Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ జాతికి చెందినవారు కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారు. వీరిలో కట్టు బానిసలు కూడా ఉన్నారు. వారంతా ఈ ప్రాంతంలో రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే స్థిర పడిపోయారు. ధైర్యసాహసాలకు వీరు పెట్టింది పేరు. మెల్లగా ఈ ప్రాంతంపై పట్టు బిగించారు.
అప్పట్లో అహ్మద్ నగర్ ను పాలిస్తున్న నిజాం షాహీ ప్రభువు వీరిని స్వయంప్రతిపత్తి కలిగిన రాజులుగా గుర్తించాడు. సిద్ధీ మాలిక్ అంబర్ ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతని హయాంలో సముద్రం లో ఉన్న చిన్న ద్వీపంలో ఈ జంజీరా కోట నిర్మాణం మొదలైంది. ఆయన వారసుడు సిద్ధీ సురల్ ఖాన్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసాడు. ఎందరో రాజులు ఈ కోటను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. యుద్ధాలకు వచ్చారు. దాడులు చేశారు.అయినప్పటికీ సిద్ధీ జాతి యోధుల ధాటికి నిలబడలేక పోయారు. కనీసం కోట గోడను.. దాని నీడను కూడా తాకలేక పోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు జంజీరా స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఆ తర్వాత ఇండియాలో విలీనమైంది.
పోర్చుగీసు వారు ఈ కోటపై కన్నేశారు. ఎలాగైనా ఆక్రమించాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఛత్రపతి శివాజీ కూడా ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి ఆరు సార్లు ప్రయత్నించాడు. కానీ ఆయనకు సాధ్యం కాలేదంటారు. ఇతర మరాఠా యోధులు కూడా సాహసం చేసి చేతులెత్తేశారు.
మురుద్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపురి గ్రామం నుంచి ఈ జంజీరా కోట కు చేరుకోవచ్చు. అక్కడ నుంచి మరబోట్లు.. నాటు పడవల్లో కోటకు వద్దకు వెళ్ళాలి. జనం పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు.
ఈ కోట చుట్టూ 22 బురుజులు ఉన్నాయి. ఈ కోట బురుజుల వద్ద పెద్ద ఫిరంగులు పెట్టేవారట. ఒకప్పుడు 500 కి పైగా ఫిరంగులు ఉండేవంటారు. ప్రస్తుతం మూడు మాత్రం ఉన్నాయి. ఇంకా రాజ ప్రాసాదాలు, దర్బార్ హాల్, రాణివాసం, ధాన్యాగారం ఇలా ఎన్నోఉన్నాయి.
1970 వరకు కొన్ని కుటుంబాలు కోటలో నివసించేవి అంటారు. కొన్ని అంతస్తులు కూలిపోయాయి. తాగు నీటి సదుపాయం కోసం మంచి నీళ్ల బావి, చిన్నకొలను కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇలాంటి నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమే.
మురుద్ కి దగ్గర్లోనే ఉన్న గరంబి జలపాతం, అహ్మద్‌గంజ్ ప్యాలెస్ లను కూడా సందర్శించవచ్చు. మురుద్ బీచ్ రిసార్ట్ యాత్రికులకు అందుబాటులో ఉంది. మహారాష్ట్ర వెళ్ళినపుడు ఈ జంజీరా కోటను చూసి రావాల్సిందే. ముంబయి నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు ,క్యాబ్ లు దొరుకుతాయి.పూణే నుంచి 182 కిలోమీటర్లు .. రాయఘడ్ నుంచి 85 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళితే ఆ ప్రాంతంలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలను చూసి రావచ్చు.