మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు.
స్థల పురాణం ప్రకారం ఉప్పు అమ్ముకొని జీవించే భక్తుడు శివరాత్రి రోజున పరమ శివుని పూజించడానికి శివలింగం లబించక పోవడం తో తన వద్ద ఉన్న మానిక ( కొలపాత్ర) ను లింగం గా భావించి పూజలు చేస్తాడు. శివుడు అతగాడి భక్తికి మెచ్చుకుని ఆ మానిక నే శివలింగం గా మార్చేస్తాడు. ఆందుకని ఈ క్షేత్రానికి మణికేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.
చరిత్రకారుల కథనం ప్రకారం ఒకప్పుడు ఇది బౌద్ధక్షేత్రం గా విలసిల్లింది. ఆలయానికి ముందుభాగంలో ఉన్న పాలరాతి స్థంభం… లోపల స్థంభాలపై ఉన్న అక్షరాలు, బౌద్ధపు ఆనవాళ్ళను తెలియ జేస్తున్నాయి. ఇవి క్రీ.శ.మూడవ శతాబ్దం నాటివని అంటారు.
దేవాలయ ప్రాంగణంలో కొన్నిశాసనాలు .. స్థంభాలపై కలువపువ్వు రేకులు, సింహం బొమ్మకనిపిస్తాయి. కార్తీక మాసం…శివ రాత్రి సమయాల్లో ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మణికేశ్వరుని మొక్కు కుంటే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న శ్మశానంలో శవదహనాలు జరుగుతుంటాయి. గుండ్లకమ్మ నదీ ప్రవాహం ఈ ఆలయాన్ని అనుకుని వెనుక భాగమైన పడమటి దిశ గా పారుతుంది. ఈ పరిసరాలను బట్టే మణికేశ్వరాన్ని చిన్నకాశీ అంటారు. ఒకప్పుడు ఈ శ్మశానంలో పేరుతెలియని పురాతన వృక్షం ఉండేది. కార్తీక మాసం లోనే అది పూలు పూచేది అంటారు. అయితే మల్లవరం జలాశయం నిర్మించిన పిదప మణికేశ్వరంలోని ఈ ప్రాంత మంతా నీటి నిల్వలు పెరగటంతో ఆవృక్షం అంతరించి పోయిందని భక్తులు చెబుతుంటారు.
అదలా ఉంటే మణికేశ్వరానికి చారిత్రిక ప్రాధాన్యత కూడా ఉంది. గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్ద కాలానికి చెందిన రాక్షస గూళ్ళు బయటపడ్డాయి.. ధర్మవరం కొణిదెన ప్రాంతాలలో జైన, బౌద్ధకాలాల నాటి అనేక పురాతన కట్టడాల ఆనవాళ్ళు, రాతి సమాధులు బయటపడ్డాయి.
——————— Subbarao Adimulam
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>> లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..