ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ లో ప్రస్తుత ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. వాజపేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగ మార్గానికి ” అటల్ టన్నెల్ ” గా నామకరణం చేశారు.
ఈ సొరంగ మార్గం మనాలీ … స్పితి లోయ ను అనుసంధానం చేస్తుంది. ఈ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తే మనాలి -లేహ్ ప్రాంతాల మధ్య 45 కి. మీ దూరం తగ్గుతుంది. ఈ సొరంగం ద్వారా లడక్ లేహ్ ప్రాంతానికి ఏడుగంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఈ సొరంగ మార్గ నిర్మాణానికి రూ. 3500 కోట్లు ఖర్చు అయింది. 9. 02 కిలోమీటర్ల పొడవు గల ఈ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం అని చెప్పుకోవచ్చు.
ఏడాది పొడవునా నిత్యం ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చు. అన్ని వాతావరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. గతంలో రోహతాంగ్ నుంచి లేహ్ వెళ్లాలంటే ఇబ్బంది పడేవారు. ఏడాదిలో ఆరునెలలు విపరీతంగా కురిసే మంచు వలన రోడ్డు మార్గం మూసుకు పోయేది. ప్రయాణం సులువుగా సాగేది కాదు. ఇపుడు ఈ సొరంగ మార్గంలో వెళితే అలాంటి సమస్యలు ఉండవు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లద్దాఖ్ కు రాకపోకలు పెరుగుతాయి. దేశంలోని మిగతా భాగాలతో సంబంధాలు మెరుగు పడతాయి. ఈ అనుసంధానం పర్యాటక రంగ అభివృద్ధికి దారి తీస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
టన్నెల్ ప్రత్యేకతలు
@ సొరంగమార్గంలో ప్రతి అరవై మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 150 మీటర్ల దూరంలో టెలిఫోన్ సదుపాయం ఉంటుంది.
@ ప్రతి 500 మీటర్లకు ఒక చోట ఎమర్జెన్సీ డోర్ నిర్మించారు. ప్రతి 250 మీటర్ల కు ఒకచోట మైకు , సీసీ టీవీలు బిగించారు.
@ సొరంగం లోపల డబుల్ లేన్డ్ మార్గం ఉంటుంది. 8 మీటర్ల రహదారి కాబట్టి ప్రయాణానికి అనువుగానే ఉంటుంది. సొరంగం వెడల్పు 10. 5 మీటర్లు. @ సొరంగమార్గంలో గంటకు 80 కిమీ వేగం తో ప్రయాణం చేయవచ్చు.
@ ఈ సొరంగంలో అత్యాధునిక ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థ ఉంది. 24 గంటలు ఉండే లైటింగ్ వ్యవస్థ కూడా ఉంది. దాదాపు 18 ఏళ్ళ పాటు కొండలను తొలుస్తూ ఈ సొరంగమార్గం నిర్మించడం నిజంగా గొప్ప విషయమే.