హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు. వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ నది మీదుగా సాగే చాదర్ ట్రెక్ లో పాల్గొంటే ఈ గడ్డ కట్టిన జలపాతాలను చూడ వచ్చు.
ఈ చాదర్ ట్రెక్ మూడు రోజులు సాగుతుంది. వాతావరణం అనుకూలించక పోతే మరింత సమయం పట్టవచ్చు. ఈ ట్రెక్ లో మూడు చోట్ల క్యాంపులుంటాయి. మొదటి క్యాంప్ లో తిలాడ్ సుమడో ప్రదేశం వస్తుంది. ఇక రెండో క్యాంప్ నెరాక్ జలపాతం దగ్గర్లో ఉంటుంది. ఇక్కడే మనం గడ్డకట్టిన జలపాతాన్ని చూడవచ్చు.
కొండ పైనుంచి కిందకు దూకుతున్న జలధారలు ప్రవహిస్తున్న దశలోనే ఘనీభవిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం పేరే నెరాక్. ఆప్రాంతాన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు. గడ్డకట్టిన జన్ స్కార్ నది మీదుగా నడుచుకుంటూ వెళ్లి ఆ ఘనీభవించిన జలపాతాన్ని చూడటం ఓ థ్రిల్లింగ్ అనుభవం. ఈ జలపాతాన్ని చూడాలంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వెళ్ళాలి. ఎండాకాలపు రోజుల్లో వెళితే పై నుంచి మంచు కరిగి కిందికి జాలువారే జలధారలను చూడొచ్చు. మొత్తం ట్రెక్ లో పాల్గొనాలి.
అక్కడికి దగ్గర్లోనే నెరాక్ గ్రామం కూడా ఉంది. అక్కడ రెండు కొండల నడుమ ఒక చెక్క వంతెనను అమర్చారు.ఇది పాత చెక్క వంతెన, ఒకేసారి నలుగురు కంటే ఎక్కువ మంది వెళితే కూలిపోయేలా ఉంటుంది. గైడ్స్ అందరిని అనుమతించరు. ఆ వంతెన పైనుంచి చూస్తే నెరాక్ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.
లోతైన లోయలు .. చుట్టూ పెద్ద కొండలు .. చల్లటి గాలులతో ఈ చాదర్ ట్రెక్ మార్గం అందం గా..అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. కానీ అక్కడికి వెళ్లడం అందరికి సాధ్యం కాదు. రిస్క్ చాలా ఉంటుంది. ఆ వాతావరణాన్ని తట్టుకునే వారే వెళ్ళాలి. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు -25 లేదా అంతకంటే తక్కువకు పడిపోతుంటాయి. .