ఆయనో కెమెరా ఇంద్రజాలికుడు !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………….

దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం.ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే.తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన.

స్వీయ దర్శకత్వంలో తొలి సారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు.సముద్రాలతో స్క్రిప్ట్ రాయించారు. టైటిల్ సీతారామకళ్యాణం.అందులో రావణ పాత్ర తాను ధరించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.రావణ పాత్రకు సంబంధించిన అనేక ట్రిక్ షాట్స్ కావాలి. వాటిని తీసే కెమేరామెన్ కోసం ముంబై వెళ్లారు రామారావు. అక్కడ చాలా మంది రవి కాంత్ నగాయిచ్ గురించి చెప్పడంతో తీసుకువచ్చారు.

అలా అన్నగారి సినిమాతో పూర్తి స్థాయి డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అయ్యారు రవినగాయిచ్.రవినగాయిచ్ ఉత్తరప్రదేశ్ అలీఘర్ వాసి. ముగ్గురు అన్నదమ్ముల్లో ఆఖరువాడు రవి.పెద్దన్న అమెరికాలో ఏరోనాటికల్ ఇంజనీర్..రెండో అన్న పార్లే కంపెనీలో ఉన్నతోద్యోగి.రవికి చిన్నప్పట్నించి కెమేరామెన్ కావాలని సినిమాలు తీయాలని ఆశ.

తండ్రితో చెప్పి చలో ముంబై అన్నాడు. అక్కడ ప్రఖ్యాత తాంత్రిక ఛాయాగ్రాహకుడు బాబూభాయ్ మిస్త్రీ దగ్గర పనిలో చేరాడు. మిస్త్రీ గారు కూడా తెలుగు సినిమాలకు పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన మాయామశ్చీంద్ర సినిమాలోనూ ఎన్టీఆరే హీరో. ఆ విషయం పక్కన పెట్టేస్తే … అలా తెలుగు సినిమా సీతారామకళ్యాణంతో టాలీవుడ్ కి వచ్చేశారు రవికాంత్ నగాయిచ్.

సీతారామకళ్యాణంలో రావణాసురుడు ఆగ్రహంతో కైలాసాన్నిపెకలించే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు రవినగాయిచ్. బొమ్మలు పెట్టి తీసేయొచ్చు…కానీ రవి, ఎన్టీఆర్ అలా చేయాలనుకోలేదు. మాస్క్ షాట్స్ తీశాడు రవి. ఒకే ఫిలింను అనేక సార్లు ఎక్స్ పోజ్ చేయడమన్నమాట. పదితలలు రావడం ఆ తర్వాత కైలాసాన్నివాటి మీద పెట్టడం…అంతా కలిపి రెండున్నర రోజులు పట్టింది. రామారావు ఓకే అనేసి పూర్తి సహకారం అందించారు.

కె.వి.రెడ్డి మార్కస్ భార్ ట్లే తో అద్భుతాలు చేయించినట్టు ఎన్టీఆర్ రవినగాయిచ్ తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయే సీన్స్ ఎన్నో తీయించారు.రామారావు స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన జానపద చిత్రం గులేబకావళి కథలో అస్తి పంజరాలతో రామారావు తలబడే సన్నివేశం ఒకటుంది.దాని కోసం…నియాన్ లైట్లతో అస్తి పంజరాలు చేయించారు రవి.

వాటిని బ్యాటరీతో నడిచే యంత్రంతో నడిపించాడు.తాంత్రిక ఛాయాగ్రహణం పండాలంటే…మినియేచర్ టెక్నిక్కే గతి ఆ రోజుల్లో. అలా మినియేచర్ షాట్స్ తీసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేయడం రవినగాయిచ్ గొప్పతనం. మినియేచర్ తో పాటు హైస్పీడు…లో స్పీడు కెమేరా వాడడం కూడా ట్రిక్ షాట్స్ కు అవసరం.

ఆర్ట్ డైరక్టర్ తో కలసి తను తీయబోయే సన్నివేశానికి అనుగుణంగా సెట్ డిజైన్స్ ఇవ్వడం అత్యవసరం. నిర్మాత దర్శకులకు ఓర్పు ఉండాలేగానీ…అద్భుతాలు చేయచ్చనేవాడు రవి. మినియేచర్ టెక్నాలజీని వాడి జనాలతో వావ్ అనిపించడం రవికి సరదా. బాపు సంపూర్ణ రామాయణంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం అనే సీన్ చాలా గొప్పగా తీశారు రవి.

