ఈ చాయ్ వాలా సామాన్యుడు కాదండోయ్!

Sharing is Caring...

A fighter for information rights…..…………….

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కేఎం యాదవ్. అతగాడు అవినీతిపై పోరాటం చేసాడు. అందు కోసం చేస్తున్న ఉద్యోగాన్నే వదిలేశాడు… భౌతిక దాడులు జరిగినా భయపడి పారిపోలేదు. పట్టుదల వదల్లేదు. సంకల్పం వీడలేదు.  800  సహ దరఖాస్తులు సంధించి మామూళ్ల రుచి మరిగిన లంచగొండి ఉద్యోగుల భరతం పట్టాడు. 

సమాచారహక్కు చట్టం ఆవశ్యకత ను తెలియ జేస్తూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించాడు… ఇతగాడి నిజాయితీకి  గుర్తింపుగా అవార్డులెన్నో అందాయి…   సహ హక్కుల కోసం పోరాటం చేసే వారందరు  అతడి గురించి తెలుసుకోవాల్సిందే.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ కి సమీపంలో చౌపే పూర్‌ అనే గ్రామం ఉంది. ఆ ఊరి మధ్యలోకి వెళ్లగానే మట్టిగోడలతో నిర్మించిన చిన్న పూరిపాక కనిపిస్తుంది.అదొక చిన్న హోటల్‌. నాలుగు బల్లలు, పది కుర్చీలు ఉండే ఆ టీకొట్టు ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఎందుకంటే అదొక టీస్టాల్‌ మాత్రమే కాదు… ‘సమాచార హక్కు’ (సహ) చట్టాన్ని ఆయుధంగా మలుచుకొని చుట్టుపక్కల ఇరవై గ్రామాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఒక యోధుని కార్యాలయం. దాన్ని నడుపుతోంది కేఎం యాదవ్‌. అక్షరం ముక్కరాని నిరక్షరాస్యుల నుంచి బాగా చదువుకున్నవారికి సైతం సహ ఆయుధాన్ని ఎలా ఎక్కుపెట్టాలో, సమస్యలను ఎలా ఒడుపుగా ఎదుర్కోవాలో నేర్పించే కార్యక్షేత్రం ఆ పాక హోటల్ అంటే అతిశయోక్తి కాదేమో. 

డిగ్రీ పూర్తవగానే యాదవ్‌ సొంతూరు వదిలేసి దగ్గర్లోని కాన్పూర్‌ నగరం చేరాడు. అక్కడే ఓ ప్రభుత్వసంస్థలో ఉద్యోగం సాధించాడు. సామాజిక సమస్యలపై అతడికి అవగాహన ఎక్కువ. 2005లో సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దాని ఆధారంగా అవినీతిపై ఎలా పోరాడవచ్చో కాన్పూర్‌లోనే ఆచరణాత్మకంగా చూశాడు. ఈ సమయంలోనే కొత్తగా వేసిన రోడ్డు పాడైందనీ, పాఠశాల గదుల నిర్మాణం కోసం విడుదలైన నిధులు తినేశారని తరచూ ఏదో ఒక  ఫిర్యాదు అందేది.

గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకుతినే ప్రభుత్వ యంత్రాంగం పని పట్టాలంటే గ్రామాల్లోనే సమాచారహక్కు అవసరం ఎక్కువని అతడు భావించాడు. అంతే … 2010లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి చౌపే పూర్‌ బయల్దేరాడు. హాయిగా సాగుతున్న జీవితాన్ని కష్టాలమయం చేసుకోవద్దని సన్నిహితులు వారించినా విన్లేదు. జీవితం గడవడానికి  ఊళ్ళో  టీకొట్టు పెట్టాడు.

అసలు వ్యాపకం మాత్రం ఆర్టీఐతో అవినీతిపరుల భరతం పట్టడమే. భూవివాదాలు, రుణ పథకాలు, పింఛన్లు, రోడ్డు నిర్మాణాలు, తాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలల నిర్మాణం… ఇలా ఒకటేమిటి … ప్రతి అంశంపై సమాచారహక్కు చట్టాన్ని ఎక్కుపెట్టాడు. 

నిలదీసేవాడిపై దాడులు జరగడం మనదేశంలో మామూలే. మామూళ్లకు అలవాటుపడిన సర్కారీ అధికారులు యాదవ్‌ దరఖాస్తులను అతడి ముందే చెత్తబుట్టలో చింపి పడేసేవారు. నిబంధనలు గుర్తు చేసి, అప్పీలుకు వెళతానని నిలదీసేసరికి నీళ్లు నమిలేవారు. తమ ఆటలకు అడ్డుపడుతున్నాడని స్థానిక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైరౌడీలతో దాడులు చేయించారు. అయితే యాదవ్‌ దేనికీ బెదరలేదు.

గ్రామస్తులు కూడా అతడికి అండగా నిలవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సహచట్టం ముందు తలవంచక తప్పలేదు. యాదవ్‌ ప్రతిరోజు ఉదయం మూడుగంటలపాటు చౌపే పూర్‌తోపాటు చుట్టుపక్కల దాదాపు ఇరవై గ్రామస్తుల సమస్యలు వినడానికే సమయం కేటాయిస్తాడు. ‘రాయడం చదవడం రానివారికి సమాచార హక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. చదువుకున్నవారికి సైతం కొన్నిసార్లు అప్పీళ్లు… నిబంధనలు అర్థం కావు. అనుభవజ్ఞుడిగా తానే వాళ్లకి దారి మాత్రమే చూపేవాడు.

కేవలం పదిరూపాయల దరఖాస్తుతో ఒక గ్రామం నుంచే అవినీతిని తరిమేసిన అతగాడు చుట్టుపక్కల ఊళ్లను  అదేతీరుగా మార్చే పనిలో ఉన్నాడు.అవినీతిపై యాదవ్‌ చేస్తున్న పోరాటాన్ని  స్థానిక మీడియాతో పాటు జాతీయ స్థాయి మీడియా ప్రశంసిస్తూ కథనాలు రాసింది. అతడి కృషికి రాష్ట్రస్థాయిలో పలు అవార్డులందాయి. ‘సహ’ చట్టం ఆవశ్యకత, వినియోగంపై యాదవ్‌ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించాడు.

ప్రఖ్యాత బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) యాదవ్‌ని ‘ది అన్‌సంగ్‌ హీరోస్‌’ అనే కార్యక్రమంలో ఇండియా నుంచి ఎంపిక చేసి అతడిపై ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. గుక్క తిప్పుకోలేని ప్రశ్నలు సంధించి విలువైన సమాచారం రాబడుతూ అవినీతిరహిత గ్రామాన్ని తెచ్చాడని కొనియాడింది.

ఈ అవార్డులు, గుర్తింపుకన్నా గ్రామస్తులు చూపే ఆప్యాయతే నాకు గొప్ప అంటారు  యాదవ్‌.  “నేను ఆర్టీఐని ఉపయోగించి  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సాధారణ వ్యక్తిని. నాకు కొద్దిమంది స్నేహితులు తప్ప వనరులు లేవు. ఆర్టీఐ చట్టం యొక్క సెక్షన్ 6 (1) ను నేను ఉపయోగించుకుంటాను” అంటారు యాదవ్. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!