Sculptural skills
పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్ ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్నఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు.
పర్వతంపై 83 మీటర్ల ఎత్తున ఉన్నశిలలో అత్యద్భుతంగా వీటి నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయ సముదాయ నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ… ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటిని పూర్తిచేశారు. దేవాలయం అభివృద్ధి కి మదురై నాయకులు ఎంతో కృషి చేశారు. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్‌ఫోర్ట్‌ను పర్వత శిఖరానికి 437 మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం. మెట్లు ఎక్కడంలో అంత ఇబ్బంది ఏమి ఉండదు. మరీ పెద్ద వారైతే నిదానంగా ఎక్కవచ్చు.
పర్వత పాదాల వద్ద ‘మనిక వినాయకర్’ దేవాలయం ఉండగా… పర్వత శిఖరం వద్ద ‘ఉచ్చి పిల్లయార్ కోయిల్’ ఉంది. ఇక్కడే ప్రసిద్ధిగాంచిన శివాలయం ‘తాయుమనస్వామి దేవాలయం’ ఉన్నది. శిలను చెక్కి అపురూపంగా మలిచిన ఈ శివక్షేత్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయంలో… “లలితాంకుర పల్లవేశ్వరం” పేరిట పల్లవులు నిర్మించిన దేవాలయం కూడా ప్రఖ్యాతి గాంచినదే.
ఇక్కడ ఎన్నో అరుదైన శాసనాలు పల్లవ రాజు మహేంద్ర వర్మన్ కు సంబంధించిన విశేషాలను తెలియజేస్తాయి. కొండపై ఉన్న రెండంతస్థుల తాయుమనస్వామి దేవాలయం ఇక్కడి నిర్మాణాల్లోనే అద్భుతం గా ఉంటుంది. అపురూప శిల్పకళా నైపుణ్యం గోచరిస్తుంది. ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి.
మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్ దేవస్థానం. ఇవన్నీ 6 వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న తాయుమాన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు. తమిళనాడు వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ఆలయాలు ఇవి.
ఇక ఇక్కడికి చేరుకోవడం సులభమే. రాక్‌ఫోర్ట్ టెంపుల్ కి 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఉంది. చెన్నై మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సౌకర్యం ఉంది.అలాగే రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా రాక్‌ఫోర్ట్ టెంపుల్ చేరుకోవచ్చు.
దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్ తిరుచ్చి. ఇక్కడి నుండి చెన్నై, తంజావూర్, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్ గేజీ లైను ఉంది. అలాగే బెంగుళూరు, కోయంబత్తూర్, మైసూర్, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్‌గేజ్ లైన్ ఉంది. ప్రతిరోజు ఈ జంక్షన్ నుండి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాల నుండి బస్సులున్నాయి.
————– Theja