భారతీరాజా మూడో కన్ను ఈయనే !

Sharing is Caring...
Bharadwaja Rangavajhala ……..  

ఏ సినీ దర్శకుడు అయినా తాను చెప్పాలనుకున్నది … కెమెరాతో చూపుతాడు. అందుకే కెమెరామాన్  దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆకళింపు చేసుకోని ఆ విధంగా కెమెరాతో తెరపై కెక్కించాలి. అలాంటి అద్భుత ఛాయాగ్రాహకుల్లో కణ్ణన్ ఒకరు. భారతీరాజా తెర మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్ధం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారాయన.

అందుకే ఆయన్ని భారతీరాజా కన్నుగా..  చూపుగా చెప్తూంటారు. కణ్ణన్ ది సినిమా ఫ్యామిలీనే. ఆయన తండ్రి ఎ.భీంసింగ్ చాలా పెద్ద దర్శకుడు. హిందీలో దాదాపు పద్దెనిమిది సినిమాలు డైరక్ట్ చేశారాయన.తెలుగులో ఎన్టీఆర్ తో ఒకే కుటుంబం , బంగారు మనిషి లాంటి సినిమాలు తీశారు. ఎన్టీఆర్ కెరీర్ లో మచ్చిపోలేని సినిమాగా నిల్చిన రక్తసంబంధం మాతృక పాశమలర్ భీంసింగ్ తీసినదే.

కరుణామయుడు దర్శకుడు కూడా భీంసింగే.భీంసింగ్ తెలుగు వాడే. అనంతపురం జిల్లా నుంచీ చెన్నైలో సెటిలైన కుటుంబం. ఆయన కుమారుల్లో ఒకరు కణ్ణన్. ఎడిటర్ లెనిన్ కూడా భీంసింగ్ కొడుకే.చిరంజీవి కెమేరామెన్ గా పాపులర్ అయిన లోక్ సింగ్ కూడా ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే. భీంసింగ్ అన్న ఉద్దం సింగ్ కొడుకు లోక్ సింగ్ . అలా దక్షిణాది చిత్రాల్లో మంచి కెమేరా పనితనం కనబరచిన ఇద్దరు కెమేరా దర్శకులు ఒకే కుటుంబం నుంచీ రావడం విశేషం.

హరనాథ్ తీయాలని ప్రయత్నించి చిత్రీకరణ పూర్తై ఆగిపోయిన పగడాల పడవ చిత్రానికి కణ్ణన్ పని చేశారు. అలా మొదలైన ప్రయాణంలో తమిళ సినిమాలకే ఎక్కువ పన్జేశారు.భారతీరాజా తీసిన తెలుగు సినిమాలు సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని , కొత్త జీవితాలు చిత్రాలకు పన్జేశారు.ఆరాధన సినిమా చూసినప్పుడు ఆ సినిమా తమిళ వర్షన్ లో హీరో సత్యరాజ్ కావడంతో చిరంజీవికి కూడా దాదాపు అవే యాంగిల్స్ వాడేశారీ కెమేరామేనూ .. దీంతో చిరంజీవి కాస్త పొట్టిగా కనిపించాడు. అదే లోక్ సింగ్ ని పెట్టుకుని ఉంటేనా అనుకుంటారు ఎవరైనా. 

మరీ ముద్దగా ఉంటేలా నాటకాలు చూస్తున్నామా సినిమా చూస్తున్నామా అనే అనుమానం వచ్చేలా రూపొందిన సినిమాల నుంచీ కాస్త భిన్నంగా మన మధ్యే కథ జరుగుతున్న అనుభూతి కలిగించడం అనే ఆధునిక పోకడ ప్రారంభించిన కెమేరా దర్శకుల్లో కణ్ణన్, లోక్ సింగులు ప్రముఖులు.

చాలా అందంగా ఫ్రేమ్ పెట్టగలరు. ప్రకృతి అందాలను పట్టుకోవడంలో ఇద్దరూ చాలా గొప్పోరు. లోక్ సింగ్ చేసిన మంత్రిగారి వియ్యంకుడు కణ్ణన్ పని చేసిన సీతాకోక చిలుక చిత్రాలు చూస్తే అర్ధమైపోదూ .ఎర్రగులాబీలుకు నివాస్ కెమేరా దర్శకత్వం వహించారు ఎందుచేతో … కానీ టిక్ టిక్ టిక్ కు మాత్రం కణ్ణన్నే.

ఈ రెండూ … ఓ బడ్జట్ హాలీవుడ్ చిత్రాల్లా ఉంటాయి. ఆ రేంజ్ లో తీయడం … టిక్ టిక్ టిక్ లో ఓ నటన మయూరీ వయ్యారీ పాట చిత్రీకరణ … సీతాకోక చిలుక సినిమాలో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకుని తోటలో ముచ్చెర్ల అరుణ తిరుగాడే సన్నివేశమూ .. మిన్నేటి సూరీడు పాటలోనూ కణ్ణన్ కెమేరా పని తనం చాలా బాగుంటుంది.కణ్ణన్ కెమేరాలో పల్లె సొగసులు చాలా గొప్పగా పలుకుతాయి. శివాజీ రాధల ఆత్మబంధువు సినిమాను తెర మీద నడిపిన తీరు చాలా బాగుంటుంది.

నిజానికి ఒక రచయిత కాయితం మీద కథ రాయడానికి మంచి పెన్నును వెతుక్కుంటాడు. అలా .. ఓ దర్శకుడు తెరమీద సినిమా కథ రాయడానికి ఎంచుకునే పెన్నే కెమేరా. దర్శకుడి హృదయాన్ని ఎరిగిన కెమేరా దర్శకుడు దొరికితే ఆ సినిమా దర్శకుడ్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. భారతీరాజా అదృష్టం కణ్ణన్. తెలుగు ప్రేక్షకులకూ మంచి సినిమాలను అందించిన కణ్ణన్ నాలుగు నెలల క్రితం కన్నుమూసారు. 

సాగర సంగమమే … పొంగిపొరలే అందాలెన్నో పొంగి పొరలే … అరె ఏమైందీ … ఒక మనసుకు రెక్కలొచ్చి … ఓ నటన మయూరీ .. వయ్యారీ .. నడయాడే నీ పాదం .. ఇలా అనేక పాటలు కణ్ణన్ కెమేరాతో మనల్ని కట్టిపడేసాయి.  ఈ పాటలున్నంత కాలం ఆయన ఎక్కడకీ పోడు .. ఊరికే పోయాడంటారుగానీ … పోవడం అంటే ఈ ఊళ్లో లేకపోవడమేనా. 

 ఇది కూడా చదవండి >>>>>>>  ఎవర్ గ్రీన్ సాంగ్ ‘సఖియా వివరించవే’ ! 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!