ఆ సినిమా విడుదలైన కొత్తలో ఆ సీన్స్ చూడ్డానికి పిల్లలు ఎగబడ్డారు. స్కూళ్లలో కథలు కథలుగా చెప్పుకునేవాళ్లు. అంతటి ప్రభావం వేస్తుంది ట్రిక్ ఫొటోగ్రఫీ పండితే. పాటల్లో కూడా తాంత్రిక చాయాగ్రహణం చేసిన చరిత్ర రవినగాయిచ్ కు ఉంది. వీరాభిమన్యులో రంభా ఊర్వశి తలతన్నే…పాటను రవి నగాయిచ్ సూపర్ ఇంపోజ్ పద్దతిలో షూట్ చేసి ఆడియన్స్ ను ఆశ్చర్య చకితులను చేశాడు. 

రవినగాయిచ్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలకే పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో జానపద బ్రహ్మ విఠలాచార్య తెరకెక్కించిన సినిమాల్లో రవి చెలరేగిపోయేవాడు. తెలుగు తెర మీద మొదటిసారి మాస్క్ షాట్స్ తీసిన ఘనత కూడా రవిదే.అగ్గిపిడుగు సినిమాలో ఇద్దరు రామారావులు తలపడి కత్తి యుద్దం చేసే సీన్ ఒకటి రవి అద్భుతంగా చిత్రీకరించాడు. ఫిల్మ్ లో సగం మాత్రమే ఎక్స్ పోజ్ చేస్తూ తీసిన ఆ ఫైట్ కు మంచి పేరొచ్చింది. 

వీరాభిమన్యులో అభిమన్యుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అర్జునుడు నిందించే సన్నివేశం ఒకటి ఉంది. అప్పుడు శ్రీ కృష్ణుడు మరోసారి అర్జునునికి తన విశ్వరూపం చూపించి సందేహ నివృత్తి చేస్తాడు. ఆ సీన్ కలర్ లో చిత్రీకరించారు నిర్మాత డూండీ. దాంతో రవి నగాయిచ్ కు అవకాశం చిక్కింది. ఈ సన్నివేశ చిత్రీకరణకు ఏకంగా ఒకే ఫిలింను 45 సార్లు ఎక్స్ పోజ్ చేసి రికార్టు కొట్టాడు. ఎన్టీఆర్ తర్వాత రవి నగాయిచ్ ను ఎక్కువగా ఆదరించింది నిర్మాత డూండీనే.

సుందర్ లాల్ నహతా, డూండీ కలసి ఉన్న బ్యానర్ రాజ్యలక్ష్మీ పిక్చర్స్ లో కెమేరా యూనిట్ ప్రారంభించారు. ఆ యూనిట్ కు రవినగాయిచ్ ను చీఫ్ గా నియమించారు. రాజ్యలక్ష్మీ యూనిట్ లో రవి దగ్గర పనినేర్చుకున్న వాళ్లలో వి.ఎస్.ఆర్ స్వామి, ఎస్.వెంకటరత్నం ఉన్నారు. నందమూరి బ్రదర్స్ తర్వాత రవికాంత్ నగాయిచ్ తో సాన్నిహిత్యం ఉన్నది నిర్మాత డూండీ దర్శకుడు బాపులకే.

డూండీ తో బందిపోటు సినిమా నుంచి రవి నగాయిచ్ ప్రయాణం ప్రారంభమైంది. బందిపోటులో మాయలూ మంత్రాలూ గారడీలు లేకపోయినా…కథకు తగ్గ మూడ్ క్రియేట్ చేస్తూ కెమేరా సాగుతుంది. అలా ట్రిక్ షాట్స్ లేకుండా కథకు తగిన పద్దతిలో కెమెరా దర్శకత్వం వహించడం రవి లాంటి వాళ్లకు కష్టమే. వేరే కెమేరామెన్ పనిచేస్తున్న సినిమాల్లో కూడా ట్రిక్ షాట్స్ వరకు రవి వెళ్లి తీసిన సందర్భాలున్నాయి.

అయితే ఆయన పూర్తి గా ఓ సాంఘిక చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం చేయడం అనేది తెలుగుకు సంబంధించినంత వరకు వరకట్నం చిత్రంతోనే ముగిసింది. బాపు కి రవినగాయిచ్ తో చాలా అనుబంధం ఉంది. బాపు రమణల సీతాకళ్యాణం సినిమా రవినగాయిచ్ కు అంతర్జాతీయంగా గొప్ప పేరు తెచ్చింది.

ముఖ్యంగా గంగావతరణం సన్నివేశాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు రవినగాయిచ్. బాపు వేసిన బొమ్మల ఆధారంగా సన్నివేశ కల్పన చేసి గొప్ప ఎఫెక్ట్ తీసుకువచ్చారు. చాక్ పీస్ పొడి వాడి తీసిన గంగావరణం సీన్ ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. బాపు దర్శకత్వంలోనే వచ్చిన రాజాధిరాజు సినిమాలో కూడా రవి నగాయిచ్ కెమేరా పనితనం కనిపిస్తుంది.

