక దొంగల ముఠాలతో చేరి దారి దోపిడీలకు పాల్పడేవాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాడు.
అయితే.. డియాగోకు ఈ డబ్బు కూడా సరిపోలేదు. ఎలాగైనా మరింత సొమ్ము సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. రైతులనే టార్గెట్ గా చేసుకుని.. వారి కోసం రాత్రుళ్లు ఓ బ్రిడ్జి దగ్గర కాపు కాసేవాడు. ఒంటరిగా అటువైపు ఎవరొచ్చిన వారిని దోచుకుని.. ఆ తర్వాత చంపేసి.. శవాలను బ్రిడ్జిపై నుంచి నీళ్ళల్లోకి పడేసేవాడు. ఇలా సుమారు 70 మందిని పొట్టన పెట్టుకున్నాడు.
మొదట్లో బ్రిడ్జి కింద నీళ్లలో దొరికిన మృతదేహాలు చూసి .. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుకున్నారు. కానీ ఆ సంఖ్య పెరుగుతున్నతీరుతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎంక్వైరీ మొదలు పెట్టారు. చనిపోయిన వారిలో కొందరు ధనిక రైతులు ఉన్నారని తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే బ్రిడ్జి దగ్గర భద్రత పెంచారు.
ఇది తెలుసుకున్న డియాగో తన ప్లాన్ మార్చుకున్నాడు. లిస్బన్ నగరంలోని ధనికుల ఇళ్లను టార్గెట్ గా పెట్టుకున్నాడు. తన ముఠాతో ఆ ధనికుల ఇళ్లకు వెళ్లి సొమ్ము దోచుకుని వారిని హత్య చేసేవాడు. అయితే ఒక రోజు ఓ డాక్టర్ ఇంట్లో డియాగో తన ముఠాతో దోపిడీకి పాల్పడి.. ఆ తర్వాత ఇంట్లో వారిని చంపేసి పారిపోతుండగా.. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయాడు.
డియాగోను పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో థర్డ్ డిగ్రీ పద్దతిలో విచారించారు. దీంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. సుమారు 70కి పైగా హత్యలు చేసినట్లు డియాగో ఒప్పుకున్నాడు. ఇక ఆపైన పోర్చుగల్ కోర్టు 1841లో డియాగోకు మరణ శిక్ష విధించింది.
అయితే అప్పుడే కొందరు వైద్యులు.. సీరియల్ కిల్లర్స్ ఎలా ఆలోచిస్తారన్న దానిపై పరిశోధనలు చేస్తామని.. అందుకు డియాగో తల కావాలని కోరారు. దీనికి కోర్టు, అక్కడి ప్రభుత్వం అనుమతించాయి.. ఆవిధంగా అప్పటి నుంచి సుమారు 182 ఏళ్లు గా డియాగో తలను కెమికల్స్ నిండిన ఓ సీసాలో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. ఇప్పటికి ఆ తల లిస్బన్ యూనివర్సిటీ ల్యాబ్ లో ఉంది. అక్కడ చదువుకునే విద్యార్థులను మాత్రమే ఆ తలను చూసేందుకు అనుమతి ఇస్తారు. బయట వారికీ అనుమతి లేదు.
post updated on oct 24/10/24