ఆ సినిమా ఆపరేటివ్ కెమేరామెన్ లోక్ సింగ్ రవి దగ్గర ట్రిక్ షాట్స్ తీసే విధానం తెల్సుకోవడం విశేషం. ముఖ్యంగా రాజాధిరాజులో సైతాను పాత్రధారి నూతన్ ప్రసాద్ ఎంట్రన్స్ సన్నివేశాలు…చాలా గొప్పగా చిత్రీకరించారు రవి నగాయిచ్. రవి నగాయిచ్ కూడా కెమేరాతో పాటు మెగాఫోన్ కూడా పట్టుకున్నారు. గూఢచారి 116 సినిమాను డూండీ హిందీలోకి రీమేక్ చేసినప్పుడు దాని దర్శకత్వ బాధ్యతలు రవికే అప్పగించారు.

దీంతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలు మరికొన్ని బాలీవుడ్ మూవీస్ కు ఆయన దర్శకత్వం వహించారు. ప్రతిభకు ఎక్కడైనా గు్ర్తింపు దక్కక తప్పదనేది రవి నిశ్చితాభిప్రాయం. ది ట్రెయిన్, హిమ్మత్, మోర్చా, సౌగంధీ, గోల్డ్ మెడల్, డ్యూటీ లాంటి సినిమాలు రవి నగాయిచ్ దర్శకత్వంలో దూపుదిద్దుకున్నవే.

తెలుగులో కృష్ణ హీరోగా తెరకెక్కిన జానపదం మహాబలుడు కి రవి నగాయిచ్ దర్శకత్వం వహించారు. ఆ మూవీ నిర్మాత డూండీ ప్రేరణతో పి.మల్లికార్జునరావు తీసినదే. కోదండపాణి సంగీతం అందించిన మహాబలుడు మ్యూజికల్ గా కూడా మంచి విజయాన్ని సాధించింది.సినిమానే ప్రేమించి సినిమానే శ్వాసించిన రవినగాయిచ్ 1991 జనవరి ఆరున చెన్నైలోనే కన్నుమూశారు.

తను పుట్టింది పెరిగింది ఉత్తర భారతదేశంలోనే అయినా..తనను సినిమాటోగ్రాఫర్ ని చేసిన దక్షిణ భారత సినీ రాజధాని చెన్నైలోనే కన్నుమూశారు.ఆయన లేకపోయినా…ఆయన చేసిన అద్భుతాలు మాత్రం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాయి
.————–

Mani Bhushan ………….

“ఏమిటి? కొత్త కెమెరామేన్ ఎలా ఉన్నాడు” అని తమ్ముడు-కమ్-నిర్మాత త్రివిక్రమరావుని అడిగారు ఎన్‌టిఆర్. “ఏమో! ఏమీ అర్థం కావడం లేదు. హడావుడిగా వస్తున్నాడు. ఏదో షూట్ చేసుకుని వెంటనే డార్క్ రూమ్‌లో దూరుతున్నాడు” అన్నారట త్రివిక్రమరావు.

రెండు నిమిషాలు కనిపింఛే ఒక సన్నివేశాన్ని 20సార్లు డెవలప్ చేసిన ఆ కెమెరామేన్ పేరు రవికాంత్ నగాయిచ్. ‘సీతారామ కల్యాణం’ తెలుగులో ఆయన మొదటి సినిమా. వెండితెరపై రకరకాల గమ్మత్తులు చేసే ట్రిక్ ఫొటోగ్రఫీ పితామహుడు బాబూభాయ్ మిస్త్రీకి శిష్యుడు రవికాంత్.

‘సీతారామ కల్యాణం’లో  పైన కైలాసంలో శివ పార్వతుల నృత్యం… కింద రావణుడు 10 తలలతో కైలాసాన్ని పెకలించడం, పర్వతంపై సెలయేళ్లు దూకుతున్న దృశ్యం… అన్నీ ఒకే ఫ్రేమ్‌లో వచ్చేలా చేయడం రవికాంత్ నగాయిచ్ ప్రతిభకు నిదర్శనం. ఆ తర్వాత ఉదరం చీల్చి.. ప్రేగులు బయటకు తీసి రుద్ర వీణ వాయించే దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించారు.

అందరూ సీతారామ కల్యాణంలో కెమెరా పనితనాన్ని పొగుడుతుంటే, “కెరటాలు లంకని తాకకుండా బయటకు వస్తున్నాయి. కొంచెం శ్రద్ధ చూపాల్సింది” అనడం నగాయిచ్ వినయం.

.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!